ప్రణాళికతో సమగ్రాభివృద్ధి

Fri,September 13, 2019 04:17 AM

వీణవంక/జమ్మికుంట : పల్లెల ప్రగతి కోసం సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం చేపట్టారనీ, దీని ద్వారా గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం వీణవంక మండలం కనపర్తి, జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామసభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కనపర్తిలో సర్పంచ్ పర్లపెల్లి రమేశ్ ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్లు, కోలాటాలు, కళాకారులు నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. రెండు గ్రామాల్లో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామ సభలో తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాలని సూచించారు. వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండాలనీ, బహిరంగ మలవిసర్జన చేయరాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్యం ఉచితంగా అందజేస్తుందనీ, సీఎం రిలీఫ్ ఫండ్‌తో బాధితులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

కళ్లల్లో మన్నుకొట్టే మోసగాళ్ల మాటలు విని అభివృద్ధికి అడ్డుపడొద్దనీ, నిత్యం కళ్లల్లో కనబడే వ్యక్తి ఈటల రాజేందర్ అనీ, సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సంక్షేమంలో ముందుకు సాగుతుందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో మోటర్లు లేకుండా రెండు పంటలకు నీళ్లందే రోజులు వచ్చాయని తెలిపారు. పెద్దంపల్లిలోని పలు సమస్యలను తెలుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ భవనం, శ్మశాన వాటిక, మిగిలిన వీధుల్లో సీసీ రోడ్లు, పోశమ్మగుడి నిర్మాణాలతో పాటు రోడ్లకు ఇరువైపుల విద్యుత్ దీపాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రూర్బన్ పథకం ద్వారా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. రెండు గ్రామాల్లో పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎంపీపీలు ముసిపట్ల రేణుక, దొడ్డె మమత, జడ్పీటీసీలు మాడ వనమాల, శ్రీరాం శ్యాం, సహకార సంఘాల రాష్ట్ర చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, తాసిల్దార్లు కృష్ణచైతన్య, నారాయణ, ఎంపీడీఓలు గాజుల భాస్కర్, జయశ్రీ, పెద్దంపల్లి సర్పంచ్ అన్నపూర్ణ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మారముల్ల కొమురయ్య, కో ఆప్షన్‌మెంబర్ హమీద్, తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles