52 ఏళ్ల వయసులో కవలలు జననం

Sun,October 13, 2019 12:55 AM

కరీంనగర్‌ హెల్త్‌ : పిల్లలు లేరని నిరుత్సాహంతో బాధపడుతూ ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న తరుణంలో కరీంనగర్‌లోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలోని డాక్టర్‌ పద్మజా ఐవీఎఫ్‌ ద్వారా సంతాన సౌభాగ్యాన్ని కల్పిస్తున్నారు. భద్రాచలానికి చెందిన దంపతులు ఆరె సత్యనారాయణ-రమాదేవి వ్యాపారం నిర్వహిస్తుంటారు. వీరికి ఒక కూతురుతో పాటు 18 ఏళ్ల కొడుకు ఉండగా, 15 ఏళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందాడు. దీంతో మరొక సంతానం కోసం రాష్ట్రంలోని హైదరాబాద్‌, వైజాగ్‌, ఇతర చోట్ల ఐవీఎఫ్‌ చేయించుకుని విఫలమయ్యారు. చివరగా కరీంనగర్‌లోని డాక్టర్‌ పద్మజా వద్దకు వచ్చి తమకు సంతానం కావాలని కోరారు. రమాదేవిని పరీక్షించగా 52 సంవత్సరాలతో పాటు బీపీ, షుగర్‌, గుండె జబ్బు కూడా ఉండడంతో ఐవీఎఫ్‌ ద్వారా శుక్రవారం సాధారణ ప్రసవం చేసి కవల పిల్లలు జన్మించేలా చికిత్స అందించారు. కవలలు ఆరోగ్యంగా ఉన్నారు. ఒకరు రెండు కిలోలు, మరొకరు రెండు కిలోల 200 గ్రాములు జన్మించారు. ఈ సందర్భంగా వెన్నెల నర్సింగ్‌ హోం, పద్మజా సంతాన సాఫల్య కేంద్రం వైద్యురాలు డాక్టర్‌ పద్మజా మాట్లాడుతూ 35 ఏళ్లు దాటిన మహిళలకు అండాలు రావడం కష్టమనీ, కానీ దాత అండాలతో ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం 55 ఏళ్ల వరకు టెస్ట్‌ ట్యూబ్‌ బేబి పద్ధతిలో మాతృత్వం పొందవచ్చన్నారు. 54 ఏళ్ల వరకు చాలా మందికి ఐవీఎఫ్‌ ద్వారా సంతాన భాగ్యం కల్పించినట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో 40 ఏళ్లు దాటిన మహిళలు పిల్లలు కారనే నిరుత్సాహంతో విడాకులు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారనీ, అలాంటి వారు అధైర్యానికి లోను కాకుండా సంతానాన్ని పొందవచ్చని తెలిపారు. సత్యనారాయణ-రమాదేవి దంపతులు మాట్లాడుతూ సంతానం కోసం తిరగని చోటు లేదనీ, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత డాక్టర్‌ పద్మజా తమకు సంతాన భాగ్యం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారనీ, ఇక్కడ సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉండడం సంతోషించదగిన విషయమన్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles