గండిపేటలో అర్చకుల వరుణ జపం

Thu,July 11, 2019 01:12 AM

మొయినాబాద్ : వేదపండితుల మంత్రోచ్ఛరణలు.. విరాఠపర్వం పారాయణం.. హనుమాన్‌చాలీషా పారాయణం.. కలిశాభిషేకాలతో వరుణ జపం ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో 13 మంది వేదపండితులతో బుధవారం ఆలయానికి సమీపంలో ఉన్న గండిపేట జలాశయంలో వరుణ జపం చేశారు. చిలుకూరు ఆలయానికి చెందిన ఐదుగురు అర్చకులు, సఫిల్‌గూడలోని వేదభవనం నుంచి శ్రీరామ గణపాటి శిశ్య బృందం ఏడుగురితో కలిసి జలాశయంలో వరుణ జపం చేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య వరుణ జపం చేయగా, ఆ ప్రాంతం మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. ఉదయం 10గంటలకు స్వామివారిని తీర్థ ప్రసాదాలకు కలశంలో తీసుకెళ్లి జలాశయంలో కలిపి వరుణజపం ప్రారంభించారు. నాబీ(నడుముభాగం) వరకు నీటిలో నిలబడి 13 మంది వేద పండితులు మంత్రోచ్ఛరణలతో మధ్యాహ్నం 12 గంటల వరకు జపం చేశారు. 108 సార్లు(11 ఆవృతులు) వరుణదేవున్ని ప్రార్థిస్తూ మంత్రా లు జపించారు. అనంతరం జలాశయంలోని నీళ్లు కల శంలో తీసుకొచ్చి ఆలయంలోని గరుత్మంతుడికి అభిషేకం చేశారు. స్వామివారికి ఎదుట ఉన్న హన్మంతుని పాదాలకు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగరాజన్ ఆలయానికి స్వా మివారి దర్శనార్దం వచ్చిన భక్తులచే వరుణ జప మంత్రాన్ని చెప్పించారు. చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రదక్షిణలు చేసే భక్తులు అదనంగా రెండు ప్రదక్షిణలు చేసి వర్షాలు సమృద్ధిగా కురువాలని స్వామివారిని మొక్కుకున్నారు. వర్షాలు కురిసే వరకు భక్తులు అదనంగా ప్రదక్షిణలు చేయాలని ఆలయ పూజారులు భక్తులకు సూచించారు.

ప్రజలు సుభిక్షంగా ఉండాలి
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్
దేశంలోని ప్రజలు, సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు సమృద్ధిగా కురువాలని వరుణ జపం చేయడం జరిగిందని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ అన్నారు. వేంకటేశ్వరస్వామికి గండిపేట జలాశయం ప్రియమైన జలాశయం. ఆయనకు ఒక పుష్కరిణి. ప్రతి ఏడాది చక్రస్నానం చేసే జలాశయం ఈ జలాశయం ఎండిపోతే కరువు సంభంవించే ప్రమాదం ఉంది. వరుణ జపం చేయడం వలన సమృద్ధిగా వర్షాలు కురువడానికి అవకాశం ఉంటుందని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని జలాశయాలు నీటితో కళకళలాడటానికి వర్షాలు కురువాలని వరుణజపం చేశాము. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్, అర్చకులు సురేశ్‌స్వామి, సుదర్శన్‌స్వామి పాల్గొన్నారు.

193

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles