లక్కు కిక్కు

Mon,October 14, 2019 03:31 AM

-నేడు పాడ్యమి కావడంతో అధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం
-పెరిగిన ఫీజుతో తగ్గిన దరఖాస్తులు..
-16 వరకే మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ
-ఆరు రోజుల్లో 527 దరఖాస్తులు
-18న దుకాణాలకు డ్రా పద్ధతిలో లైసెన్స్‌ల కేటాయింపు
-నవంబర్ 1 నుంచి నూతన దుకాణాల ఏర్పాటు
ఖమ్మం, నమస్తే తెలంగాణ :లాటరీ అంటేనే అదృష్టాన్ని పరిక్షిం చుకోవడం...అందులోను కాసుల వర్షం కురిపించేందుకు అదృష్టాన్ని పరిక్షించుకోవాలంటే ముహుర్తాలు చూడాల్సిందే మరీ..చిన్నచిన్న పనులకే పూజారుల వద్దకు వెళ్లి ముహుర్తాలు చూసుకునే ప్రజలు రెండేళ్ల మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు దరఖాస్తులు అందచేసేందుకు ముహుర్తాలను చూసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరుతో అయితే ముహుర్తం బలంగా ఉంటుందో వారి పేరుతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం 2019 -21 సంవత్సరాలకు గాను ఖమ్మం జిల్లాలో 89 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 89 మద్యం దుకాణాలకు గాను 527 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 16 వరకే దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉన్నందున 14వ తేదీ సోమవారం పాడ్యమి రేవతి నక్షత్రం ముహుర్తం ఉన్నందున ఆ రోజునే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

తిరిగి చివరి రోజు అయిన 16 వ తేదీ బుధవారం కూడా మంచి రోజు కావడంతో ఆ రోజున కూడా దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడానికి వీలుందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు గా వర్ధిల్లుతుండటంతో జిల్లాకు చెందిన అనేక మంది మద్యం వ్యాపారులు ఈ ఏడాది దరఖాస్తులు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారాలలో ఉన్నవారితో పాటు ఇతరత్ర వ్యాపారాలు నిర్వహించే వారు కూడా ఈసారి తమ అదృ ష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు ఆంద్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

రూ 2 లక్షల ఫీజుతో వెనుకకు తగ్గిన ఔత్సాహికులు...
నూతన మద్యం విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి ప్రభు త్వం రూ. 2 లక్షల ఫీజును నిర్ణయించింది. లాటరీలో పేరు రాకపోతే తిరిగి చెల్లించరు కనుక దరఖాస్తు చేసుకున్నవారు ఆ డబ్బులను వదులుకోవాల్సిందే. ఈ విధానం ద్వారా అనేక మంది దరఖాస్తులు చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. మద్యం దుకాణాలకు దరఖా స్తులు దాఖలు చేసుకునేవారు అన్ని రకాల ముహుర్తాలను చూసుకుని దరఖాస్తులను అందచేస్తున్నారు. దరఖాస్తు ఫారాలను వారికిష్టమైన దేవుడి దగ్గర ఉంచి పూజలు నిర్వహించిన తరువాతనే ఎక్సైజ్ కార్యా లయాలకు వెళ్తున్నారు. కొందరైతే తమకిష్టమైన వారి చేతుల మీదుగా దరఖాస్తు ఫారాలను అందచేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొంత మంది వారి కుటుంబంలోని మహిళల పేరుమీద దరఖా స్తులు అందజేస్తున్నారు.

రెండేళ్ల క్రితం గత మద్యం పాలసీలో భాగంగా ఖమ్మం జిల్లాలో 83 దుకాణాలకు గాను 4029 దరఖాస్తులు వచ్చాయి. ఒకొక్క దరఖాస్తుకు రూ. లక్ష మాత్రమే ఫీజు నిర్ణయిం చినందున అప్పట్లో ఎక్సైజ్‌శాఖకు రూ. 40.23 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దరఖాస్తు ఫీజును రెట్టింపు చేయడంతో ఔత్సాహికుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గుతుందని బావిస్తున్నారు. ఖమ్మం స్టేషన్-1 పరిధిలోని 21 దుకాణాలకు 71 దరఖాస్తులు, స్టేషన్-2 పరిధిలోని 14 దుకాణాలకు 42 దరఖాస్తులు, నేలకొండపల్లి 70 దరఖాస్తులు, వైరాలో 75, మధిరలో 113 , సత్తుపల్లి 84, సింగరేణిలో 72 దరఖాస్తులు రావడం జరిగింది.

మూడు శ్లాబ్‌ల్లో దరఖాస్తులు..
జిల్లాలో మూడు శ్లాబ్‌లుగా నిర్ణయించడం జరిగింది. 5 వేల జనాభా వరకు సంవత్సరానికి రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50వేల జనాభా వరకు రూ. 55 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల వరకు రూ. 65 లక్షలను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. ఈ నెల 9 నుంచి అక్టోబర్ 18 న ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో దుకాణాలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు డ్రా నిర్వహించనున్నారు. డ్రాలో ఎంపికైన షాపుకి ఎక్సైజ్ ట్యాక్స్‌లో 4వ వంతుని అదే రోజు లేదా మరుసటి రోజు ట్రెజరీ చలానా, లేకపోతే డీడీ ద్వారా చెల్లించాలి. నవంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటు నూతన లైసెన్స్‌లు జారీ చేస్తారు.

218
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles