స్వచ్ఛపథం

Sun,September 15, 2019 02:50 AM

-జిల్లాలో జోరుగా 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక
-అపరిశుభ్రత.. చెత్తపై పల్లెల్లో యుద్ధం
-స్వచ్ఛందంగా ముందుకొస్తున్న గ్రామీణులు
-ఊరూరా గ్రామసభలు, శ్రమదానాలు
-రోజంతా పారిశుధ్య పనులు
-సిరిసేడులో పాల్గొన్న జడ్పీ అధ్యక్షురాలు విజయ
-పలు మండలాల్లో పర్యటించిన ప్రత్యేకాధికారులు

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలకు గ్రామాల్లో అనూహ్య స్పందన వస్తున్నది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామసభలకు హాజరవుతూ సూచనలు, అభిప్రాయాలు ఇస్తున్నారు. ఇల్లందకుంట మండలం సిరిసేడులో నిర్వహించిన గ్రామ సభలో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ పాల్గొన్నారు. వీణవంక మండల కేంద్రంతోపాటు కోర్కల్‌లో పెద్ద ఎత్తున శ్రమదాన కార్యక్రమాలు జరిగాయి. ఎంపీపీ రేణుక ఇక్కడ పాల్గొన్నారు. జమ్మికుంట మండలం పెద్దంపల్లిలో గ్రామసభ నిర్వహించి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకున్నారు. గ్రామాభివృద్ధిపై చర్చ జరిగింది. బడ్జెట్‌ను తయారు చేసుకోగా, ఎంపీపీ దొడ్డె మమత పాల్గొన్నారు. పాపయ్యపల్లి గ్రామాన్ని ఎంపీడీవో జయశ్రీ సందర్శించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై గ్రామస్తులకు అగాహన కల్పించారు. కోరపల్లిలో మాచనపల్లిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో స్థానిక సర్పంచ్, ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో వీధుల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు.

n మానకొండూర్ మండలంలోని పచ్చునూరు, మద్దికుంట, లలితాపూర్ గ్రామాల్లో ప్రత్యేక అధికారి, డీఆర్డీవో ఏ వెంకటేశ్వర్‌రావు పర్యటించారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ, నుస్తులాపూర్ గ్రామాల్లో ప్రత్యేకాధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి ఖధీర్ అహ్మద్, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి పరిశీలించారు. శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో ప్రత్యేకాధికారి, జిల్లా వయోజన విద్యా డైరెక్టర్ జయశంకర్, ఎంపీడీవో వినోద్ పాల్గొన్నారు. ఈ గ్రామంలో జేసీబీ సహాయంతో రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని, పిచ్చి మొక్కలను పెద్ద ఎత్తున తొలగించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో జడ్పీటీసీ సభ్యులు మాడుగుల రవీందర్‌రెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మొక్కలు నాటారు. కొండాపూర్‌లో విద్యుత్ సమస్యలను గుర్తించి మరమ్మతులు చేశారు.

-చిగురుమామిడి మండలం లంబాడిపల్లి, సీతారాంపూర్‌లో ప్రత్యేకాధికారి బాల సురేందర్ పాల్గొని, ఇక్కడ జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. బొమ్మనపల్లిలో ప్లాస్టిక్ నిషేధంపై స్థానికులు భారీ ర్యాలీ తీశారు. రేకొండ, ఉల్లంపల్లి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పారిశుధ్యం పనులు చేపట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. సైదాపూర్ మండలం జాగీరుపల్లి, రాంచంద్రాపూర్ గ్రామాల్లో ప్రత్యేకాధికారి రవిందర్ పాల్గొన్నారు.
n చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో ఎంపీపీ చిలుక రవీందర్, ప్రత్యేకాధికారి, జిల్లా సహకార అధికారి శ్రీమాల శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీధుల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొనడంతో వీధులన్నీ పరిశుభ్రంగా మారాయి. గంగాధర మండలం వెంకటాయపల్లిలో శ్రమదాన కార్యక్రమాలు జరిగాయి. నారాయణపూర్‌లో ఐసీడీఎస్ అధికారులు మొక్కలు నాటారు.

రామడుగు మండలం గుండి, గోపాల్‌రావుపేటలో ప్రత్యేకాధికారి శ్రవన్‌కుమార్, ఎంపీడీవో మల్హోత్ర శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ మండలం చేగుర్తిలో ప్రత్యేకంగా స్వశక్తి సంఘాల మహిళలు శ్రమదానం చేశారు. చామన్‌పల్లి, దుబ్బపల్లి, గోపాల్‌పూర్, జూబ్లీనగర్, నగునూర్ గ్రామాల్లో ఆర్డీవో ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం బావుపేటలో శ్రమదాన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. బద్దిపల్లి, కమాన్‌పూర్ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కమాన్‌పూర్‌లో ప్రత్యేకంగా ప్లాస్టిక్ నిషేధంపై ఇంటింటా ప్రచారం చేశారు.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles