పల్లెల్లో అభివృద్ధి పరుగులు

Thu,December 5, 2019 04:16 AM

మామిళ్లగూడెం, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచనలతో రచించిన 30 రోజుల పల్లె ప్రణాళిక కార్యక్రమం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల ఆవరణంలో గ్రామ సర్పంచ్‌లకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కోసం బృహత్తర ప్రణాళికలను రచించి 30 రోజుల్లో ఆయా పంచాయతీల్లో తమ ప్రణాళికలను అమలు చేసి అద్భుతమైన అభివృద్ధిని సాధించిందన్నారు. పంచాయతీల్లో స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులతో పారిశుశ్య పనులు నిర్వహించే ప్రక్రియ, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణలకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ట్రాక్టర్ల అవసరాలను గుర్తించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతన పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం 500ల జనాభా కలిగిన ప్రతి గ్రామాన్ని గ్రామపంచాతీయగా ఏర్పాటు చేయడంతో పాటు ఆయా గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో గ్రామపంచాయతీకి స్వంతంగా పారిశుధ్యం, మొక్కల పెంపకం, డంపింగ్ యార్డులు, స్మశానవాటికలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నెల రోజలు గ్రామ ప్రణాళికలతో చేపట్టిన పనులతో గ్రామాల్లో గుణాత్మక మార్పులు వచ్చాయని పల్లెలని పచ్ఛదనం, పరిశుభ్రతతో వెల్లివిరుస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో ఈ కార్యక్రమాలు కొనసాగించేందుకే పల్లెలకు ప్రతి పంచాయతీ ట్రాక్టర్లతో పాటు ట్రాలీ, ట్యాంకర్ తప్పనిసరిగా సమకూర్చుకోవాలని సర్పంచ్‌లకు మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలుకు వివిధ కంపెనీలతో జిల్లా కలెక్టర్లు చర్చించి కేంద్రీకృతంగా కనిష్ట ధరలను నిర్ణయిచారని సర్పంచ్‌లు తమ అభిష్టం మేరకు ట్రాక్టర్ల కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు.

నూతన సంవత్సరం నాటికి జిల్లాలోని అన్ని పంచాయతీలలో ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. కొనుగోలు చేసిన ట్రాక్టరు గ్రామపంచాయతీ ఆస్తిగా ఉంటుందని స్వప్రయోజనాలకు వాడకూడదని, దుర్వినియోగం చేస్తే సర్పంచ్‌లే బాధ్యులవుతారన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు ప్రతి నెల పదహరున్నర కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ.. జిల్లాలో నెల రోజులలో గ్రామ ప్రణాళిక ద్వారా అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని, గ్రామాల్లో జరిగి అభివృద్ధితో పాటు పారిశుధ్య పనులు, హరితహారం మొక్కలను సంరక్షణకు ట్రాక్టర్ల కొనుగోలును చేపట్టామన్నారు. 500ల జనభా కలిగిన చిన్న పంచాయతీలకు మినిట్రాక్టర్లు, మేజర్, ఇతర పెద్ద పంచాయతీలకు పెద్ది ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పథకంలో భాగంగా మొదటి దశలో 56 ట్రాక్టర్లను ఆయా గ్రామపంచాయతీలు తమ సొంత నిధులతో కొనుగోలు చేశాయని తెలిపారు.

జిల్లాలోని ఎస్‌బీఐ ఆంధ్రాబ్యాంక్‌ల ద్వారా రుణపద్దితిన ట్రాక్టర్ల కొనుగోలు చేసే ప్రక్రియ పురోగతిలో ఉందని, మరో 15 రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నట్లుగా గ్రామ వికాసంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో గ్రామప్రణాళికతో అద్భుతమైన పనులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు పోటీతత్వంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, కార్పొరేటర్ చావా నారాయణరావు, రఘునాథపాలెం జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, జడ్పీ సీఈవో ప్రియాంక, డీపీవో శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు కమర్తపు మురళీ, డీఎల్‌పీవోలు పుల్లయ్య, వీ ప్రభాకర్, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

297
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles