దైవ చింతనతో ప్రశాంత జీవనం

Thu,November 7, 2019 12:43 AM

వీణవంక: దైవ చింతనతో ప్రశాంత జీవనం లభిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయాలు దేవాలయాలు అనీ, వాటి నిర్మాణం ద్వారానే ప్రజలకు సభ్యతతో కూడిన జీవనవిధానం అలవడుతుందని అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీరామచంద్ర స్వామి ఆలయ మూర్తి ప్రతిష్టా మహోత్సవాలకు మంత్రి ఈటలతో పాటు పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీత్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో చిన్నజీయర్ స్వామీజీ క్షీరాభిషేకం, జలాభివాసం, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టా వంటి కార్యక్రమాలను వేదపండితులతో మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ బేతిగల్ గ్రామానికి చిన్నజీయర్ స్వామీజీ రావడం ప్రజల అదృష్టమన్నారు. 20, 30 ఏళ్లుగా ఈస్ట్ గోదావరిలో ఎలాంటి పంటలు పండుతున్నాయో అలాంటి భూములు వీణవంక మండలంలోనివి అనీ, హైబ్రీడ్ విత్తనాలు వచ్చాక పంటలు కంటికి కనబడుతున్నాయి కానీ, సుఖ, సంతోషాలు మాత్రం కనబడడం లేవని తెలిపారు.

సంపద పెరిగిన కొద్దీ మానవ సంబంధాలు తగ్గుతున్నాయనీ, అధ్యాత్మికత ద్వారా మళ్లీ ప్రాచీన సాంప్రదాయాలు పరిపుష్టి కావాలని ఆకాంక్షించారు. పురాతన కాలంలో ఇంటికి చుట్టాలు వస్తే మోత్కాకులలో అన్నం తినే వాళ్లమనీ, అధునాతన జీవనవిధానానికి అలవాటు పడి అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నామని చెప్పారు. చిన్నజీయర్ స్వామిజీ కేవలం తత్వం మాత్రమే చెప్తారని అందరూ అంటారనీ, కానీ ఆయన మనుషుల ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తారని తెలియజేశారు. కాన్సర్‌తో చాలా మంది ప్రజలు చనిపోతున్నారనీ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తాను ఆరోగ్యశాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక పిలుచుకొని స్వామీజీ తెలియజేశారని గుర్తు చేశారు. ఆరోగ్యంతో పాటు, దైవిక చింతన ద్వారా మనుషులు ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారని పేర్కొన్నారు. అనంతరం చిన్నజీయర్ స్వామీజీ మంత్రులను శాలువాలతో సన్మానించి, అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ శారద, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మారముల్ల కొమురయ్య, సర్పంచ్ సారయ్య, ఎంపీటీసీ స్వామి, నాయకులు మాడ సాదవరెడ్డి, ముసిపట్ల తిరుపతిరెడ్డి, వాల బాలకిషన్, పింగిలి రమేశ్, గొర్రె రాజమౌళి, గొట్టుముక్కుల రవీందర్‌రావు, రంగారావు, నారాయణరావు, చొప్పరి సారయ్య, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మండలంలోని బేతిగల్, నర్సింగాపూర్, వల్భాపూర్, కొండపాక, పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, ఘన్ముక్ల, బొంతుపల్లి, గంగారం, ఎలుబాక, కోర్కల్, బ్రాహ్మణపల్లి, రామకృష్ణాపూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, వైస్‌ఎంపీపీ లత, నాయకులు కొమురయ్య, చాడ రాజేందర్, మోటం వెంకటేశ్, తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ ఇన్‌చార్జి రాంచందర్, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles