పెరిగిన పత్తి సాగు


Sun,August 11, 2019 10:50 PM

-పత్తి సాగుకు అనుకూలంగాఈ సారి వర్షాలు
-మొదటి దశ పూర్తయిన కలుపు తీత పనులు
- గులాబీ పురుగు నివారణకు చర్యలు
-వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు
- తగ్గిన వరి, మొక్క జొన్న పంటల సాగు విస్తీర్ణం

తాండూరు, నమస్తే తెలంగాణ: పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు పత్తి సాగుపై దృష్టి పెట్టారు. మొక్కజొన్న, వరిసాగు తగ్గడంతో ఆ విస్తీర్ణం మొత్తం పత్తి అక్రమించినట్లు సమాచారం. ముందెన్నడూ లేని విధంగా జిల్లాలో 44, 239 హెక్టార్ల పత్తి సాగు విస్తీర్ణం పెరుగగా దిగుబడి అంచనా పెరిగింది. పత్తిలో మొదటి దఫా కలుపు పనులు పూర్తి కావడంతో ఎదుగుదలకు ఎరువులు వేయడంతో పది రోజుల పాటు కురిసిన వర్షంతో పత్తి పంటలు ఏపుగా పెరిగాయి. జిల్లాలో గత రెండేండ్లుగా రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగు చేయడంతో పంటలో గులాబీ పురుగు ప్రభావంతో నష్టాలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ ఏడాది రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు గులాబీ పురుగు నివారణ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పింక్‌బౌల్ నివారణకు ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లదని అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తిని ఎక్కువగా పండించడంతో ఇటీవల కురిసిన వర్షంతో పంటపొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. కత్తెర పురుగు బెడదతో మొక్కజొన్న, వరిసాగుతో పాటు జిల్లాలో పెసరు, మినుముల, జొన్నల విస్తీర్ణం తగ్గింది. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో ఇతర పంటలపై ఆశలు వదులుకున్న రైతులు పత్తిపై ఆశ పెంచుకొని సాగు చేస్తున్నారు. గత ఏడాది పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ. 5 వేలకు పైగా కల్పించడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పత్తి పైర్లు ఏపుగా పెరుగుతున్నట్లు రైతులు చెబుతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగు విస్తీర్ణంతో పాటు పైరులకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమి, భూ సారాన్ని బట్టి 2, 3 ఫీట్ల అచ్చుతో విత్తనం నాటారు. విత్తనాలు సకాలంలో మొలకెత్తడంతో మొక్కల సాంద్రతతో పాటు సమంగా ఎదుగుతుంది. మరో నెల పాటు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తే మంచి దిగుబడులు చేతికందుతాయని రైతులు సంబురపడుతున్నారు.

ఫలించిన రైతు అవగాహన సదస్సులు
వాతావరణ పరిస్థితులను ముందే అంచనా వేసిన జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించింది. దీంతో రైతులు మొక్కజొన్న, వరి స్థానంలో పత్తి సాగు ప్రారంభించారు. రైతులకు పత్తి విత్తనాలు, మందులు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. పత్తిని నాశనం చేసే పురుగులపై కూడా జిల్లా వ్యవసాయ శాఖ సూచనలు చేయడంతో రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

జోరుగా పనులు...
జిల్లాలో పంటపొలాల్లో జోరుగా కలుపు పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పత్తి పంటలో మొదటి దఫాలో కలుపు తీసినప్పటికీ ఇటీవల కురిసిన వర్షంతో అక్కడక్కడ గడ్డి మొలవడంతో రెండోదఫాగా రైతులు పత్తి పొలాల్లో కలుపు తీస్తున్నారు. కాస్త ముందుగా వేసిన రేగడి పొలాల్లో పంట ఏపుగా పెరుగడంతో పాటు పువ్వు, కాయదశలోకి వచ్చింది. దీంతో పత్తిని పురుగులు నాశనం చేయకుండా రైతులు క్రీమిసంహారక మందులు పిచుకారీ చేస్తున్నారు. చిన్నగా ఉన్న పైరుల్లో పత్తి ఎదుగుదలకు డీఏపీ, యూరియా, పోటాష్‌తో పాటు పలు రకాల ఎరువులను పత్తి మొక్కలకు వేస్తుండడం కనిపిస్తోంది.

అవగాహనతోనే అంతం...
ప్రసుత్త వానకాలం రైతులకు పంట సాగుకు వర్షం అనుకూలించడంతో పత్తి మొక్కలు బాగా పెరుగుతున్నాయి. పంటదిగుబడులు బాగుంటాయన్న నమ్మకంతో అధికారులు రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో రెండు ఏండ్లుగా గులాబీ పురుగు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా రైతులు వివిధ దశల్లో పంటను నష్టపోవాల్సి వస్తుంది. పత్తి పంటపై పింక్‌బౌల్ ఆశించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సరైన అవగాహనతోనే పంటలు మంచిగా పండించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

పురుగు ఉధృతి ఇలా...
ప్రమాదకరమైన తల్లి పురుగు పంటలోని ఆకుల కింద, లేత కొమ్మలపైన, పూల మొగ్గపైనా, లేత కాయలపైన గుడ్లు పెడుతుంది. ఈ పురుగు జీవిత కాలం 45 రోజులుండగా గుడ్ల నుంచి పొదగబడిన పిల్ల పురుగులు పూల మొగ్గలోకి తొలుచుకపోయి లోపలి పదార్థాలను తిని గుడ్డిపూలుగా మిగులుస్తాయి. చిన్న లార్వాలు కాయలకు కనిపించనంత రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశిస్తాయి. దీంతో పురుగు లోపలి గింజను తింటు దూదిని, పంటను నష్టపరుస్తాయి. అందుకు రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...