ఏడు కొండల వెంకన్నకు ఏరువాడ పంచెలు


Tue,August 20, 2019 01:11 AM

-గద్వాల సంస్థానం కానుక
-నామాల మగ్గంపై జోడు పంచెలు నేస్తున్న కార్మికులు
-ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు నేత
-సెప్టెంబర్ 5న టీటీడీ అధికారులకు అందజేత
-దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొదటిరోజు స్వామివారికి అలంకరణ

గద్వాల, నమస్తే తెలంగాణ : ఏటా అశ్వయుజ మాసంలో ప్రారంభమయ్యే తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు గద్వాల చేనేత పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉన్నది. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల వేంకటేశ్వరుడికి ఇక్కడ నేత మగ్గంపై తయారు చేసే ఏరువాడ జోడు పంచెలను అలంకరించిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం గద్వాల చేనేత పరిశ్రమ చేసుకున్న పుణ్యఫలంగా కార్మికులు భావిస్తారు. ఈ ఏడాదిలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు శ్రీవారికి ఏడువాడ జోడు పంచెలను అలంకరించేందుకుగానూ నిపుణులైన చేనేత కార్మికులు నామాల మగ్గంపై అహోరాత్రులు నిమగ్నమై పంచెలను నేస్తున్నారు. ఇప్పటికే ఒక పంచె పూర్తికాగా సెప్టెంబర్ 2వ తేదీ నాటికి మరో పంచె పూర్తిచేసి తిరుమలలో ప్రధాన అర్చకుడికి అందజేయనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన తిరుమల ఈవోకు రెండు పంచెలు అందజేయనున్నారు. గద్వాల సంస్థానం నుంచి బ్రహ్మోత్సవాల కానుకగా అందే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు మండల(41 రోజులు) కాలం పడుతుంది. శ్రావణమాసం ప్రారంభం నుంచి నామాల మగ్గంపై నేత పనిని ప్రారంభించి ముగ్గురు నేత కార్మికులు సాంప్రదాయబద్దంగా నేస్తున్నారు. వారికి మరో నలుగురు సహకార మందిస్తున్నారు. నేసిన వారిలో మ్యాడం రమేశ్, సాకే సత్యం, షణ్ముఖరావు, గద్దె మురళి ఉన్నారు. మగ్గం నేసేటప్పుడు ఏ ఒక్కరూ తప్పు చేసిన ముందుకు సాగదు. దైనందిన జీవితంలో తెలిసీ తెలియక తప్పులు దొర్లితే మగ్గం దగ్గరికి వచ్చే సమయానికి ఆ విషయం తమకు పరోక్షంగా జరుగుతుందని నేతన్నలు తెలిపారు. జోడు పంచెలు తయారు మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందజేసేవారు. మగ్గం ఉన్న చోట ఇంట్లో నిత్యం పూజలు చేయడం గోవింద నామస్మరణ చేసుకుంటూ పనికి ఉపక్రమించడం నిత్యకృత్యం. సంస్థానాధీశుల తరపున ఎనిమిదేండ్లుగా ఏరువాడ పంచెలను జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారి మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో నేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరోసారి జోడుపంచెలను శ్రీవారికి అందజేయనున్నారు. నిత్యం ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉపవాసంతో నేతన్నలు ఈ పంచెలను నేస్తున్నారు. శ్రావణమాసంలో పంచెల తయారీని ప్రారంభించి తిరుమల బ్రహ్మోత్సవాల వరకు పూర్తి చేస్తారు.

జోడు పంచెల విశేషం
దేశం నలుమూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. వాటిని కేవలం అలంకార ప్రాయంగా ప్రత్యేక వేడుకలలో మాత్రమే శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కళాకారులు తయారు చేసిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను మాత్రం శ్రీవారి మూలవిగ్రహానికి అలంకరించడం ఈ జోడు పంచెల్లో దాగి ఉన్న విశేషం. 11 గజాల పొడవు, 85 ఇంచుల వెడల్పు, ఇరువైపులా 12 ఇంచుల బార్డర్‌తో కంచుకోట కొమ్మ నగిశీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడ పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. ఈ జోడు పంచెలపై రాజకట్టడాలకు గుర్తుగా కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా తయారు చేస్తున్నారు. సాంకేతికంగా నేత పనిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా అనాదిగా నూలు, రేషం కలయికతో జోడు పంచెలను సంప్రదాయబద్దంగా తయారు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత సంపాదించుకున్న ఈ ఏరువాడ జోడు పంచెలను చూడటానికి వెళ్లాలంటే శుచీ శుభ్రతను పాటించాల్సిందే. ఇక్కడినుంచి జోడు పంచెలు అందజేయడం గద్వాల ఖ్యాతిని ఎంతో ఇనుమడింపచేస్తోందని జోడు పంచెల తయారీని పర్యవేక్షిస్తున్న మహంకాళి కరుణాకర్ తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...