హోరాహోరీగా జూడో చాంపియన్‌షిప్‌ పోటీలు

Sun,October 13, 2019 12:55 AM

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: నగరంలో జగిత్యాల రోడ్డులోని వివేకానంద రెసిడెన్షియల్‌ సీబీఎస్‌ఈ పాఠశాలలో సౌత్‌జోన్‌ సీబీఎస్‌ఈ పాఠశాలల జూడో చాంపియన్‌షిప్‌ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్రీడాకారులు నువ్వా నేనా అన్న తరహాలో పతకమే లక్ష్యంగా వీరోచితంగా పోరాడుతున్నారు. రెండో రోజు పోటీల్లో తమిళనాడుకు చెందిన వివిధ పాఠశాలల క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ చూపి అత్యధిక స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకొన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు సైతం రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. శనివారం నాటి పోటీలను జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి సంపత్‌రావు క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. జూడో క్రీడతో విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. జిల్లాలో ఈ క్రీడకు విశేష ఆదరణ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల అబ్జర్వర్‌ వినిల్‌ కుమార్‌, నిర్వాహకులు టీ సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ చిత్తరంజన్‌ మహపాత్రతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కోచ్‌లు, మేనేజర్‌లు, పీఈటీలు బాలరాజు, ఎల్వీ రమణ, అభినవ్‌, సురేశ్‌, రవి, శ్రీధర్‌, క్రాంతి, టీ సంగీత, ప్రియాంక, జ్యోతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నేడు పోటీల ముగింపు కార్యక్రమం ఉంటుందనీ, ముఖ్య అతిథులుగా కరీంనగర్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి అశోక్‌కుమార్‌ హాజరవుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ టీ లలితాకుమారి వెల్లడించారు.

రెండో రోజు విజేతలు
అండర్‌ 11 కేటగిరీ 25 కేజీల విభాగంలో కమలేశ్‌ (తమిళనాడు) స్వర్ణ పతకం, అనీష్‌ (తెలంగాణ) రజతం, 30 కేజీల లోపులో అత్విక్‌వర్ధన్‌ (తమిళనాడు) స్వర్ణం, దేవదర్శన్‌ (తమిళనాడు) రజత పతకాలను కైవసం చేసుకున్నారు.
అండర్‌-14 కేటగిరీ 35 కేజీల విభాగంలో దర్శన్‌ (ఏపీ) స్వర్ణం, కృష్ణ అగర్వాల్‌ (తమిళనాడు) రజతం, 40 కేజీల లోపు అరవింద్‌ (తమిళనాడు), సుదర్శన్‌ (తమిళనాడు) రజతం పతకాలను అందుకున్నారు.
అండర్‌-17 కేటగిరీ 50 కేజీల లోపు విభాగంలో జనార్దన్‌ (తమిళనాడు) స్వర్ణం, నిఖిల్‌ (తమిళనాడు) రజతం, 55 కేజీల లోపు కార్తీక్‌ (తమిళనాడు) స్వర్ణం, శ్యాంప్రశాంత్‌ (తమిళనాడు) రజతం, 55 కేజీల లోపులో సుజాయ్‌ (తమిళనాడు) స్వర్ణం, నిదర్శన్‌ (తమిళనాడు) రజతం, 60 కేజీల లోపులో భూపతిరాజు (తమిళనాడు) స్వర్ణ, శ్రీరామ్‌ కైలాశ్‌ (తమిళనాడు) రజత పతకాలను కైవసం చేసుకున్నారు.
అండర్‌-19 కేటగిరీ 60 కేజీల విభాగంలో సూర్యశాంతన్‌ (తెలంగాణ) స్వర్ణం, వినీత్‌ (తమిళనాడు) రజత పతకాలను అందుకున్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles