ధర్మపురి,నమస్తేతెలంగాణ : కార్తీక మాసం సందర్భంగా కార్తీక శుక్లపక్షం పదిహేను రోజుల పాటు నిర్వహించే గోదావరి హారతి కార్యక్రమంలో భాగంగా పదమూడో రోజైన ఆదివారం హారతి కార్యక్రమాన్ని కన్నులపండువలా నిర్వహించారు. ఆలయ పక్షాన దేవస్థానం నుంచి సాయంత్రం వేళ వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణ మధ్య మంగళవాయిద్యాలు వెంటరాగా అర్చకులు, సిబ్బంది, భక్తులు నది వద్దకు శోభాయాత్రగా వెళ్లారు. గోదావరి ఒడ్డున వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేసి హారతి పట్టారు. మహిళలు గోదావరిలో దీపాలు వదిలారు. దేవస్థానం ఈఓ సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అర్చకులు బొజ్జ సంతోష్‌కుమార్, బొజ్జ రాజగోపాల్, భక్తులు పాల్గొన్నారు.