లుఖ్మానె హకీం సుప్రసిద్ధ వైద్యులు. ఆయన పేరుతో ఖురాన్లో ఒక అధ్యయమే ఉంది. వందల సంవత్సరాలపాటు ఎన్నో రోగాలకు చికిత్స చేశారు. అరుదైన వైద్యుడిగా గుర్తింపు పొందారు. ‘మనిషి రోగానికి ప్రేమ, ఆదరణకు మించిన ఔషధం లేదనే విషయం తనకు బోధపడింద’ని ఆయన చెబుతుండేవారు. ఒకసారి లుఖ్మానె హకీంతో ‘ఒకవేళ ఈ ఔషధాలు కూడా పనిచేయకపోతేనో?’ అని ప్రశ్నించారు. దానికి ఆయన చిన్నగా నవ్వి ‘ప్రేమ పాళ్లు పెంచండి’ అని బదులిచ్చారు. ప్రేమపూర్వకమైన స్పర్శను మించిన ఔషధం లేదంటారాయన.
వైద్యుడు ప్రత్యక్ష దైవం. అందుకే వైద్యులకు, వైద్యానికి ఇస్లామ్ ధర్మం ఎనలేని ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ఒక ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవాళి ప్రాణాలు కాపాడటంతో సమానమని ఖురాన్ పేర్కొన్నది. ‘ఒకసారి దైవ ప్రవక్త ఇబ్రాహీం (అలై) దైవాన్ని ‘ప్రభూ వ్యాధి ఎవరి తరఫు నుంచి వస్తుంద’ని అడిగారు. అప్పుడు సృష్టికర్త తరపు నుంచి అని సెలవిచ్చాడు అల్లాహ్. మళ్లీ ఆయన ‘మందు ఎవరి తరపు నుంచి?’ అని ప్రశ్నించారు. ‘మందు కూడా నా తరఫు నుంచే” అని సమాధానమిచ్చాడు దేవుడు.
‘అలాంటప్పుడు వైద్యుని అవసరమేంటి?’ అన్నారు ఇబ్రాహీం (అలైహి). ‘వైద్యునితో ఔషధం ఇవ్వడం జరుగుతుంది’ అని సెలవిచ్చాడు దైవం. వైద్యుడి గొప్పదనం అంతటిది. రోగులను వైద్యులు నవ్వుతూ పలకరించాలి. రోగి చెప్పింది పూర్తిగా వినాలి. అతనికి ధైర్యాన్ని నూరిపోయాలి. ప్రేమపూర్వక స్పర్శతో ఉపశమనం కలిగించాలి. దీంతో తనకు ఏం కాదన్న నమ్మకం రోగికి ఏర్పడుతుంది. రోగం సగం నయం అవుతుంది.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076