పెండింగ్ అర్జీలకు ఇక మోక్షం!

Sat,November 9, 2019 04:37 AM

-ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర సర్కారు మరో చాన్స్
-డిసెంబర్ 31దాకా గడువు
-క్లియర్ చేస్తే బల్దియాలకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం
-నగరపాలక సంస్థ పరిధిలో 1,652 దరఖాస్తులు
-సద్వినియోగం చేసుకోవాలని అర్జీదారులకు అధికారుల పిలుపు

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. గతేడాది ఏప్రిల్ వరకు ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం ఇచ్చి, పూర్తి చేసింది. కానీ, అప్పటికి కూడా ఇంకా వేల సంఖ్యల్లోనే దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని క్లియరెన్స్ చేస్తే ఆయా నగరపాలక, పురపాలక సంస్థలకు భారీగానే ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలతోపాటు ఆయా నగరపాలక, పురపాలక సంస్థల్లో విలీనమైన గ్రామాల్లోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కారు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తీసుకువచ్చింది. వీటికితోడుగా గతంలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకొని, పెండింగ్‌లో ఉన్న ఫైల్స్‌ను పరిష్కరించేందుకు అవకాశమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు పరిష్కారం లభించనున్నది.

1,652 దరఖాస్తులకు మోక్షం..
రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రారంభించి, నవంబర్ 2016 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. అప్పుడు నగరపాలక సంస్థ పరిధిలో 4,368 దరఖాస్తులు వచ్చాయి. 72 దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఇప్పటి వరకు 2,644 దరఖాస్తులను పరిశీలించి ఎల్‌ఆర్‌ఎస్ అనుమతి పత్రాలను మంజూరు చేశారు. ఇంకా 1,652 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో డిసెంబర్ 31లోగా ఈ దరఖాస్తులను కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు బల్దియా అధికారులు దృష్టి సారిస్తున్నారు. పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్ అర్జీలను పరిష్కరించేందుకు దరఖాస్తుదారులకు నోటీసులు ఇస్తున్నా స్పందన రావడం లేదు.

ఆదాయంపై దృష్టి..
ప్రభుత్వం ఇస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా ఆయా మున్సిపాలిటీలకు భారీగానే ఆదాయం వచ్చే అవకాశమున్నది. కరీంనగర్ నగరపాలక సంస్థకు ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చిన దరఖాస్తుల్లో 2,644 పరిష్కరించగా, 30.74 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ మేరకు ఈ నిధులతో ఇప్పటికే నగరంలో అనేక అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మిగిలిన 1,652 దరఖాస్తులను కూడా పరిష్కరిస్తే మరో 20 కోట్ల మేరకు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటితోపాటు విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చే దరఖాస్తులతో ఈ ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న యజమానులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles