విశ్రాంత ఉద్యోగులకు తీపి కబురు

Sun,November 17, 2019 12:35 AM

ఖమ్మం నమస్తే తెలంగాణ: విశ్రాంత ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. ఇక నుంచి ప్రతి ఏడాది బ్యాంకులకు, ట్రెజరీలకు వెళ్లకుండా ఇంటివద్దనే పింఛన్ అందుకునే అవకాశాన్ని కల్పించింది. దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈనెల నుంచి అమలు చేయనున్నది. ఇందుకోసం టీ యాప్ పోలియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. 58 ఏళ్లు వచ్చే వరకు ఉద్యోగం చేసి చివరికి చాలా మంది ఎన్నో వ్యాధులతో సతమతమవుతున్నారు. వారు ప్రతియేటా బ్యాంకులకు, ట్రెజరీలకు వెళ్లి మేము బతికే ఉన్నామని లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉండేది. ఇక నుంచి వారికి ఆసమస్య నుంచి విముక్తి లభించనున్నది. ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా కేవలం టీ యాప్ నుంచి వారు ఫొటోను అప్‌లోడ్ చేస్తే చాలు వారి పింఛన్ వారికి వచ్చేస్తుంది.

యాప్ ఎందుకంటే..
ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితం ఆనందంగా గడిపేందుకు ప్రభుత్వం పింపఛన్లను అందజేస్తుంది. పింఛన్‌దారులంతా ఏటా నవంబర్ 1నుంచి డిసెంబర్ 31లోను తాము జీవించే ఉన్నట్లు ధ్రువీకరిస్తూ జీవన ధ్రువీకరణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) ఖజానా శాఖ కార్యాలయంలో, బ్యాంకులో అందజేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరిస్థి ఎలా ఉన్నా, తమ జీవన ధ్రువీకరణ పత్రాలను దాఖలు చేయడానికి వెళ్లలేని వారు, మీ సేవా కేంద్రాలకు వెళ్లి జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఆధారిత జీవన ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాన్ని ఆమోదిస్తూ పింఛన్ పునరుద్ధరింపబడుతుంది. లేకపోతే పింఛన్ నిలిచిపోతుంది. ఇకపై తిప్పలు తీర్చడానికి సమయం వృథా కాకుండా సులభంగా జీవన ధ్రువీకరణపత్రం దాఖలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికేట్ లేకుండా పింఛన్ ఇచ్చే అవకాశం ఇవ్వడం తెలంగాణలోనే ప్రప్రథమం. టీయాప్ ద్వారా నవంబర్ నుంచి పింఛన్ తీసుకునే అవకాశం తెలంగాణ సర్కార్ కల్పిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్‌దారుల సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారి కోసం కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వేలి ముద్రలు సరిగా పడకపోయినా కేవలం ఫొటో ద్వారా వారిని గుర్తించి పింఛన్ ఇచ్చే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ పకడ్బందీగా ఈయాప్‌ను రూపొందించింది. ఈవిధానాన్ని నవంబర్ 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నది. ఇందుకోసం ట్రెజరీ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

శాశ్వత పరిష్కారం...
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇక నుంచి శాశ్వత పరిష్కారం లభించనున్నది. గతంలో ఎక్కడైతే పదవీ విరమణ చేశారో అక్కడే సమీప బ్యాంకుకు వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి ఉండేది. ఇందుకోసం వేలి ముద్రలు వేయాల్సి వచ్చేది. రానురాను వారి వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించడం కోసం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఇప్పటికే రూపొందించినా దానికి తోడు టీయాప్ పోలియోను అందుబాటులోకి తెచ్చింది. ఈయాప్ వల్ల ప్రతి యేడా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యాప్ వల్ల ఉద్యోగి తన ఫొటోను యాప్ నుంచి ట్రెజరీ కార్యాలయానికి పంపితే పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 23వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో మేలు జరగనున్నది.

ఫోన్లలో ఇలా...
ఆండ్రాయిడ్ ఫోన్లయితే ప్లే స్టోర్‌లో, ఐవోఎస్ వినియోగదారులైతే యాప్ స్టోర్ నుంచి టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ వివరాల్లో పేర్లను నమోదు చేసుకోవాలి. వీటి ఆధారంగా మనకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లభిస్తాయి. వీటితో యాప్‌లోకి లాగిన్ అయి వార్షిక పరిశీలన ఆధారంగా రిజిస్ట్రేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. బ్యాంకు ఖాతా సంఖ్య, పింఛన్, ఐడీ, ఓటరు కార్డు ఎపిక్ సంఖ్య, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. అనంతరం సదరు పింఛన్‌దారుడు స్వీయ చిత్రం దిగి పంపించాలి. ఈచిత్రం జనాభా లెక్కలోను వివరాలతో సరిపోతే ఆమోదం పొందినట్లుగా మెసేజ్ వస్తుంది. ఈ వివరాలు ఖజానా శాఖ అధికారి బ్యాంకు అధికారికి చేరగానే జీవన ధ్రువీకరణపత్రం అందినట్టుగా భావిస్తారు. పింఛన్‌దారుడు ఎక్కడా ఉన్నా యాప్ నుంచి జీవన ధ్రువీకరణ పత్రం అందజేయవచ్చు.

358
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles