పల్లెపల్లెనా.. ప్రగతి చైతన్యం

Wed,September 11, 2019 01:50 AM

మోడల్‌ విలేజ్‌లుగా తీర్చిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘30రోజుల పల్లె ప్రణాళిక’ పండుగలా సాగుతున్నది. ఈ నెల 6న జిల్లాలో మొదలైన ఈ కార్యక్రమం ఐదో రోజుకు చేరుకోగా, పల్లెపల్లెనా ప్రగతి చైతన్యం వెల్లివిరుస్తున్నది. మొదటి రోజు ముఖ్యమంత్రి సందేశాలను వినిపించి గ్రామసభలను ప్రారంభించిన జిల్లా, మండల స్ధాయి అధికారులు, గ్రామస్తులను భాగస్వాములు చేసి, ప్రాధాన్యతా క్రమంలో పనులను గుర్తిస్తున్నారు. అన్ని జీపీల్లోనూ కో-ఆప్షన్‌, స్థాయీ సంఘాల సభ్యులను ఎన్నుకొని, సోమవారం నుంచి పాదయాత్రలు చేస్తూ సమస్యల జల్లెడ పడుతున్నారు. పారిశుధ్యం, హరితహారం, వీధిదీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభించారు. గురువారం వార్షిక, పంచవార్షిక ప్రణాళికలు రూపొందించుకునేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు.


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై మొదటి రోజు నుంచే గ్రామీణ ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో మొదటి రోజు గ్రామ సభలు నిర్వహించారు. ప్రతి గ్రామసభలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. ప్రత్యేక ప్రణాళిక ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. అనేక గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వికాస్‌రాజ్‌తోపాటు రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ సర్ఫరాజ్‌అహ్మద్‌ పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టడం, ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతంగా పెంపొందించడం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయడం, నియంత్రిత పద్ధతిలో నిధులు వినియోగం, ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం వంటి ప్రధాన లక్ష్యాలతో చేపట్టిన ఈ కార్యక్రమంపై రోజు రోజుకూ ప్రజల్లో ఆసక్తి కలుగుతోంది.

గ్రామాల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం
ప్రభుత్వం ఇచ్చిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పంచాయతీలు, అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం ప్రజల్లో చైతన్యం రగిలిస్తోంది. తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలనే సంకల్పం ప్రతి గ్రామంలో కనిపిస్తోంది. ఈ నెల 9 నుంచి గ్రామాల్లో అధికారులు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కో-ఆప్షన్‌ సభ్యులు, స్థాయీ సంఘాల సభ్యులు పాదయాత్రలు చేపట్టారు. ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు కూడా అక్కడక్కడా పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు. గ్రామాల్లోని వీధుల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తిస్తున్నారు. నాలుగు ప్రధానాంశాలపైన దృష్టిసారిస్తున్నారు. పారిశుధ్యంలో కూలిన ఇండ్లు, పాడుబడిన పశువుల కొట్టాలు, వీధుల్లో పిచ్చి మొక్కల తొలగింపు, పాడుబడిన బావుల పూడ్చివేత, నిరుపయోగ బోర్ల తొలగింపు, మురుగు కాలువలను శుభ్రం చేయడం, ప్రభుత్వ కార్యాలయాలల్లో పారిశుధ్యం నెలకొల్పేందుకు, సంతలు, మార్కెట్ల ప్రదేశాలను శుభ్రం చేసేందుకు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్త బుట్టల ఏర్పాటు, చెత్తను డంపింగ్‌ యార్డుల్లోనే వేసేలా స్థానికులను ప్రోత్సహించడం వంటి ప్రధాన అంశాలతోపాటు వైకుంఠధామాలకు స్థలాలను గుర్తించడం వంటి విషయాలను ఇందులో గుర్తిస్తున్నారు. బుధవారం కూడా పాదయాత్రలు కొనసాగుతాయని డీపీఓ ఎం రఘువరణ్‌ తెలిపారు.

ప్రణాళికల తయారీకి సిద్ధం
ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 12న అన్ని గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం, విద్యుత్‌ సమస్యలపై వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. ప్రణాళికల తయారీలో సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులతోపాటు తాజాగా ఎన్నుకున్న కో-ఆప్షన్‌ సభ్యులు, నాలుగు రకాల స్థాయీ సంఘాల సభ్యులు కీలకం కానున్నారు. గ్రామస్తులు కూడా ఈ ప్రణాళికలో విస్తృతంగా పాల్గొనాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామసభలు నిర్వహించి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయా గ్రామాల పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయి. పాదయాత్రల్లో గుర్తించిన సమస్యలను శ్రమదానాల ద్వారా కూడా పరిష్కరించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవలి. ప్రతి గ్రామంలో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామైక్య సంఘాలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి గ్రామాల్లో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం అందించిన సూచనల్లో పేర్కొంది. మహిళా సంఘాలకు ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించాలని కూడా నిర్ణయించారు. దీంతో పెద్దఎత్తున గ్రామాల్లో పారిశుధ్యం పనులు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పర్యవేక్షిస్తున్న డీపీఓ, ప్రత్యేకాధికారులు
గ్రామాల్లో నిర్వహిస్తున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను జిల్లా పంచాయతీ అధికారి ఎం రఘువరణ్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని కూడా ప్రత్యేకాధికారులు నియమించారు. వీరు కాకుండా ఎంపీడీఓలు, ఎంపీఓలు కూడా గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం డీపీఓ చొప్పదండి మండలం కొలిమికుంట, రుక్మాపూర్‌ గ్రామాల్లో పర్యటించి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా? లేదా? అని రికార్డులు తనిఖీ చేశారు. గ్రామాల్లోని వీధుల్లో పర్యటించి పారిశుధ్యం పనులను పరిశీలించారు. కొలిమికుంటలో వీధుల్లో పెరిగిన వయ్యారిభామ, ఇతర పిచ్చి మొక్కలను శ్రమదానం ద్వారా తొలగించేందుకు ప్రణాళికలు చేసుకోవాలని స్థానిక సర్పంచు, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. పచ్చదనం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నిర్వహిస్తున్న నర్సరీలను పరిశీలించి అక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయి?, ఈ రెండు గ్రామాల్లో ఉన్న డిమాండ్‌కు సరిపోతాయా? లేదా అడిగి తెలుసుకున్నారు. 30 రోజుల ప్రణాళికపై గ్రామాల్లోని గోడలపై నినాదాలు రాయాలనీ, ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యం విస్తృతంగా పెంచాలనీ, అలాంటప్పుడే గ్రామాల్లో సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. పాదయాత్రల ద్వారా గుర్తించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు అవసరమైన వార్షిక, పంచవర్ష ప్రణాళికలను గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరి సమక్షంలో రూపొందించుకోవాలని సూచించారు. శ్రమదాన కార్యక్రమాల్లో స్థానిక యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలను ఎక్కువ భాగస్వామ్యులను చేయాలని సూచించారు. అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.

110
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles