హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్లో సన్నరకాల్లో ఒకటైన బీపీటీ సాగు చాలా కలిసొచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎకరానికి రూ.55 వేల నుంచి 65 రాబడి వస్తుండడంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. హుజూరాబాద్ డివిజన్లో దాదాపుగా 57వేల ఎకరాల్లో వరి సాగుకాగా, ఇందులో సగం వరకు ఆర్ఎన్ఆర్, జై శ్రీరాం, కావేరి, బీపీటీ తదితర సన్నరకాలు వేశారు. అయితే ముఖ్యంగా బీపీటీ సాగు చేసిన రైతులకు వర్షాల వల్ల పెద్దగా నష్టమేమీ జరుగలేదు. దీనికితోడు చీడ పీడలు, దోమపోటు బెడద లేకపోవడమూ దిగుబడి పెరిగేందుకు ఉపకరించింది. ఎకరానికి తక్కువలో తక్కువగా 28 నుంచి 33 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. క్వింటాలుకు సీడ్ యజమానులు రూ.2050 వరకు కొనుగోలు చేయడంతో రాబడి పెరిగింది. అంతేకాకుండా పచ్చి వడ్లకు కూడా డిమాండ్ బాగానే ఉంది. క్వింటాలుకు రూ.17వందల నుంచి 18 వందల వరకు పలుకుతున్నది. ఎండిన ధాన్యానికి రైస్ మిల్లు యజమానులు రూ.19వందల నుంచి 1950 వరకు ధర పెడుతుండడంతో మంచి రాబడి వస్తున్నది. ఖరీఫ్ సీజన్లో ఇంత దిగుబడి రావడం గతంలో ఎన్నడూ లేదనీ, దీనికి తోడు ధర కూడా కలిసి వస్తుండడం సంతోషాన్ని ఇస్తున్నదని అన్నదాతలు పేర్కొంటున్నారు.