అక్షరాస్యతతోనే అభివృద్ధి


Sun,September 8, 2019 03:04 AM

-అక్షరంతో అన్నింటా వెలుగు
-వ్యక్తిత్వ వికాసంతో దోహదం
-నైపుణ్యాలను పెంచుకోవచ్చు
-నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: అక్షరం అభివృద్ధికి ఆయుధం.. చదువుకున్న వారు అధికంగా ఉన్న సమాజం పురోగతిలో దూసుకుపోతుంది. అ.. ఆ..ల అనుబంధం అటువంటిది. వందశాతం అక్షరాస్యత ప్రభుత్వాల లక్ష్యం. కానీ స్వాతంత్య్రం వచ్చి ఏడు పదుల సంవత్సరాలు దాటినా లక్ష్యం చేరుకోలేదు. గ్రామీణ జనాభా అధికంగా ఉన్న మనలాంటి దేశాల్లోనే సమస్య వెంటాడుతోంది. చదువుకోవాలన్న కోరిక ఉన్నా చదువుకు దూరంచేసే కారణాలు అనేకం ఉండడమే అసలు సమస్య అవుతోంది. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. అందరికీ విద్య అందుబాటులో ఉంచేందుకు ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. అయితే అక్షరాస్యతలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేక పోతున్నాం. క్షేత్రస్థాయిలో అధికారులు, నేతల తీరుతో ఇప్పటికీ అక్షరాలు రాక వేలిముద్రలు వేసే వారు చాలా మంది ఉన్నారు. ఏదేమైనా వ్యక్తిగత వికాసానికి, సమాజ అభివృద్ధికి అక్షరమే సోపానం.

శతశాతం గ్రామాల్లేవు..
జ్ఞానవంతులు ప్రపంచానికి దారిచూపిస్తారన్నది ఎంత నిజమో.. అభివృద్ధి చెందిన దేశాలను, రాష్ర్టాలను చూస్తే అర్థమవుతోంది. చదువుతో చైతన్యం.. ఆ చైతన్యం నుంచి ప్రగతి సాధ్యమౌతుంది. అక్షరమనే ఆయుధంతో బతుకుపోరులో విజయం సొంతం చేసుకోవచ్చు. ఇన్నేండ్లు స్వతంత్ర భారతావనిలో ఇంకా పలకా బలపం పట్టని చిన్నారులున్నారంటే ఆవేదన కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లోపం, మారుమూల ప్రాంతాల్లో నివాసం వంటి అంశాలు ఇందుకు కొంత కారణం. అయితే మైదాన ప్రాంతాల్లోనూ ఇటువంటి వారి సంఖ్య అక్కడక్కడా కనిపించడం మన దుస్థితికి నిదర్శనం. 2022 నాటికి రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు ప్రణాళికలు, కార్యక్రమాలు రూపొందించి ఉన్నా రు. ఏడాదికేడాదే కాకుండా ఏడాది పొడవునా పిల్లలను బడిలో చేర్పించేలా కార్యక్రమాలను ని ర్వహిస్తూ అక్షరాస్యత పెంపుకు కృషిచేస్తున్నారు.

అక్షరాస్యతపై దృష్టి ఎప్పటి నుంచి..
1965 నవంబర్ 17వ తేదీ యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల సదస్సు జరిగింది. ఆ సదస్సుకు హాజరైన పలు దేశాల మంత్రులు మాట్లాడుతూ అభివృద్ధికి, అక్షరాస్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. చాలా దేశాలు వెనుకబడి ఉండటానికి నిరక్షరాస్యతే కారణమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అక్షరాస్యత పెంపునకు ప్రత్యేక కృషి జరగాలని తీర్మానించారు. ఈ సభ అనంతరం యునెస్కో అక్షరాస్యత ఉద్యమాన్ని ప్రారంభించింది. యునెస్కో సూచనల మేరకు 1966 నుంచి ఏటా సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వ్యక్తులు, సమాజాన్ని అక్షరాయుధులు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కేవలం బడిపిల్లల్లోనే కాకుండా వయోజన విద్యాభివృద్ధికి కృషి చేయడం కూడా దీని ఉద్దేశం. 1990ని అక్ష్యరాస్యత సంవత్సరంగా యునెస్కో ప్రకటించింది. 2003- 2012 కాలాన్ని అక్షరాస్యత దశాబ్దంగా ప్రకటించింది. లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఫర్ ఆల్, లెర్నింగ్ ఫర్ ఆల్ అనే నినాదాలు రూపొందించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...