విడిపోయి బతకలేమని..ప్రేమజంట ఆత్మహత్య

Sat,November 16, 2019 09:08 PM

కథలాపూర్: పాఠశాల స్థాయిలో వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ప్రయణం డిగ్రీ దాకా సాగింది. ఏళ్లుగా ప్రేమించుకున్న వారు విడిపోయి బతకలేమని భావించి చివరకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో శనివారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కథలాపూర్ మండలం రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష(18), లకావత్ మహిపాల్(18) మండలంలోని సిరికొండ శివారులో ఒకే చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజారాం తండాలో భూక్య బుల్లి-తిరుపతి దంపతుల కూతురు శిరీష, అదే గ్రామానికి చెందిన లకావత్ సూర్యనాయక్-ప్రమీల దంపతుల కొడుకు మహిపాల్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.


శిరీష ప్రస్తుతం కోరుట్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, మహిపాల్ కరీంనగర్‌లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరి ప్రేమ విషయం ఇరు కుటంబాల పెద్దలకు తెలిసింది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందిన యువకుడితో శిరీషకు నిశ్చితార్థం జరిగింది. మరో రెండు నెలల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటివలే మహిపాల్ కరీంనగర్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ గ్రామం నుంచి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం సిరికొండ శివారులోని అటవీప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలం పక్కనే మృతులిద్దరివీ బ్యాగులు, పుస్తకాలు పడేసి ఉన్నాయి. మెట్‌పల్లి సీఐ రవికుమార్, కథలాపూర్ ఎస్‌ఐ రాజప్రమీల ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

2212
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles