నిర్లక్ష్యంపై వేటు


Sat,August 10, 2019 02:38 AM

-హరితహారంపై అధికారుల ప్రత్యేక దృష్టి
-గ్రామస్థాయి నుంచి కలెక్టర్ల పర్యవేక్షణ
-నిత్యం సమీక్షిస్తున్న అధికారులు
-అలసత్వం వహిస్తున్న సిబ్బందిపై వేటు
- సమావేశానికి గైర్హాజరైనా చర్యలు
-నిర్లక్ష్యం చేసిన సర్పంచులకు షోకాజ్‌లు


మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఏదో మొక్కుబడిగా మొక్కలు నాటాం అంటే ఇక కుదరదు... నాటిన ప్రతి మొక్కకూ ఇక లెక్క ఉండబోతోంది. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సిబ్బంది, అధికారులు అప్రమత్తం అవుతున్నారు. సరిగా పని చేయని సిబ్బందిపై ఉన్నతాధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న సర్పంచులకు నోటీసులు సైతం ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్న హరితహారం విజయవంతం అయ్యేందుకు అధికారులు, సిబ్బంది, సర్పంచులు.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పని చేయాల్సి ఉంది. అయితే కొన్ని చోట్ల సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్లు కొరడా ఝులిపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 77 మంది సిబ్బం దిని, వనపర్తి జిల్లాలో ముగ్గురిని సస్పెండ్ చేశారు. హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన నాగర్ కర్నూలు జిల్లాలోని ఆరుగురు సర్పంచులకు డీపీవో షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని.. సర్పంచులు సైతం తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించా లని సందేశాన్నిచ్చారు. హరితహారం కార్య క్రమాన్ని విజయవంతం చేసి రాష్ర్టాన్ని హరిత తెలంగాణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న తరుణంలో సిబ్బంది, గ్రామ పంచాయతీలు మరింత జాగ్రత్తగా పని చేయాలని సందేశం గ్రామాలకు వెళ్తోంది.

ఒకేసారి 93 మందిపై సస్పెన్షన్ వేటు
హరితహారం కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనే అంశంపై అధికారులు క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి మహబూబ్ నగర్‌లో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 59 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 18 మంది పంచాయతీ కార్యదర్శులు గైర్హాజరయ్యారు. పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు గైర్హాజరు అయితే ఇక సమావేశం పెట్టిన ఉద్దేశం ఎక్కడ నెరవేరుతుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాని 77 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒకేసారి ఇంత మందిపై వేటు వేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం ఓ యజ్ఞంలా చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కింది నుంచి పై వరకు సిబ్బంది అధికారులు సక్రమంగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ పలుమార్లు సిబ్బందిని హెచ్చ రించారు. అయినా వారిలో మార్పు రాక పోవడంతో సస్పెన్షన్ వేటు వేశారు.

నాటిన మొక్కలకు రికార్డుల్లో పొంతన లేక..
పెబ్బేరు మండలం గుమ్మడం, రాంపురం గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ఆన్‌లైన్‌లో చేసిన ఎంట్రీలకు పొంతన లేదు. ఈ విషయాన్ని గురువారం పెబ్బేరు మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ శ్వేతా మొహంతి గుర్తించారు. వెంటనే బాధ్యులైన గుమ్మడం ఫీల్డ్ అసిస్టెంట్ సంగీత, రాంపురం టీఏ మమత, పెబ్బేరు ఏపీవో బాలయ్యలను సస్పెండ్ చేశారు. గుమ్మడంలో ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యపు పనితీరు, రాంపురంలో టెక్నికల్ అసిస్టెంట్ పొంతన లేని లెక్కలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంపురం గ్రామంలో 300 మొక్కలు నాటామని చెప్పినా రికార్డుల్లో మాత్రం 180 మొక్కలు నాటి నట్లుగానే ఉందని గుర్తించిన కలెక్టర్.. గ్రామంలో కిలోమీటర్ మేర నడిచి మొక్కలను లెక్కించారు. అన్నీ తప్పుడు లెక్కలతో తప్పుదారి పట్టిస్తు న్నారని అర్థం చేసుకున్న కలెక్టర్ వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.

సర్పంచులు బాధ్యత మరిస్తే..
ఒకప్పుడు ప్రజా ప్రతినిధులు ఏం తప్పు చేసినా అది సిబ్బంది, అధికారుల మెడకు చుట్టుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం గ్రామాల్లో సర్పంచులపై భారీ బాధ్యతలే ఉన్నాయి. ఇందులో హరితహారం కార్యక్రమాన్ని విజయవం తం చేపట్టడం కూడా ఒకటి. అయితే సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే మొదటి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి తర్వాత మార్పు రాకపోతే పదవికే ముప్పు వస్తుంది. హరితహారంలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరంక్షించే బాధ్యత కూడా సర్పంచులదే. ఇదే అంశంలో నాగర్ కర్నూలు జిల్లాలో కొందరు సర్పంచులు నిర్లక్ష్యం వహించారు. అయితే చూసీచూడనట్లు వదిలేసేందుకు ఇది పురానా సర్కారు కాదు. వెంటనే సదరు సర్పంచులకు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 33,35 ప్రకారం ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలంటూ లింగాల మండలం బాకారం సర్పంచు పద్మకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఇదే మండలానికి చెందిన అప్పాపూర్ పెంట, ధర్మారం, పద్మనపల్లి, రాంపూర్, రాయవరం సర్పంచులకు సైతం డీపీవో నోటీసులు జారీ చేశారు. షోకాజులు అందుకున్న సర్పంచులంతా సరైన సమాధానం ఇచ్చి గ్రామాల్లో హరితహారాన్ని విజయవంతం చేస్తే సరి... లేకుంటే వారి పదవికే గండం వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఒక్క లింగాల మండల సర్పంచులకే కాదు... అందరు సర్పంచులకు ఇదే వర్తిస్తుంది. సర్పంచు పదవిని అలంకారంగా, అదో స్టేటస్ సింబల్‌గా భావించే కొందరికి కొత్త పంచాయతీ చట్టం గట్టి గుణపాఠమే చెప్పనుంది.

ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు..
హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ విషయంపై కలెక్టర్లు, డీపీవోలు, ఇతర అధికారులు ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే గ్రామాల్లో కొందరు సిబ్బంది, సర్పంచుల తీరు వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయి. అయితే ఎక్కడ ఏ చిన్న సమస్య కనిపించినా సిబ్బందిపై అధికారులు వేటు వేస్తున్నారు. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండేందుకు అవకాశం లేదనే ఓ సందేశాన్ని ఇస్తున్నారు. ఇక సర్పంచులు సైతం తమ బాధ్యత మరిస్తే పదవికే ముప్పు వస్తుందనే విషయాన్ని వారికి తెలియచేస్తున్నారు. ప్రస్తుతం సర్పంచులకు షోకాజ్ వరకు ఇచ్చి వారి సంజాయిషీ అడుగుతున్నారు. భవిష్యత్తులో మార్పు రాని సర్పంచులపై కొత్త పంచాయతీ చట్టం ప్రకారం వేటు వేసేందుకు కూడా అవకాశాలున్నాయి.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...