కొనసాగిన అధికారుల నిరసన

Thu,November 7, 2019 12:43 AM

సుభాష్‌నగర్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనపై బుధవారం కూడా రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది, టీఎన్జీవోస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి, కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ సంఘం జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, విజయారెడ్డి సజీవ దహనం ఘటన హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు పునరావృతం కాకుండా, హత్య వెనుక కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకొని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపెల్లి కాళీచరణ్‌గౌడ్, లక్ష్మణరావు, నర్సింహాస్వామి, కిషన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రవీందర్, శారద, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవాసంఘం నాయకులు హరికిరణ్, భవానీ, వైశాలీ, అనీల, రేఖతోపాటు తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

నిలిచిన రెవెన్యూ సేవలు
జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సేవలు స్తంభించాయి. అబ్దుల్లాపూర్‌మెట్ తాసీల్దార్ సజీవదహనం నేపథ్యంలో మూడురోజుల నిరసనల కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు కలెక్టరేట్ ప్రధాన విభాగంతోపాటు జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో బుధవారం కూడా సేవలను నిలిపివేశారు. గురువారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ట్రెసా జిల్లా కార్యదర్శి శ్రావణ్‌కుమార్ తెలిపారు. నిందితుడి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles