నిండుకుండలా ఎల్‌ఎండీ

Sun,October 13, 2019 12:56 AM

- జలాశయం @ 20.5 టీఎంసీలు
- రెండు రోజుల క్రితం నిలిచిన ఇన్‌ఫ్లో
- నేటి నుంచి దిగువకు నీటి విడుదల
- కాలువలను ధ్వంసం చేయద్దు : ఈఎన్సీ అనిల్‌కుమార్‌

(తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ) లోయర్‌ మానేరు డ్యాం పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ఆగస్టు చివరివారం నాటికి నిల్వ 3.493 టీఎంసీలకు చేరింది. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’ ఎల్‌ఎండీకి ప్రాణం పోసింది. చరిత్రలోనే మొదటిసారిగా శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయం నుంచి నీటి విడుదల సాగింది. గత ఆగస్టు 31 నుంచి గేట్లు ఎత్తి, కాళేశ్వర జలాలను విడుదల చేయడంతో దిగువ మానేరు జలాశయంలో క్రమంగా నీటిమట్టం పెరిగింది. రెండు రోజుల క్రితమే ఇన్‌ఫ్లో నిలిచిపోగా, ప్రస్తుతం నీటినిల్వ 20.543 టీఎంసీలుగా ఉన్నది. పోయినేడు ఇదే సమయానికి 6.643 టీఎంసీల ఉండగా, ప్రస్తుతం నిండుగా నీళ్లతో కళకళలాడుతున్నది. ప్రస్తుతం ఎల్‌ఎండీ నుంచి మిషన్‌ భగీరథతోపాటు వివిధ జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం 280 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నది.

నేటి నుంచి దిగువకు నీటి విడుదల..
ప్రస్తుతం దిగువ మానేరు జలాశయం నిండుకుండలా మారడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు వెల్లడించారు. స్టేజ్‌-1, 2 కింద కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడంతోపాటు చెరువులు, కుంటలు నింపనున్నారు. ఈ విషయాన్ని కరీంనగర్‌ ప్రాజెక్టుల ఈఎన్‌సీ, ఎస్సారెస్పీ ఇన్‌చార్జి సీఈ అనిల్‌కుమార్‌ తెలిపారు. స్టేజ్‌ 1 పరిధిలోని 146 కిలోమీటర్‌ నుంచి 284 కిలోమీటర్‌ వరకు, స్టేజ్‌ -2పరిధిలోని 284 నుంచి 350 కిలోమీటర్‌ వరకు నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. మొదట 500 క్యూసెక్కులు విడుదల చేసి, దశల వారీగా పెంచుతామని స్పష్టం చేశారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలనీ, కాలువలను ధ్వంసం చేయవద్దని రైతులను కోరారు. నేటి నీటి విడుదల కోసం అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎస్సారెస్పీ జీవీసీ-4 ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles