కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు

Sat,November 16, 2019 12:32 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. 2014లో తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పలు పథకాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలుచేస్తున్నారు. వాటి ఫలాలును అందిపుచ్చుకున్న ప్రజలు కేసీఆర్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకవచ్చిన విషయం విధితమే. కుల, మతాలను కాదనుకుని వివాహాలు చేసుకునే ఎస్సీలను మరింత ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందుకోసం ప్రోత్సాహకంగా అందించే ఆర్థిక సాయాన్ని కూడా భారీగా పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న రూ.50వేల సాయాన్ని ఇప్పుడు రూ.2.50లక్షలకు పెంచింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా జీవో నెంబరు 12ను గతనెల 31న విడుదల చేశారు. సాంఘీక సంక్షేమ శాఖను రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తరువాత తొలి రోజుల్లో కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలను ప్రోత్సహకంగా ఇచ్చేది. ఆ తరువాత 2011లో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వాటిని రూ.50 వేలకు పెంచుతూ జీవో నెంబరు 33ను జారీ చేశారు. దాని ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని రూ .2.50 లక్షలకు పెంచారు. ఇది కూడా 2018 నవంబర్ 12 తరువాత వివాహం చేసుకున్న వారికి ఈ నిబంధన వర్తిస్తుందని ఆ జీవోలో పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని ఎస్సీ యువతీ యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ జనరంజక పాలన రానున్న ఇరవై సంవత్సరాల వరకు ఉండాలని కోరుకుంటున్నారు.

కల్యాణలక్ష్మి అందుకోలేక పోతున్న యువతులు...
కొంతకాలంగా రాష్ట్రంలో ఎస్సీల కులాంతర వివాహాలు ఏటేటా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సంబంధిత అధికారులు తెలిపారు. వాస్తవానికి ఎస్సీ వర్గానికి చెందిన దళిత యువతుల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కల్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షా 116 ఆర్థిక సాయం అందిస్తున్నది. దానికి అదనంగా కులాంతర వివాహం చేసుకుంటే ప్రోత్సాహకంగా మరో రూ.50వేలు అదనంగా ఇస్తున్నారు. ఈ లెక్కన కులాంతర వివాహం చేసుకున్న దళిత జంటకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1.50లక్షలు అందుతున్నాయి. అయితే కులాంతర వివాహం కారణంగా తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేక యువతులు కల్యాణలక్ష్మి పథకంతో వచ్చే లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించే చర్యలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ సాయాన్ని రూ.50నుంచి రూ.2.50లక్షలకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. దీంతో కులాంతర వివాహాలు చేసుకోవాలనే దళిత యువతీ, యువకులకు వరంగా మారింది.

ఎస్సీలకు వ్యక్తిగత రుణాలు మంజూరుకు కసరత్తు...
ఎస్సీలకు కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందిస్తూనే వారికి మరో వైపు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఋణాలను అందిస్తున్నది. జిల్లాలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. దరఖాస్తులు చేసుకున్న వారిలో గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఉపాధి శిక్షణ పొందిన వారికి నైపుణ్యాభివృద్ధ్ది విభాగంలో దళిత యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే గత నెలలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున దళిత యువతకు అసరమైన రుణాలు మంజూరు చేసేందుకు జిల్లా అధికారుల కమిటీ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేశారు. నైపుణ్యం లేని విభాగంలో మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎంపీడీవోలు, మునిసిపాలిటీల కమిషనర్లకు అప్పగించారు. వారి వద్ద నుంచి ఎంపిక జాబితా వచ్చిన వెంటనే సుమారు నైపుణ్యాభివృద్ధిలో 387 నుంచి 400 మంది వరకు, నైపుణ్యం లేని విభాగంలో 387 నుంచి 400 మందికి ఈ ఆర్థిక సంవత్సరం 2018-19లో ఎంపిక చేసి వారు దరఖాస్తు చేసుకున్న యూనిట్ల ప్రకారం ఒక్కరికి రూ.1లక్ష నుంచి పైన రుణాలు మంజూరు చేసేందుకు జిల్లాకు మండలాల వారిగా రూ.38.70లక్షలు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అదే విధంగా చిన్న రుణాల పథకంలో భాగంగా ఒక్కో లబ్ధిదారునికి నేరుగా ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా రూ.50వేలను మంజూరు చేసుందుకు మరో 700 మంది లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తును పూర్తి చేశారు.

బిందు సేద్యంలో మరో 185 మందికి అవకాశం..
ఎస్సీ రుణాలలో భాగంగా వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ రైతులకు చేయూతను అందించేందుకు ప్రభుత్వం బిందు సేద్యం పథకాన్ని ప్రకటించింది. జిల్లాలో అర ఎకరం భూమి నుంచి ఆ పైన ఎంత వరకు ఉన్న ఈ పథకంలో అర్హులుగా ప్రకటించారు. వీరిలో కూరగాయల సాగుకు ఆసక్తి ఉన్నవారికి, ప్రస్తుతం సాగు చేస్తున్నవారికి బిందు సేద్యం పథకంలో రూ.50 వేల నుంచి రూ. 3.60 లక్షల వరకు సబ్సిడీ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు ఇప్పటికే అర్హులను ఎంపిక చేస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న రైతుల 185 మంది జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు.

310
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles