సమాచారం చాలా విలువైంది

Sat,September 14, 2019 03:03 AM

కరీంనగర్ ఎడ్యుకేషన్: సమాచారం చాలా విలువైందనీ, వార్తలు సమాజాన్ని జాగృతం చేసేలా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో జర్నలిజం-సామాజిక బాధ్యత అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వార్తల్లో వాస్తవాలు ఉండాలనీ, అవి జాతి ప్రయోజనాలను కాపాడేలా చూడాలని యువ జర్నలిస్టులను కోరారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై జాతీయ మీడియా దృష్టిని పెట్టాలన్నారు. మీడియా చాలా విస్తృతమైందనీ, నేడు సోషల్ మీడియాపై జాగ్రత్తగా మెదలాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల జర్నలిజం కోర్సు విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మరో విశిష్ఠ అతిథిగా హాజరైన ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ..

ప్రజాహితం కోసం పత్రికలు పనిచేయాలనీ, వార్తల్లో సత్యాన్వేషణ ఉండాలని కోరారు. నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి గల తేడాలను యువ జర్నలిస్టులకు వివరించారు. అనంతరం జర్నలిజం కోర్సు విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో నమస్తే తెలంగాణ దినపత్రిక కరీంనగర్ బ్యూరో ఇన్‌చార్జి కే ప్రకాశ్‌రావు వార్తా రచన-చట్టాలు-అవగాహన అంశంపై విద్యార్థులకు వివరిస్తూ.. అనుభవమే అన్నీ నేర్పుతుందనీ, యువ జర్నలిస్టులుగా రాణించాలంటే ముందుగా సేకరించే వార్తలపైన అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాచారాన్ని యథాతథంగా రాయాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం పత్రికలు- ప్రజాదృక్పథాలు అంశంపై నవతెలంగాణ దినపత్రిక కరీంనగర్ బ్యూరో చీఫ్ పీఎస్ రవీంద్ర, ప్రజల భాష-పత్రికల ప్రయోగాలు అంశంపై కవి, కాలమిస్ట్ అన్నవరం దేవేందర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు అతిథులకు జ్ఞాపికలను అందజేశారు.

యువత జర్నలిజంపై ఆసక్తి పెంచుకోవాలి: జేసీ
యువత జర్నలిజంపై ఆసక్తిని పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ సూచించారు. సదస్సుకు మధ్యాహ్నం హాజరైన జేసీ మాట్లాడుతూ.. యువ జర్నలిస్టులుగా రాణించాలంటే ముందుగా భాషపై పట్టు సాధించాలన్నారు. పవిత్రమైన జర్నలిజంపై ఉత్సాహంతో మహిళలు ముందుకురావడం ఆనందంగా ఉందన్నారు. కరీంనగర్ జిల్లా గొప్ప జర్నలిస్టులను అందించిందనీ, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ నగునూరి శేఖర్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ, జర్నలిజం కోర్సు కోఆర్డినేటర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles