హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం..

Fri,October 18, 2019 11:12 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు ఖాయమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి తాతా మధులు ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ ఉన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నెరేడుచర్ల మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అత్యాశకు పరకాష్ట ఈ ఉప ఎన్నికలు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని, మాటకు ముందు పిల్లలు లేరని, నియోజకవర్గ ప్రజలే పిల్లలు అని చెప్పే ఉత్తమ్ దపంతులకు నిజంగా ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చడానికి అధికారం కూడా అవసరం లేదన్నారు. ఎంతో మంది స్వచ్చంద సంస్థలు పెట్టుకుని సేవ చేస్తున్నారని, పిల్లలు లేరని చెప్పే ఉత్తమ్ దంపతులు సేవ చేయకుండా, ముఖ్యమంత్రి కావాలని , కేంద్ర మంత్రి వంటి పదవుల కోసం చూడడం తప్ప హుజూర్‌నగర్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోయింది లేదని దుయ్యబట్టారు. పిల్లలు లేకపోతే ఇక్కడి తండాలలో అనేక మంది అనాధలున్నారని, వారిని పెంచుకుని ఆలానా, పాలన చూసుకోవచ్చని, వారి భవిష్యత్‌కు కృషి చేయాలే తప్పా పదవుల కోసం పిల్లలు లేరని మాయ మాటలు చెబుతూ ఓట్లు దండుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పొరపాటున ఉత్తమ్ దంపతులకు ఓటేస్తే వారి కుటుంబం బాగుపడడం తప్ప, ఈ తండాలకు ఒరిగేదేమిలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఘోర పరాజయం పొందడంతో ఇక కాంగ్రెస్ పార్టీ విజయం కనుచూపు మేరలో లేదని గుర్తించిన ఆ పార్టీ దేశాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఏర్పడినా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారన్నారని విమర్శించారు. కోదాడలో ఓడిన తన సతీమణిని తీసుకొచ్చి హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నారన్నారని, కాంగ్రెస్ పార్టీలో ఆయన సతీమణి కాకుండా ఇంకెవ్వరు నాయకులు లేరా అని పార్టీ గొడ్డుపోయిందా అని ప్రశ్నించారు. గత రెండు ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని మంత్రి సత్యవతి ధ్వజమెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంని అవుతానని చెప్పి ఓట్లు వేయించుకున్నా ఉత్తమ్ ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రిని అవుతానని ప్రజలను మోసపూరితంగా తప్పుదోవ పట్టించారని గుర్తుచేశారు.

ఇప్పడు సతీమణి పద్మావతి పేరు చెప్పుకుని మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, పద్మావతి గెలిస్తే ఉత్తమ్ కుమార్‌కి లాభం తప్ప ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండి కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమైందని, ఈ ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఇకనైనా మునిగిపోయే నావ కాంగ్రెస్ నుంచి దిగి దరికి చేరుకోవాలని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ కల్పించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమని వారంతా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నారని, సైదిరెడ్డి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, మండల పార్టీ నేతలు వళ్లంపట్ల రమేష్‌బాబు, జగతయ్య గౌడ్, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.

264
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles