‘యాసంగి’కి సమాయత్తం

Tue,November 19, 2019 03:24 AM

- నేటి నుంచి 29 వరకు గ్రామాల్లో సభలు
- పలు అంశాలపై రైతులకు అవగాహన
- సాగుపై పెరిగిన అంచనాలు
- 82,530 హెక్టార్లకు ప్రణాళిక
- అత్యధికంగా వరి 62,500 హెక్టార్లు

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈ సారి వర్షాలు అనుకూలించడంతో యాసంగి సాగుకు వ్యవసాయశాఖ పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 29 వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి రైతులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏటా యాసంగిలో సాధారణ విస్తీర్ణం 56,365 హెక్టార్లు (1,40,912.5 ఎకరాలు) కాగా, ఈసారి 82,530 హెక్టార్లలో (2,06,325 ఎకరాలు) వివిధ పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహ భాగంలో 56,365 హెక్టార్లలో వరిసాగయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మక్కజొన్న 16 వేలు (40 వేల ఎకరాలు), పెసర 200 (500 ఎకరాలు), పల్లి 2,500 (6,250 ఎకరాలు), శనగ 250 (625 ఎకరాలు), ఇరత పంటలు 1,080 హెక్టార్లలో (2,700 ఎకరాలు) సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. అయితే ఇప్పటికే కొందరు రైతులు ముందుగానే మక్క, పల్లి పంటలు సాగు చేశారు. 1,254 హెక్టార్లలో (3,135 ఎకరాల్లో) మక్క, 1,585 హెక్టార్లలో (3,962 ఎకరాలు) పల్లి సాగు చేశారు.

విత్తనాలు, ఎరువులు సిద్ధం
యాసంగి సాగుకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులను అధికారులు సిద్ధంగా ఉంచారు. 13 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. వరి కొత్త రకాలపై కిలోకు రూ.10, పాత రకాలపై రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే 126 క్వింటాళ్ల మక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఈ విత్తనాలు కిలోపై రూ.30 సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే పెసళ్లు 113, శనిగలు 1,350, మినుములు 63, జొన్న 16, నువ్వులు 5, పొద్దుతిరుగుడు 12 క్విటాళ్ల చొప్పున అందుబాటులో ఉంచారు. ఈ విత్తనాలను 33 నుంచి 66 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 1,570 పల్లి విత్తనాలు సరఫరా చేశారు. కాగా, ప్రస్తుత అవసరాలకు తగిన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 41,400 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా, 8,200 మెట్రిక్‌ టన్నులు, 10,957 మెట్రిక్‌ టన్నుల డీఏపీకి 4,551 మెట్రిక్‌ టన్నులు, 19,354 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్‌కు 25,144 మెట్రిక్‌ టన్నులు, 6,292 మెట్రిక్‌ టన్నుల ఎంఓపీకి 1,182 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఒక ర్యాక్‌ ఎరువులు జిల్లాకు వస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ తెలిపారు.

నేటి నుంచి గ్రామ సభలు
రైతులను సాగుకు సమాయత్తం చేసేందుకు జిల్లాలో ప్రత్యేకంగా పంచాయతీల వారీగా గ్రామ సభలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామ సభకు 2 గంటల సమయాన్ని కేటాయిస్తూ అధికారులు మండలాల వారీగా షెడ్యూలు ఖరారు చేశారు. ఒక్కో మండలంలో రోజుకు 2 గ్రామ సభల చొప్పున పెద్ద మండలాల్లో రోజుకు 3 సభల చొప్పున షెడ్యూలు నిర్ణయించుకున్నారు.

షెడ్యూలు ప్రధానంగా ఆరుతడి పంటలు, సాగు పద్ధతులపై అవగాహన, పంటల బీమా, రైతు బీమా, వానా కాలం పంట దిగుబడుల నాణ్యతపై అవగాహన, ఎరువులు, విత్తనాల లభ్యత, ప్రధాన మంత్రి కిసాన్‌ నమ్మాన్‌ నిధి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. వ్యవసాయ అధికారులతో పాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పంటల సాగుపై ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవగాహన కల్పిస్తారు. రైతు సమన్వయ సమితుల కన్వీనర్లు, సభ్యులను, స్థానిక ప్రజా ప్రతినిధులను ఈ సభలకు ఆహ్వానిస్తున్నారు.

140
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles