కృష్ణ తులసితో దోమల నివారణ

Tue,October 15, 2019 02:50 AM

వీణవంక: ప్రస్తుతం దోమల ద్వారా అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయనీ, వాటి నివారణకు కృష్ణతులసి మొక్కలు దోహదపడుతాయని ఎంపీపీ ముసిపట్ల రేణుక పేర్కొన్నారు. మండలానికి ప్రభుత్వం 20 కేజీల విత్తనాలు సరఫరా చేయగా, సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక, ఎంపీడీఓ భాస్కర్‌లు పంచాయతీ కార్యదర్శులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దోమల వల్ల అనేక మంది విషజ్వరాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సీజన్‌ను అనుసరించి ముఖ్యంగా గ్రామాల్లో వాటి బెడద ఎక్కువగా ఉంటున్నదని తెలిపారు. సరైన నియంత్రణ చర్యలు పాటించక పోవడం వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జ్వరాల బారిన పడడంతో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలోనే మొదటి సారిగా మండలానికి కృష్ణతులసి విత్తనాలు చిత్తూరు జిల్లా నుంచి సరఫరా చేసిందని వెల్లడించారు. మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉండగా, ఒక్కో కేజీ చొప్పున విత్తనాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. మండలంలోని నర్సరీల్లో మొత్తం 3 లక్షల మొక్కలను 3 నెలల వ్యవధిలో పెంచనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతి ఇంటికి 21 మొక్కల చొప్పున అందజేస్తామనీ, వాటిని సంరక్షించడం ద్వారా దోమల నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధిహామీ సూపర్‌వైజర్ మమత, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నాయకులు తిరుపతిరెడ్డి, సంపత్‌రెడ్డి, కోమల్‌రెడ్డి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles