బతుకమ్మ మీదా వివక్ష!


Mon,October 8, 2012 12:19 AM

ఆంధ్ర పాలకులు తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని ‘వేర్పాటు ఉద్యమం’ అంటూ ఆడిపోసుకుంటుంటారు. కానీ వేర్పాటు ధోరణితో ఇంతకాలం పాలించింది ఆంధ్ర పెత్తందారులే. వారి మెదళ్ళలో గూడుకట్టుకుపోయిన వేర్పాటు భావనను, ఆధిపత్య అహంకారాన్ని తెలంగాణ జనం అనుదినం గుర్తు చేయవలసి వస్తున్నది. ఆంధ్ర పాలకుల వివక్ష మీద అడుగడుగునా పోరాడవలసి వస్తున్నది. తెలంగాణ ఆడిబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో ఆడిపాడే బతుకమ్మ పండుగకు గుర్తింపు కోసం కూడా విజ్ఞప్తులు, వేడుకోళ్లూ అవసరమా? దీనిని అధికారిక పండుగగా ఎన్నడో గుర్తించాల్సింది. తెలంగాణ ఉద్యమం బలపడిన తరవాత, ఒత్తిడి పెరగడంతో 2010లో బతుకమ్మకు రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. ప్రభుత్వం ప్రతి జిల్లాకు కేవలం లక్ష రూపాయలు ఖర్చు చేసింది. ఆ సొమ్ము ఏ మూలకూ సరిపోదు.

అయినప్పటికీ కనీసం రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చారు కదా అని తెలంగాణ జనం సరిపుచ్చుకున్నారు. ఈ పద్ధతి ప్రతి ఏటా కొనసాగుతుందని అనుకున్నారు. కానీ పోయినేడాది ఆ మాత్రం నిధులు కేటాయించలేదు. దీంతో ఈ ఏడాది మళ్ళీ అడగవలసి వస్తున్నది. జనాభాలో సగం మంది ఏటా జరుపుకునే సామూహిక ఉత్సవాలకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వానికి మనస్కరించడం లేదు. ఇది తెలంగాణ పట్ల, అందులో మహిళల పట్ల సర్కారు వివక్షకు నిదర్శనం. గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతానికే భారీ నిధులు కేటాయించిన దురాగతాన్ని తెలంగాణ జనం ఇంకా మరిచిపోలేదు. సమ్మక్క సారక్క జాతరను కూడా రాష్ట్ర పండుగగా గుర్తించింది తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరువాతనే. తెలంగాణ అంతటా శనివారం నుంచే బాలికలు బొడ్డెమ్మ ఆడుకుంటున్నారు. వచ్చే సోమవారం నుంచి బతుకమ్మ మొదలవుతుంది. అయినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఒక్క బతుకమ్మ విషయంలోనే కాదు, భాషా సంస్కృతుల పట్ల మొత్తంగా వివక్ష చూపుతున్నారు గనుకనే మా రాష్ట్రం ఏర్పడితే ప్రతిదానికీ అడుక్కునే దుస్థితి పోతుందని తెలంగాణ జనం ఉద్యమిస్తున్నారు.
బతుకమ్మ ప్రపంచంలోనే విశిష్టమైన సామాజిక పర్వదినం.

తెలంగాణలో బతుకమ్మ కానీ, దసరా కానీ ఊరు ఊరంతా సామూహికంగా జరుపుకునే పండుగలు. ఎవరి ఇంటిలో వారు కదలకుండా తిని కూచునేవి కాదు. బతుకమ్మ పండుగకని అత్తగారిళ్ళలోని ఆడబిడ్డలు తల్లిగారింటికి చేరుకుంటారు. తమ తోబుట్టువులతోనే కాదు, చిన్ననాటి స్నేహితులతో బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. కష్ట సుఖాలు చెప్పుకుని సేద తీరుతారు. పప్పు పలారాలు పంచుకుని తింటరు. బొడ్డెమ్మ, బతుకమ్మ సందర్భంగా ఆడపిల్లలు అన్ని రకాల పప్పుల పొడులు, ముద్దలు దాదా పు నెల రోజులపాటు తింటూ ఉంటారు. పోషకాహార నిపుణుల ప్రకారం ఇటువంటి పొడు లు, ముద్దలు ఎదుగుతున్న ఆడపిల్లలకు, మహిళలకు ఎంతో ఆరోగ్యకరం. పూలతో జరుపుకునే ఈ పండుగ ప్రాధాన్యం పర్యావరణానికి హాని కలుగుతున్న ఈ కాలంలో మరింత పెరిగింది. బతుకమ్మ సాహిత్యం విస్తృతమైనది. మహిళల అంతరంగం, కష్ట సుఖాలు, సమాజం పోవడి, అత్తగారింటికి వెళ్ళే బిడ్డలకు బుద్ధులు చెప్పడం, చారివూతక ఘటనల వంటి అనేక అంశాలు బతుకమ్మ పాటలలో ఉంటాయి.

సున్నితమైన శృంగారంతో పాటు నవరసాలు కలబోసిన పాటలూ పాడుకుంటారు. ఇటువంటి అనేక పాటలను తరతరాలుగా గ్రామీణ స్త్రీలే స్వయంగా అల్లుకుని పాడడం ఆశ్చర్యకరం. అనేక సామాజికాంశాలు దాగి ఉండే ఈ బతుకమ్మ సాహిత్యం, సంస్కృతి మేధావులకు, పరిశోధకులకు బంగారు గని వంటిది. ఇంతటి గొప్ప పండుగ ఆంధ్ర పాలనలో వివక్షకు గురవుతున్నది. స్త్రీలు ఏటా కొన్ని రోజుల పాటు సామూహికంగా ఆనందోత్సాహాలతో గడిపితే, ఆ ప్రభావం సమాజ ఆరోగ్యంపై ఎంత గాఢంగా ఉంటుందో సామాజిక శాస్త్రవేత్తల అంచనాకు అందదు. ప్రభుత్వానికి ఏ మాత్రం విజ్ఞత ఉన్నా ఈ పండుగను మరింత ప్రోత్సహించాలె తప్ప ఉపేక్ష తగదు.

రాష్ట్ర ప్రభుత్వానికి మహిళాభ్యుదయం మీద ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ సమయం మించి పోలేదు. ఇంకా వారంరోజుల వ్యవధి ఉన్నది. ఈ వారంలోగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసి బతుకమ్మ పండుగకు సకల సౌకర్యాలు కల్పించవచ్చు. బతుకమ్మ ఆడే స్థలాన్ని అన్ని విధాలా సౌకర్యవంతంగా తీర్చిదిద్దవచ్చు. వివిధ ప్రభుత్వ శాఖలు మహిళలను విద్యావంతులను చేయడానికి, ప్రభుత్వ పథకాల గురించి వివరించడానికి ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో నుమాయిష్ జరిగినప్పుడు ఎట్లానైతే స్టాల్స్ ఏర్పాటు చేస్తారో, అట్లనే ప్రతి ప్రభుత్వ శాఖ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మహిళలకు చేరువ కావచ్చు.

మహిళల కోసం ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇస్తున్న ప్రోత్సాహకాలు, రుణాలు వెల్లడించవచ్చు. మహిళల హక్కులు- చట్టాలను వారికి తెలుపవచ్చు. గర్భస్థ శిశు హత్యకు వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు. మహిళలకు తమ ఆరోగ్యం గురించి, ఆహారం గురించి అవగాహన కలిగించొచ్చు. గర్భిణీలు తీసుకునే జాగ్తత్తలు, పిల్లల పెంపకం వివరాలు అందించవచ్చు. కుటుంబ నియంవూతణ పద్ధతులను వివరించవచ్చు. మహిళ విద్యావంతురాలైతే కుటుంబ మంతా..సమాజమంతా విద్యావంతమైనట్టు. ప్రభుత్వం ఏడాది పొడుగునా సాధించలేని లక్ష్యాలను ఈ కొద్ది రోజులలో సాధించవచ్చు. మహిళల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పుకునే ప్రభుత్వం మహిళలంతా ఒక చోట చేరే అరుదైన సందర్భాలను ఎందుకు ఉపయోగించుకోకూడదు. దీని వల్ల తక్కువ వ్యయ ప్రయాసలతో ఎక్కువ ఫలితాలు సాధించవవచ్చు. బతుకమ్మ పండుగను సామాజికార్థికాభివృద్ధి సాధనంగా ఉపయోగించుకోవడం కష్టమేమీ కాదు. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలె. తెలంగాణ పట్ల వివక్ష చూపే సర్కారు బతుకమ్మ పండుగపై ఇంత ఆసక్తి కనబరుస్తుందని కలలో కూడా ఆశించలేం. తెలంగాణ ఏర్పడిన తరువాత మన ప్రభుత్వం ఊరూరా బతుకమ్మ పండుగ ఏర్పాట్లు, నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలె. ఈ సారి బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జరుపుకోవాలె.

35

VIJAYKUMAR GATIKA

Published: Tue,October 9, 2012 12:49 AM

అవహేళన తగదు

యూపీఏ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీకి అల్లుడైన రాబర్ట్ వాద్రా తనపై వచ్చిన ఆరోపణలకు సూటిగా, వివరంగా జవాబ