ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ విడుదల

Thu,November 21, 2019 12:55 AM

-నేడు మండల స్థాయిలో హెచ్‌ఎంలతో ఎంఈఓల సమావేశం
-నిబంధనలు ప్రకారం నిర్వహించాలి : డీఈఓ మదన్‌మోహన్‌
-30న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

ఖమ్మం ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమీకోన్నత, ఉన్నత పాఠశాలల్లో నూతనంగా యాజమాన్య కమిటీలను ఎన్నిక చేసేందుకు బుధవారం డీఈవో మదన్‌మోహన్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 22వ తేదీన ఎస్‌ఎంసీ సభ్యు లు, ఛైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం నోటీస్‌ ఇవ్వడం, 22వ తేదీ మధ్యాహ్నం ఎస్‌ఎంసీ సభ్యుల ఎన్నిక కోసం ఓటర్ల జాబితా ప్రదర్శించడం, 23 నుంచి 25వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించడం, 26న ఓటర్ల జాబితా తుది జాబితాను ప్రదర్శించడం, 30న ఉదయం ఎన్నికను నిర్వహించి సభ్యుల జాబితాను ఖరారు చేయడం, ఎన్నికైన ఎస్‌ఎంసీ సభ్యుల నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్‌లో పొందుపర్చారు.

మండల స్థాయిలో సమావేశం..
ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలల్లో గల ప్రధానోపాధ్యాయులకు మండలాల వారీగా ఆయా మండలాల్లో ఎంఈవోలు సమావేశాలు నిర్వహించాలని డీఈవో మదన్‌మోహన్‌ ఆదేశించారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవం ఉన్న దృష్ట్యా మరోసారి నిబంధనలపై అవగాహన కల్పించి, వారికున్న ఉన్న సందేహాలను రాత పూర్వకంగా, విద్యాశాఖకు మెయిల్‌ చేయాలని స్పష్టం చేశారు. వారికున్న సందేహాలను పరీశీలించి నివృత్తి చేయడం జరుగుతుందన్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం ఆయా పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాతమీకోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంఈవోలు సూచనలు చేయనున్నారు.

నేడు విద్యామంత్రితో సమావేశం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అజెండాలో పొందుపర్చిన సమాచారాన్ని రికార్డుల రూపంలో తయారు చేశారు. కార్యాలయ అధికారులు రూపొందించిన నివేధికలతో ఖమ్మం డీఈవో మదన్‌మోహన్‌ సమీక్ష సమావేశానికి హజరుకానున్నారు. హైదరాబాద్‌లోని గోదావరి కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించే సమీక్షలో డీఈవోలతో పాటు ఆర్‌జేడీలు హజరుకానున్నారు. 15 అంశాలపై జరగనున్న రివ్యూలో ప్రధానంగా పది పరీక్షలు, సైన్స్‌ ఫెయిర్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, ఈ ఆఫీస్‌ చర్చించనున్నారు.

84 మంది వలంటీర్ల సర్దుబాటు
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ల స్ధానంలో నియమించిన విద్యా వలంటీర్లలో నిబంధనలు పాటించని వారిని తొలగించారు. ఉన్నాతాధికారుల మార్గదర్శకాల ప్రకారం తొలి విడతలో 92 మందిలో 84 మందిని వలంటీర్లుగా పాఠశాలల్లో నియమించాలని ఎంఈవోలను డీఈవో ఆదేశించారు. ఆయా మండలాల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో వారిని కేటాయించాలని స్పష్టం చేశారు. రెండోవ విడతలో మిగిలిన వలంటీర్లను నియమించేందుకు విద్యాశాఖ అధికారులు కమిటీకి ఫైల్‌ను అందజేశారు. అనుమతి రాగానే వారిని పాఠశాలల్లో కేటాయిస్తామని డీఈవో మదన్‌మోహన్‌ తెలిపారు.

233
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles