సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

Fri,November 15, 2019 03:13 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)జిల్లాలోని అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్ అధికారులను ఆదేశించారు. అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. విజయారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి, మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విజయారెడ్డి హత్య సరైనది కాదనీ, ఇది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య అనీ, ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల సహకారం తీసుకుని, సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ని రోజుల్లో పనిచేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పి, ఆ మేరకు చేసి పెట్టాలని సూచించారు. ప్రజలు చెప్పే పని న్యాయం పరిధిలో ఉంటే వినయంగా వివరించడం ద్వారా కొన్ని సమస్యలు మరోసారి ఉత్పన్నం కావని పేర్కొన్నారు. స్వీయ రక్షణ కోసం అందుబాటులో ఉన్న వీఆర్‌ఏలు, ఆఫీసు సబార్డినేట్లను వినియోగించుకోవాలని సూచించారు. తగిన సిబ్బంది లేకపోతే తమకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలతోపాటు ప్రతి తాసిల్దార్ కార్యాయాలకు వెంటనే వీడియో కెమెరాలను పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వీఆర్‌ఏ, వీఆర్వోలను వారి అర్హత, సీనియార్టీని బట్టి వారికి పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీపీ కమలాన్‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి రెవెన్యూ కార్యాలయంలో ఈ- పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విజయారెడ్డి హత్య సంఘటన విచారకరమనీ, ప్రజా సేవకులకు ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకూడదన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఈ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసి, ప్రతి 2 గంటలకు ఒకసారి బ్లూకోల్ట్స్ బృందాలు వచ్చి కార్యాలయాల పరిసరాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించామని సీపీ స్పష్టం చేశారు. ఏదైనా సంఘటన మీ పరిధిలో జరిగినపుడు వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటుందని రెవెన్యూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులకు భయపడకుండా స్వీయ రక్షణలో ఉండాలని సూచించారు. జేసీ శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్వో ప్రావీణ్య, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్టీవోలు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, కలెక్టరేట్ ఏవో రాజ్‌కుమార్, తాసిల్దార్లు పాల్గొన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles