విరివిగా తిరిగిన బస్సులు

Thu,October 17, 2019 11:49 PM

-జిల్లాలో వివిధ రూట్లలో పెరిగిన బస్సుల సంఖ్య
-రోజువారీ షెడ్యూల్ ప్రకారమే నడిచిన బస్సులు
-బస్టాండ్‌లో ప్రయాణికులను ఆరా తీసిన కలెక్టర్
-పోలీసు బందోబస్తును పర్యవేక్షించిన సీపీ ఇక్బాల్
-ఖమ్మం డిపోను సందర్శించిన జాయింట్ కలెక్టర్

(ఖమ్మం కమాన్‌బజార్) జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా గాడిలో పడినట్లు కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాలతోపాటు మారుమూల ప్రాంతాలకూ ప్రగతిచక్రాలు పరుగులు పెడుతున్నాయి. దీంతో ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు 13 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. అయితే ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు పూర్తిగా సఫలం అయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రజల ప్రయాణాలకు ఆటంకం కలగడం లేదు. బస్సులను నూరు శాతం నడపాలన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ కర్ణన్, సీపీ తఫ్సీర్‌ఇక్బాల్ నేతృత్వంలో గురువారం కూడా జిల్లాలో బస్సులు పూర్తిస్థాయిలో నడిచాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల్లో ఉన్న బస్సులను అధికారులు పూర్తిస్థాయిలో బయటికి తీసి విజయవంతంగా నడిపించారు. ఆర్టీసీ రోజువారీ షెడ్యూల్ ప్రకారమే సర్వీసులు నడుస్తున్నాయి. డిపోల పరిస్థితులను, బస్సు సర్వీసులను నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బస్సులు నిరాటంకంగా నడుస్తుండడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరగడం లేదా? అంటూ ప్రయాణికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారంగా తిరిగిన బస్సులు..
ఆర్టీసీలో షెడ్యూల్ ప్రకారంగా తిరిగే బస్సులలాగానే గురువారం కూడా అదే షెడ్యూల్ ప్రకారం బస్సులు యథావిధిగా నిడిచాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు తమ విధులు నిర్వహిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. కండక్టర్లకు పాత పద్ధతిలో టికెట్లను జారీ చేస్తున్నారు. స్టేజీ స్టేజీకీ టికెట్ పంచింగ్ ఫార్మాట్‌ను అమలు చేస్తున్నారు. అధిక టిక్కెట్ ధరలు వసూలు చేస్తే తొలగిస్తామని డిపో మేనేజర్లు హెచ్చరిస్తుండడంతో తాత్కాలిక కండక్టర్లు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో జిల్లాలోని వివిధ రూట్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధిక ధరలు వసూలు చేశారా? అనే విషయం గురించి బస్సులోని ప్రయాణికులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరూ అధిక టికెట్ ధరలు ఇవ్వొద్దని, ఎవరైనా అడిగినా టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. గురువారం నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులు, మాక్సీ క్యాబులు కలిపి 381 సర్వీసులు నడిచాయి. ఖమ్మం డిపోలో ఆర్టీసీ బస్సులు 67, అద్దె బస్సులు 58, సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ బస్సులు 70, అద్దె బస్సులు 29, మధిర డిపోలో ఆర్టీసీ బస్సులు 38, అద్దె బస్సులు 20 నడిచాయి. దాంతోపాటు రవాణాశాఖ ఏర్పాటు చేసిన ప్రైవేట్ బస్సులు 29, మాక్సీక్యాబులు 70 కూడా సర్వీసులను అందించాయి.

ఖమ్మం డిపోను సందర్శించిన జేసీ
ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలను పర్యవేక్షించి బస్సులను నడిపించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆయా డిపోలకు నోడల్ అధికారులనూ నియమించారు. ఖమ్మం డిపో నోడల్ అధికారి అయిన జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం నాడు ఇక్కడి డిపోను పరిశీలించారు. బస్సులు పూర్తిస్థాయిలో తిప్పాలని డిపో మేనేజరును ఆదేశించారు. డిపోల్లో ఉన్న బస్సుల కండిషన్ గురించి తెలుసుకున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీల బస్సులతోపాటు డ్రైవింగ్‌లో నైపుణ్యం కలిగిన డ్రైవర్లను తీసుకొని రాజధాని ఏసీ, గరుఢ బస్సులను కూడా తిప్పాలని డీఎంను ఆదేశించారు. బస్సులను బయటికి తీసేటప్పుడు పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. డిపోలో మెకానిక్‌లు సరిపోకపోతే బయటి నుంచి తెప్పించుకోవాలని ఆదేశించారు.

బందోబస్తును పర్యవేక్షించిన సీపీ
జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలూ కలగకుండా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల్లో డిపోలు, బస్టాండ్‌ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏసీపీలకు సూచనలు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. బస్సుల వెంట ఎస్కార్ట్‌లను పంపించే విధంగా చర్యలు తీసుకున్నారు. డిపోల వద్ద ఏసీపీలు షిప్టుల వారీగా డ్యూటీలు చేస్తూ బందోబస్తును మరింత పటిష్టం చేస్తున్నారు.

ఖమ్మం బస్టాండ్‌ను సందర్శించిన కలెక్టర్
నగరంలోని ప్రయాణికుల ప్రాంగణాన్ని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ గురువారం సందర్శించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. బస్టాండ్‌లో బస్సులు ఏ విధంగా తిరుగుతున్నాయని అక్కడ ఉన్న అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ పాయింట్‌లో ఉన్న బస్సును ఎక్కి నేరుగా ప్రయాణికులతో మాట్లాడారు. సర్వీసులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జడ్పీ సీఈఓ ప్రియాంక, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

251
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles