ఇసుక కొరత నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్

Sat,November 16, 2019 12:31 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాలకు, స్థానిక అవసరాలకు ఇసుక కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం కలెక్టర్, చైర్మన్ అధ్యక్షతన జరిగింది. సమావేశ మందిరంలో జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా, ముదిగొండ మండలంలోని పట్టా భూములలో గల ఇసుక రీచ్‌ల నుంచి రవాణా, అజెండా అంశాలపై కమిటీ చర్చించింది. వ్యవసాయ, మైనింగ్, టీఎస్‌ఎండీసీ, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, భూగర్భజల వనరుల శాఖ, వ్యవసాయశాఖ జిల్లాస్థాయి అధికారులతో పాటు స్థానిక తహసీల్దారులతో అధికారుల బృందం సంయుక్త సర్వే చేసి ఇసుక నిల్వలు, నాణ్యతపై నివేధికను సమర్పించాలని కలెక్టర్ కమిటీ చైర్మన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఇసుక రీచ్‌లు కేటాయించబడిన మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్థేశించిన ధరకు స్థానిక అవసరాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఇసుక సరఫరా చేయాలని, అదేవిధంగా ఆయా మండలాల పరిధిలో జరుగుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. ధంసలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను టీఎస్‌ఎండీసీ రీచ్‌ల ద్వారా సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు జీ సంజయ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి కే శ్రీనివాస్‌రెడ్డి, సర్వేల్యాండ్ సహాయ సంచాలకులు రాము, భూగర్భ జలవనరుల శాఖ ఉప సంచాలకులు వి ఆనంద్‌కుమార్, పర్యావరణ శాఖ ఇంజనీరు లింగయ్య, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఎల్లయ్య, తల్లాడ, చింతకాని, ముదిగొండ, బోనకల్, మధిర, ఎర్రుపాలెం తహసీల్దార్లు వెంకన్న, సత్యనారాయణ, కరుణాకర్‌రెడ్డి, రమేష్, పూల్‌సింగ్, రియాజ్‌అలీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

275
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles