ప్రతి గింజనూ కొంటాం

Mon,November 11, 2019 02:05 AM

-రైతులు ఆందోళన చెందొద్దు
-దళారులను నమ్మి మోసపోవద్దు
-చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
-ఎమ్మెల్సీ నారదాసుతో కలిసి ధాన్యం కేంద్రాల ప్రారంభం

రామడుగు/ గంగాధర: అకాల వర్షాల కారణంగా రంగు మారిన ప్రతి వరి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం రామడుగు మండలం దత్తోజిపేట, తిర్మలాపూర్, రాంచంద్రాపూర్, రామడుగు, కుర్ముపల్లి, వెదిర, శ్రీరాములపల్లి, దేశరాజ్‌పల్లి, శ్రీరాముపల్లి గ్రామాల్లో సింగిల్‌విండో, సెర్ఫ్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి ప్రారంభించారు. అలాగే గంగాధర మండలం మంగపేటలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వారు మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో దురదృష్టవశాత్తు అకాల వర్షాలు కురిశాయనీ, అయినప్పటికీ దిగుబడి బాగానే ఉందన్నారు. కొన్నిచోట్ల వరిచేలు నేలకొరిగాయన్నారు. నీట మునిగి ధాన్యం రంగు మారిందన్నారు. అయినా రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనీ, నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి కనీస మద్దతు ధర అందిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని కోరారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, సర్పంచులు బండ అజయ్‌రెడ్డి, బక్కశెట్టి నర్సయ్య, చాడ ప్రసూన, పంజాల ప్రమీల, కటుకం రవీందర్, తీగల సంగీత, సంటి జీవన్, కోల రమేశ్, ఎంపీటీసీలు కనుకం జయ, మోడి రవి, మడ్డి శ్యాంసుందర్‌గౌడ్, పూరెల్ల రాంగోపాల్, బొమ్మరవేని తిరుమల, కొత్త పద్మ, తొరికొండ అనిల్, వంచ మహేందర్‌రెడ్డి, మంగపేటలో సర్పంచ్ తోట వేదాంతి, నాయకులు పుల్కం నర్సయ్య, దూలం బాలగౌడ్, తోట మహిపాల్, లింగాల దుర్గయ్య, దోర్నాల మహేందర్‌రెడ్డి, స్వశక్తి సంఘం మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles