బ్రహ్మ మురారి.. సురార్చిత లింగం..

Wed,November 13, 2019 02:15 AM

(ఖమ్మం కల్చరల్‌) కార్తీకపౌర్ణమి పండుగను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. జిల్లాలోని శైవ, వైష్ణవ క్షేత్రాలలోని ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమతమ ఇష్టదైవాలను దర్శించుకుని, దీపారాధనలు చేశారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో కార్తీకపౌర్ణమి పండుగ సందర్భంగా ఆయా ఆలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు దీపారాధనలు చేశారు. భక్తులు ఆలయాల్లో, ఇండ్లల్లో దీపారాధనలు చేశారు. బ్రహ్మీముహార్తాన భక్తులు అభ్యంగన నదీ పవిత్ర స్నానాలు ఆచరించారు. పలు ఆలయాల వద్ద స్వామి దర్శనం, దీపారాధనకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. జిల్లాలోని కూసుమంచి, తీర్థాల, పెనుబల్లి, కారేపల్లి, మధిర, ఖమ్మంలలోని శివాలయాలు ‘ఓం నమఃశ్శివాయ’ పంచాక్షరి మంత్రంతో మార్మోగాయి. శివాలయాల్లో భోళాశంకరుడిని దర్శించుకుని, అభిషేకాలు, అర్చనలు, శివపూజలు చేశారు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వదళార్చనలతో త్రినేత్రుడిని ప్రసన్నం చేసుకున్నారు. అదేవిధంగా వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, రామాలయాలు ఇతర వైష్ణవాలయాలు ‘ఓం నమోనారాయణ’ అష్టాక్షరి మంత్రం, విష్ణు సహస్ర నామ పారాయణాలతో మార్మోగాయి. భక్తులు బ్రహ్మీముహూర్తాన పవిత్ర అభ్యంగన స్నానాలు ఆచరించి, పలు ఆలయాలకు తరలివెళ్లి దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఖమ్మం గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుఝాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వయంభు స్వామి దర్శనానికి బారులు తీరారు. స్వామి దర్శనం చేసుకుని, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో ప్రమిదలు, అరటి దొప్పలు, ఉసిరి కాయల్లో దీపాలు వెలిగించారు.

ఈ సందర్భంగా ఉసిరి, తులసి చెట్ల వద్ద దీపాలు వెలిగించి ఆ చెట్లను పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లిన జ్వాలాతోరణాల నుంచి దాటుతూ భక్తులు తరించారు. సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం దక్కే విధంగా 365 వత్తులను వెలిగించి తరించారు. దీంతో సంవత్సరంలో ఏ ఒక్క రోజు దీపం పెట్టలేని పరిస్థితి వచ్చినా.. 365 వత్తుల దీపారాధనలతో పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. బ్రాహ్మణోత్తములకు దీపదానాలు చేసి, గోపూజలు చేసి భక్త గణం పుణ్యఫలాలను పొందారు.ఖమ్మంలోని శ్రీభ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో కొలువైన స్వయంభు స్వామిని ఏసీసీ గణేష్‌ దర్శించుకుని అభిషేకాలు అర్చనలు చేశారు. వందలాదిమంది భక్తులు ఆలయానికి తరలివచ్చి దీపారాధనలు చేశారు. భక్తుల దీపారాధనలతో పాటు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జ్యోతిర్లింగార్చన, సహస్ర దీపాలంకరణ, జ్వాలాతోరణంతో ఆలయం మరింత దేదీప్యమానమైంది. ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీస్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. స్వయంభు స్వామిని దర్శించుకొని దీపారాధనలు, అర్చనలతో పూజలు చేసి తరించారు. వైరారోడ్‌లోని శ్రీపవనసుత జలాంజనేయ స్వామి ఆలయం, సుగ్గులవారితోటలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, బ్రాహ్మణబజార్‌ శివాలయంతోపాటు నగరంలోని పలు శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.. ఆలయాలు, ఇండ్ల ముంగిట వెలిగిన దీపోత్సవంతో వాడవాడలా పున్నమి కాంతులు విరజిమ్మాయి.

281
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles