ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకోవాలి

Fri,October 18, 2019 11:11 PM

కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 18 : భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలో పటిష్టమైన భధ్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సీఐడీ ఐజీ, వరంగల్ ఇంచార్జి ఐజీపీ ప్రమోద్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్‌దత్ ఐజీపీకి పుష్పగుచ్ఛం ఇచ్చిస్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్లకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మావోయిస్టుల గురించి సమాచారాన్ని సేకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ అధికారుల పనితీరును ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

జిల్లా ప్రస్తుత స్థితిగతులను, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎస్పీ సునీల్‌దత్ ఐజీపీకి వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్నిరకాల ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేయడంలో జిల్లా పోలీసుల పనితీరును ఆయన అభినందించారు. ఇకముందు కూడా అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సునీల్‌దత్‌తో పాటు అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) డి.ఉదయ్‌కుమార్ రెడ్డి, అదనపు ఎస్సీ రాయిళ్ల సాయిబాబా, ఏఆర్ ఏఎస్పీ బి.కృష్ణయ్య, భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర, కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం ఆలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

245
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles