ఖమ్మానికి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..

Tue,October 15, 2019 01:00 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విచ్చేశారు. సోమవారం యాత్ర నిమిత్తం ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. బుర్హాన్‌పురం నుంచి గాయంత్రి రవి ఇంటి వరకు మహిళల కోలాట నృత్యాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య పూర్ణ కుంభంతో ఎదురేగి వద్దిరాజు దంపతులు స్వామి వారిని తమ నివాసంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూలు, పండ్లు సమర్పించి ఘనంగా సత్కరించారు. వద్దిరాజు దంపతులకు స్వామిజీ ఆశీస్సులు అందించారు. నాలుగు రోజుల పాటు గాయత్రి రవి ఇంట్లో స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తారు. తదనంతరం జిల్లాలోని పలు దేవాలయాలను దర్శించి, ధర్మ ప్రచారం గావిస్తారు.

ఈ సందర్భంగా ఈనెల 18న శుక్రవారం ఖమ్మంలోని రాజ్‌పథ్ పంక్షన్‌హాల్లో గాయత్రి రవి విజయలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లకు పుష్పాభిషేకం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా స్వామివారు కూసుమంచి గణేశ్వర ఆలయం, ఖమ్మం నగరంలోని గుంటు మల్లేశ్వరస్వామి గుడి, స్తంబాద్రి లక్ష్మీనరసింహాస్వామి గుట్ట, ప్రఖ్యాతి గాంచిన భద్రాద్రి సీతారామ చంద్రస్వామి దేవస్థానం, జమలాపురం వెంకటేశ్వరస్వామి, దేవస్థానం, వంటి పలు దేవాలయాలను దర్శిస్తారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఖమ్మం నగరంలో గల ట్రంక్‌రోడ్‌లోని గుంటు మల్లేశ్వరస్వామి, కాల్వొడ్డులోని ఆంజనేయస్వామి ఆలయాలను స్వామివారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రి రవి నివాసంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

ఆశీస్సులు పొందిన వారిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వ్యాపార రాజకీయ ప్రముఖులు, రాయల నాగేశ్వరరావు, పారా నాగేశ్వరరావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, ఆకుల సతీష్, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, శెట్టి రంగారావు తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ప్రముఖులు, స్వామివారి హిందూ ధర్మయాత్ర రెండు తెలుగు రాష్ర్టాల సమన్వయ కర్త దరువు ఎండీ సీహెచ్ కరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిందూ ధర్మ ప్రచారయాత్రను తెలంగాణ నుంచి చేపట్టి ఈ నెల 14వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు భక్తులు ఘనస్వాగతం పలికారు.

202
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles