కరీంనగర్ స్పోర్ట్స్: పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) అండర్-14 బాల బాలికల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్, ఎస్జీఎఫ్ కార్యదర్శి కే సమ్మయ్య పేర్కొన్నారు. శనివారం సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో వ్యాయామ ఉపాధ్యాయులతో డీఈవో, ఎస్జీఎఫ్ కార్యదర్శి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలను సమర్థ్ధవంతంగా నిర్వహించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలనీ, ఈ పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన సుమారు 350 మంది క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో పోటీల నిర్వహణ కమిటీలను వేసి, వారికి బాధ్యతలను సూచించారు.
అనంతరం క్రీడా మైదానాన్ని వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి డీఈవో, ఎస్జీఎఫ్ కార్యదర్శి పరిశీలించి, పలు సూచనలు చేశారు. పోటీల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలన్నారు. డిసెంబర్లో జరగాల్సిన జాతీయ ఎస్జీఎఫ్ఐ అథ్లెటిక్స్ పోటీల తేదీల్లో మార్పు కారణంగా ముందుగా నిర్వహించాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి రొండి నర్సయ్య, పెటా టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కడారి రవి, మిల్కూరి సమ్మిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు గిన్నె లక్ష్మణ్, అంతడ్పుల శ్రీనివాస్, రమణ పాల్గొన్నారు.