రోజూ జనవరి నుంచి తాగునీరు

Tue,October 15, 2019 02:52 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలనీ, జనవరి ఒకటి నుంచి ప్రతి రోజూ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ మేరకు మిషన్ భగీరథ పనులపై స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగరపాలక, ఆర్‌డబ్ల్యూఎస్, భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో భగీరథ పనులు చేపడుతున్న ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు దసరా నాటికే పూర్తి చేస్తామన్నారనీ, కానీ ఇంకా కొనసాగుతున్నాయనీ, ఎప్పటిలోగా పూర్తి చేస్తారని నిలదీశారు. దీనిపై ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు మరో 45 రోజుల్లోగా పూర్తి చేస్తామని చెప్పగా.. డిసెంబర్ 15 నాటికి పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా వేసే రోడ్లను తవ్వవద్దని తాను మూడేళ్లుగా పదే పదే చెబుతున్నాననీ, అయినా తవ్వుతున్నారని మండిపడ్డారు. ఇదేం పద్ధతి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోడ్లలో ఎక్కడెక్కడ ఇంకా పైపులైన్లు, ఇతర పనుల కోసం తవ్వకాలు ఉన్నాయో చెప్పాలని సూచించారు.

ఏవైనా ఉంటే ఇప్పుడే చేయాలనీ, అప్పటి వరకు రోడ్ల నిర్మాణ పనులను ఆపుతామన్నారు. ఒక్కసారి రోడ్డు వేసిన తర్వాత మళ్లీ తవ్వితే మాత్రం ఈసారి కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. ఇంకా నాఖా చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు పైపులైన్ పనులు చేయాల్సి ఉందని డీఈ యాదగిరి పేర్కొనగా.. రెండేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్యోగులు ఏదో జీతం వస్తుంది అన్నట్లుగా కాకుండా రాష్ట్ర, నగర పౌరుడిగా బాధ్యతతో పని చేయాలని సూచించారు. తామొక్కరమే పనులు చేయడం సాధ్యకాదనీ, అధికారులు, ఉద్యోగులంతా సమష్టిగా, చిత్తశుద్ధితో పని చేసినప్పుడే అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. తాను మరోసారి అధికారులను కోరుతున్నాననీ, మీరు చెప్పిన సమయంలోగా పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులను త్వరలోనే చెల్లిస్తామనీ, వారు పనులు చేయకపోతే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తున్నా.. అధికారులు, ఉద్యోగులు వారితో పని చేయించుకోకపోతే ఎలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. నగరంలో మిషన్ భగీరథ పనులను పూర్తి చేస్తే రోజూ నీటి సరఫరా అందించడంతో పాటు, 24 గంటల సరఫరాకు చర్యలు మొదలు పెడుతామని మంత్రి పేర్కొన్నారు.

ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లాలి
స్మార్ట్‌సిటీ కింద చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను పక్కా ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లాలని మంత్రి గంగుల సూచించారు. ఈ నిధులతో చేపడుతున్న రోడ్ల పనులను మాస్టర్ ప్లాన్ మేరకు చేయాలనీ, దీని ప్రకారం ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో గుర్తించి వెంటనే తొలగించాలన్నారు. మంగళవారం నుంచి స్మార్ట్‌సిటీ రోడ్లకు సంబంధించి మార్కింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే అభివృద్ధి చేయనున్న ఈ రోడ్లలో పూర్తిస్థాయిలో పైపులైన్ పనులు, విద్యుత్ పోల్స్ మార్పులు, ఇతర అన్ని కేబుల్ వేసుకోవాలనీ, రోడ్డు వేసిన తర్వాత తవ్వకాలు మాత్రం చేయవద్దని చెప్పారు. నగరంలోని మార్క్‌ఫెడ్ నుంచి వన్ టౌన్ పోలీస్‌సేష్టన్ వరకు, కోర్టు నుంచి ఆర్టీసీ వర్క్‌షాపు వరకు ఆర్ అండ్ బీ అధికారులు ఫైనల్ బీటీ పనులు త్వరలోనే చేపడుతారని తెలిపారు. ఆలోపు ఏవైనా పనులు ఉంటే పూర్తి చేసుకోవాలన్నారు.

పైపులైన్‌ను వినియోగంలోకి తేవాలి
నాలుగున్నరేళ్ల క్రితం ఫిల్టర్ బెడ్ నుంచి మార్కెట్ రిజర్వాయర్ వరకు రూ.6 కోట్ల వ్యయంతో వేసిన 600 డయా పైపులైన్‌ను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి గంగుల అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. గణేశ్‌నగర్ బైపాస్ రోడ్డు పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని రోజుల వరకు పనులు ప్రారంభించకుండా ఉంటారని మండిపడ్డారు. ఎందుకు ఇంకా డిజైన్లు, మ్యాపింగ్ పేరుతో పెండింగ్‌లో పెట్టారంటూ నిలదీశారు. వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని కమిషనర్‌ను ఆదేశించారు.

కొత్త రోడ్లను తవ్వకుండా చూస్తాం
- నగర కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి
ఇప్పటి నుంచి నగరంలో ఎక్కడైనా రోడ్లు అభివృద్ధి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు చేయమనీ, ఒక వేళ చేస్తే ఆయా వస్తువులను సీజ్ చేసేలా చూస్తామని నగర కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి మంత్రికి తెలిపారు. స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్న రోడ్ల పనుల విషయంలో ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. వీటిల్లో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందుగానే పైపులైన్లు, ఇతర పనులన్నింటినీ పూర్తి చేసుకున్న తర్వాత రోడ్లను వేస్తామన్నారు. అలాగే నగరంలోని 14 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లలో ప్రస్తుతం పారిశుధ్య సిబ్బంది పూర్తిస్థాయి పరిశుభ్రం చేయడంతో పాటు, మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ ఉద్యోగులు ఆయా రోడ్లలో పర్యటించాలనీ, రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాల్వల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలనీ, అవసరమైన ప్రాంతాల్లో ర్యాంపులు సిమెంట్‌తో నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అమరేందర్, అధికారులు చలిమారెడ్డి, ధర్మారెడ్డి, బల్దియా ఎస్‌ఈ భద్రయ్య, డీఈలు, ఏఈలు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


జనవరి నుంచి రోజూ తాగునీరు

97
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles