పక్కాగా యాసంగి ప్రణాళిక

Wed,November 20, 2019 01:19 AM

-వానాకాలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది
-వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..
-కొనుగోలు కేంద్రాలలో మధ్య దళారుల పాత్ర ఉండొద్దు
-వ్యవసాయ శాఖ సమీక్షలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
-యాసంగి సాగుకు నవంబర్21 న నీటిని విడుదల చేస్తాం
-ఖమ్మం కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
ఖమ్మం, నమస్తే తెలంగాణ : యాసంగి సీజన్‌లో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ముందస్తు సమగ్ర ప్రణాళికతో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో సన్నద్ధం కావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. యాసంగి 2019-2020 సన్నద్ధంపై మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయం పట్ల రైతులకు అవసరమైన మెళకువలు, మద్దతు విధానం గురించి దిశా నిర్దేశం చేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ రంగంలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసిందని, రైతాంగానికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా కలిసి కట్టుగా పని చేయాలని మంత్రి అన్నారు. ఉమ్మడి జిల్లాలో మెరుగుపర్చుకున్న మధ్య, చిన్న తరహా సాగునీటి వనరులతో ఖరీఫ్‌లో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ఇదే స్ఫూర్తితో యాసంగిలో కూడా సాగు విస్తీర్ణం మరింత పెరిగే దిశగా వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియపర్చాలన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు సంబంధించి యాసంగికి సాగునీటి విడుదలపై ముందస్తుగానే షెడ్యూల్ విడుదల చేసి వారబంది గురించి ముందుగానే రైతులకు తెలియజేయాలని ఎన్‌ఎస్‌పీ అధికారులను మంత్రి ఆదేశించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం చేపట్టిందని, ఏఈవోలు తమ క్లస్టర్ పరిధిలో సాగవుతున్న పంటల పై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు పంట నమూనాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి వ్యవసాయ శాఖ జిల్లాస్థాయి అధికారులకు తెలియపర్చాలని మంత్రి సూచించారు.

వ్యవసాయ విస్తరణాధికారులు తమ బాధ్యతలను మరింత పెంచుకొని వ్యవసాయ రంగంలో గుణాత్మక మార్పు, ప్రగతిని సాధించాలన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో సాగువిస్తీర్ణం మరింత పెరుగుతుందని, రైతుల సమస్యలను ఆకళింపు చేసుకొని క్రీయాశీల పాత్ర పోషించి వ్యవసాయ రంగంలో ఖమ్మం జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఏఈవోలను మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ధాన్యం కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసి రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌లను కూడా భాగస్వాములు చేయాలని మంత్రి తెలిపారు. 24 గంటల నిరంతర విద్యు త్, సాగునీటి వసతి కల్పించడంతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు అంద జేయడంతో ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని, అదేవిధంగా ఖరీఫ్‌లో సాగు అయిన వరికి సంబంధించి ఏ గ్రేడుకు రూ. 1835 కనీస మద్దతు ధర కల్పించిందని, పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా వ్యవసాయ శాఖాధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ వైరా ప్రాజెక్టు కింద రబీసాగుకు నవంబర్21 న నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. రబీలో ఆరుతడి పంటలకు భక్తరామదాసు నీటిని అందిస్తామని ఈ విషయాన్ని ముందుగానే రైతులకు తెలియపర్చి ఆరుతడి పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. పంట రుణాలకు సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకనుగుణంగా కిసాన్ క్రెడిట్ కార్డులోన్ పంట ఆధారంగా మంజూరు చేయబోతుందని కొత్తగా పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు కేవలం పహాణీ నకలును సమర్పిస్తే సరిపోతుందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా రుణ మంజూరుకు నిరాకరించిన బ్యాంకర్ల వివరాలను అందించాలని ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి సభ్యులకు కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిటీలో స్థానిక సర్పంచ్, వ్యవసాయ విస్తరణాధికారి, ఐకేపీ సిబ్బంది, పీఏసీఎస్ చైర్మన్‌తో పాటు రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ తప్పనిసరిగా సభ్యులు ఉండేవిధంగా కమిటీల ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రబీ-2019-20 లో జిల్లాలో 51 వేల769 హెక్టార్లలో సాధారణ సాగు విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని, 20 వేల క్వింటాళ్ల పెసర, 330 క్వింటాళ్ల మిను ములు, 639.30 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు అందించడం జరిగిందని, 33 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకై 122 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటి వరకు 2 వేల 893 మంది కౌలు రైతులకు ధ్రువీకరణ పత్రాలను అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాబోయో రబీలో కూడా రైతులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లతో ముం దస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.
రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని రైతాంగానికి వ్యవ సాయ, నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉం డి అవ సరమైన అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నారని, వ్యవసాయ విస్తరణాధికారులు తమ క్లస్టర్ పరిధిలోని 5 వేల ఎకరాలలో పంటసాగు వివరాలను ఎప్పటికప్పుడు అందించడం ద్వారా రైతులకు మేలు చేకూరుతుందన్నారు. రబీలో వరికి బదులు మెట్టపైర్లు వేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, రైతు సమన్వయ సమితి సభ్యుల సేవలను ఈ కార్యక్రమాలలో వినియోగించుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా పవర్‌స్ప్రేయర్లు, టార్పాలిన్లు సరఫరా చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, జేసీ హన్మంతు కో డింబా, జడ్పీ సీఈవో ప్రియాంక, ఎన్‌ఎస్‌పీ పర్యవేక్షక ఇంజనీరు సుమతి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా గ్రామీణా భివృద్ధి ధికారి ఇందుమతి, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల, గ్రామ కో ఆర్డినేటర్లు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నర్సింహారావు, ఎన్‌ఎస్‌పీడీ వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖ ఏడీఏలు నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

229
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles