ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Wed,October 16, 2019 02:00 AM

జమ్మికుంట/ ఇల్లందకుంట: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలను అన్ని వర్గాల సహకారంతో పూర్తి చేయాలనీ, అభివృద్ధి పనులను కొనసాగించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు ఆదేశించారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో జయశ్రీ ఆధ్వర్యంలో, ఇల్లందకుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో స్వరూప ఆధ్వర్యంలో ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. వీటికి డీఆర్డీవో హాజరై మాట్లాడారు. ఉమ్మడి మండలంలో రూర్బన్ పథకాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. అందుకు ప్రత్యేకాధికారులు తయారు చేసిన పనుల ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలనీ, ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పట్టుకునేలా పనులుండాలన్నారు. అలాగే గ్రామాల్లో శ్మశాన వాటిక నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. చెత్త కోసం డంపింగ్ యార్డుల ఏర్పాటు తప్పనిసరన్నారు. రెవెన్యూ అధికారుల నుంచి ప్రభుత్వ స్థలాలను సేకరించాలని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయనీ, నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వంటి కార్యక్రమాలను బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి, పనుల పెండింగ్, తదితర అంశాలపై అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో నేరుగా చర్చించారు. తగు సలహాలు, సూచనలు అందించారు. వారికున్న సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles