‘మట్టి మనిషి’ జ్ఞాపకం


Sat,April 6, 2013 08:04 PM

Title-1 talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ వైతాళికులలో ఒకరు పొట్లపల్లి రామారావుగారు (1917-2001) చనిపోయినపుడు 2001 సెప్టెంబర్ 10న ప్రజాతంవూతలో రాసిన వ్యాసం యిది. దాదాపు పదకొండేళ్లు గడిచేవరకు డా.ఎమ్.భూపాల్‌డ్డి పొట్లపల్లి ఫౌండేషన్ (వరవూపసాదరావు మొదలయినవారి) కృషివల్ల ఆయన సమక్షిగసాహిత్యమనదగిన కవిత్వం, ‘ వచనం, వాటితోపాటే పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం, సాహిత్యంపై డా.ఎమ్.భూపాల్‌డ్డి పిఎచ్‌డి పరిశోధనాక్షిగంథం వెలుగు చూసాయి. జూన్ 3, 2012న ఈ గ్రంథాల ఆవిష్కరణ జరిగిన సందర్భంగా మరోమారు ఆ సాహిత్య వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ........

మా ఊరు దార్శనికుడు
బాజార్‌కు పోదాం రమ్మన్నాడతను
బాజార్‌లో ఏముంటుందన్నాను నేను
బాజార్‌లో మట్టి ఉంటుంది
అన్నాడతను నవ్వుతూ
ఒక విచివూతమైన మట్టి తళుకు
అతని నవ్వులో ఉంది
అది నాకు నచ్చింది
మట్టి! మట్టిలో ఏముంది
అని అడిగాను నేను
మనుషులు
అతడు అత్యంత సహజంగా అన్నాడు
నేను కాసేపు స్తబ్దంగా నిలబడిపోయాను
ఆ తర్వాత ఇద్దరమూ బయల్దేరాం
మట్టీ మనుషుల అన్వేషణలో
అక్కడికి చేరుకొని మాకు ఆశ్చర్యమేసింది
బాజార్లో మట్టీ లేదు మనుషులు లేరు
ఆ రెండింటినీ అక్కడినుంచి
తుడిచిపె
(బాజార్ హిందీ కవిత ‘ కేదార్‌నాథ్ సింహ్)

అటువంటి బాజార్లో హఠాత్తుగా తెలిసింది పొట్లపల్లి రామారావుగారు చనిపోయిన వార్త. భోరున దుఃఖం వచ్చింది. కానీ బిగ్గరగా ఏడ్చే కాలమా, స్థలమా ఇది. బజార్లో తుడిచి పెట్టేసిన మట్టి స్థానంలో మనుషుల స్థానంలో, మురికి మట్టి, మర మనుషులు వచ్చి చేరారు.రోడ్డు మీదున్నాం.పట్ట పగలు ‘పల్లెటూరు లాంటి మహానగరం.

ఎనభై ఆరేళ్లు నిండుబతుకు బతికి చనిపోయిన మనిషి కోసం దుఃఖం వస్తుందా. ఏమో నాకు తెలియదు కానీ నా ఆరేళ్ల వయసు నుంచి తెలిసిన మనిషి. చిగురిస్తున్న సాహిత్య జీవితం మీద తన వనంలో పెంచుకున్న మొక్క మీద చూపినంత ప్రేమతో ప్రభావం వేసిన మనిషి. మా రెండు కుటుంబాలకు ఆయనే కాదు, ఆ ముగ్గురన్నదమ్ములకు ‘మా బాపు అన్నయ్యల నాటి నుంచి ఉన్న అనుబంధం వల్ల, మా ఇద్దరికీ ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్న మల్లంకుంటదేవుని మాన్యంలో ఒక పెద్ద మామిడిచెట్టు కూలిపోయి నట్లనిపించింది.

మా ఊరు చినపెండ్యాల పొట్లపల్లి రామారావుగారి ఊరు తాటికాయలను నా చిన్నప్పుడు వాగు కలుపుతుండేది వానాకాలంలో. మిగతా అన్ని కాలాల్లో ఆయన తోటలోంచి వీచే గాలి అప్పుడు ఎండిపోయి ఉండే వాగు ఇసుకలోంచి అడ్డం పడి కాలిబాటన ఆయన తోటలోకి తీసుకపోయేవి. ముఖ్యంగా ఎండాకాలం సెలవుల్లో.

కాలిబాట ప్రస్తావన వచ్చింది కదా ‘కాలిబాట. కలకాలం నిలవాలిట. రాజుగారి కోట ఉన్నా రాణిగారితో ఉన్నా సాగిపోవు కాలిబాట.. రామారావు గారి సుదీర్ఘ గేయం. పెండ్యాల కిషన్‌రావు (మా ఊరి నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలానికే కమ్యూనిస్టు పార్టీ నాయకుడెన పెండ్యాల రాఘవరావుగారి పెద్ద కొడుకు. ఆ తర్వాత కాలంలో మార్చ్ కవితా సంకలనానికి సంపాదకుడు. విరసం సంస్థాపక కార్యవర్గ సభ్యుడు. విమోచన సంపాదకుడు) నేను తాటికాయలకు పోయేప్పుడే కాదు మా ఊరు బస్‌స్టాండ్ బర్సనగడ్డమీంచి ఎదురేటి కుంటమీదుగా రైల్వే లైను ఎక్కి ఇంకో వాగులోకి దిగేదాకా తరచుగా పాడుకునే మార్చింగ్ సాంగ్స్ శ్రీశ్రీ మరో ప్రస్థానం, రామారావు కాలిబాట.
Potlapally-In talangana patrika telangana culture telangana politics telangana cinema
వాళ్లు ముగ్గురన్నదమ్ములు. పొట్లపల్లి రామచంవూదరావు, రామారావు, శ్రీరంగరావు. ఆ ముగ్గురితోనే కాదు, బహుళా వాళ్ల తండ్రి కాలంలో, వాళ్ల పిల్లల కాలంలో నాకు తెలిసి మాకు మూడు తరాల అనుబంధం.వాగు కారణంగా తాటికాయల ఊరికి రోడ్డుండేది కాదు. వాగును రద్దుచేసి ఇపుడు ఆ ఊళ్లోకి కూడా రోడ్డు, బస్సు, ఆటోలు కూడా వచ్చాయి. ఆ రోజుల్లో వాళ్లు హనుమకొండకు పోవాలన్నా, బస్సెక్కి ఎటు పోవాలన్నా మా ఊరి మీదుగా బర్సనగడ్డ బస్ స్టేజీ దగ్గరికి వెళ్లాలి. మధ్యన మా ఇల్లు మంచినీళ్లు తాగడానికి ఒక మజిలీ: మా దామోదరరావు అన్నగారు బర్సనగడ్డకు వెళ్లే కచ్చా రోడ్డు (ఇప్పుడు తారురోడ్డు) పక్కన ఇల్లు కట్టుకున్నాక ఇంక ఇళ్లు దాటేసిపోయే సమస్యే లేదు. పైగా రామారావుగారు సాయంకాలాలు బస్సుకు పోతే ఆయనతోపాటు బర్సనగడ్డ దాకా నడిచి ఆయన మౌనాన్నో ఆ మౌనం నుంచి మాగివచ్చే మాటలనో వినడం ఒక అనుభవం.

ఒకసారి వట్టికోట ఆళ్వారుస్వామి గారు తాటికాయలకు పోతూ మా రాగవులన్నయ్యను కలవడానికి మా ఇంటికి వచ్చారు. సాయంకాలం అవుతున్నది కనుక ఇంట్లోకి రాలేదు. అప్పటికే కవిగా, కథకుడుగా అన్నయ్యపేరు తెచ్చుకున్నాడు. అప్పుడేనేనాయన స్ఫురదౄపాన్ని చూడడం. ఆయన వెళ్లిపోయాక అన్నయ్య చెప్పాడు. ఆయనకు క్షయ. రామారావుగారి తోటలో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొని ఆయన సాహిత్య కృషి కొనసాగిస్తాడు అని. (ఆళ్వారుస్వామి గారికి అక్కడ కాలు నిలిచిందని నేననుకోను. అక్కడ రామారావుగారి ఆత్మవేదన గేయ సంపుటం ప్రెస్ కాపీ తయారుచేసుకొని బయల్దేరి ఉంటాడు). అప్పటి నుంచీ తోటలో రామారావుగారిని చూడాలని.

తాటికాయలకు వెళ్లడానికి మాకు రెండు సందర్భాలు. ఒకటి చెప్పనక్కర్లేదు. సాహిత్య సందర్భం. మా దామోదరరావు అన్న గారితో కలిసిపోతే వ్యవసాయ సందర్భం కూడా. తరచుగా ఆయనను తోటలోనే కలిసేవాళ్లం. మొట్టమొదటి సారి మా చిన్నతనంలో తోటలో కలిసినప్పుడు అది వాగు ఒడ్డునే ఉంది కనుక ‘వాగు కథ తెలుసా’ అని అడిగాడు. ఈ వాగు కథ తెలిస్తే మన రెండు ఊళ్ల చరిత్ర తెలుస్తుంది. మా ఊరు అని ఈ చరిత్ర రాస్తున్నాను. అని దాని ప్రవాహశైలి ఎట్లా మారుతూ వస్తున్నదో దానితోపాటే ఊరు, మనుషులు ఎట్లా మారుతూ వస్తున్నారో చెప్పాడు. ఇంటి దగ్గర కలిసిన సందర్భాల్లో ఆయన ఎడతెగని భాగాలు వినిపించేవాడు.

మేము ఎదుగుతున్న కొద్దీ ఆయన ఎంతటి మేరు పర్వతమో అర్థమవడం మొదలయింది. ఆయన మీద రోమారోలా ప్రభావం కూడా అర్థమైంది. కుగ్రామంలో ఉంటున్న తత్వవేత్తలాగా మాకనిపించే వాడాయన. ‘ఆఖరిసారిగా 99 ఎండాకాలంలో అన్నదమ్ములం ముగ్గురం (అప్పటికే మా రాగవులన్నయ్య చనిపోయాడు) మధ్యాహ్నమే బయల్దేరి ఆయనను చూడడానికి వెళ్లాం. ఆ శిథిల గోడల వెనుక మూడు ఇళ్లల్లో ఒక్క ఆయన ఇంట్లోనే ఆయన, ఆయన భార్యా ఉన్నారు. మంచినీళ్లు ఇచ్చాక మా మనసులోని ప్రశ్నే ఆయన వేసుకొని ఇక్కడ మీకెట్లా తోస్తుంది అని అడుగుతారా నన్ను. ఇటువంటి నిరామయ సమయంలో వచ్చినవాళ్లు. ఈ నిరామయమే నా కెంతో మంచి స్నేహమని చెప్తే వాళ్ల కర్థమవుతుందా. ఈజీ చేర్లో కూర్చుంటూ పడిపోయిన గోడల మీంచి కనిపిస్తున్న ఆకాశం వైపు చూపుతూ అదిగో ఆ ఆకాశం, గాలీ, చెట్లు, పక్షులు ‘ఎంత కాలక్షేపం’ అన్నాడు. కొత్తగా రాసినవి వినిపించి అక్షరదీప్తి ప్రచురణ కథ చెప్పి చేతికి పుస్తకం ఇచ్చాడు.

ఒక చెత్త కాగితాలు అమ్ముకునే వ్యాపారి ‘తాను సేకరించిన కాగితాల్లో ‘చుక్కలు’ చదివి ముగ్ధుడై ఆ పుస్తకం మీది అడ్రసుతో వెయ్యి రూపాయలు పంపుతూ తన స్పందన రాసాడుట. డబ్బు నిరాకరించవద్దని కోరాడట. ఆ స్పందనకు అబ్బురపడి మిమ్మల్నొకసారి చూడాలి అని రామారావుగారు కార్డు రాసారట. ఆయన తాటికాయలకు వెతుక్కుంటూ వచ్చారు. రామారావుగారు ఆతిథ్యమిచ్చి తన రచనలు వినిపించాడు. ఈ వెయ్యి రూపాయలతో వీటిలో వీలయినన్ని అచ్చు వేయాలనుకుంటున్నానని చెప్పాడట. ఆయన ఇంకో మూడు వేలు ఇచ్చాడట. అట్లా ఆయన 93లో అచ్చేసుకున్నదే అక్షర దీప్తి కవితా సంకలనం (పుస్తకం పేరులోగానీ, గెటప్‌లోగానీ ఏ ఆకర్షణా లేదు కదూ. అవేమీ పట్టని వేదాంతి ఆయన. లోపల ఒక్కసారి ఆయన ఆత్మజ్వలనం చదివి చూడండి. ఒక ప్రాకృతికమైన మనిషి గుండెలు కొలచుకొని వచ్చే మాటలు).

1967 మే 29 ప్రాంతంలో నేను, కిషన్‌రావు రెండు జాముల పొద్దుండగా ఆయన ఇంటికి పోయాం. మంచినీళ్లు ఇచ్చి, కూర్చోండి అని లోపలికి వెళ్లి ఒక దినపవూతిక తెచ్చాడు. లోపలి పేజీల్లో ఒక వార్త చదవమని ఇచ్చాడు. చదివినంత సేపు మా వైపు అట్లా తదేకంగా చూస్తూ ఉన్నాడు. మేం ముగించి తల ఎత్తి ఆయన మొహంలోకి చూసే వరకు, ఆయన మా కళ్లల్లోకి చూస్తూ ‘ ఇక దేశంలో ఊళ్లు ఎప్పటికీ ఇదివరికటిలా ఉండవు అన్నాడు. మేమట్లాగే ఆశ్చర్యంగా చూస్తున్నాం. గ్రామీణ సంబంధాలు మారిపోతాయి, భూ సంబంధాలు మారిపోతాయి. ఈ భాషలో కాదు ఆయన భాషలో తాత్వికంగా వివరించాడు. ఇంతకీ ఏమిటా వార్త ‘బెంగాల్ డార్జిలింగు జిల్లాలో నక్సల్బరీ అనే గ్రామంలో సంతాలీ ఆదివాసులు పదివేల మందికి పైగా జోతేదార్ల భూములు గొడ్డళ్లు, కత్తులు, నాటు తుపాకులు, విల్లమ్ములు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. నాటు తూపాకీతో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను మే 23న చంపారు. మే 25న వాళ్లపై పోలీసు ఫైరింగు జరిగి పదకొండు మంది మరణించారు. అందులో నలుగురు స్త్రీలు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

ఆగస్టు మొదటి వారంలో హర్యానా దిశా సాంస్కృతిక మంచ్ సాంస్కృతిక కార్యక్షికమాల్లో నక్సల్బరీ సంస్కృతి గురించి చెప్పమన్నారు. ఏ రాజకీయ దృక్పథం లేనివాణ్ని నక్సల్బరీ శ్రీకాకుళంతో ఎట్లా ప్రేరణ చెందానో చెప్తూ రామారావు గారి ఈ అబ్జర్వేషన్ చెప్పాను. వింటున్న వాళ్లందరూఆయన ఎవరండీ? నిజంగా విజనరీ అన్నారు. ఆయన గురించి చెప్పాను. రచయిత, తత్వవేత్త, జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన క్రియాశీల కార్యకర్త. కృషీ వలుడు. సాహిత్య వ్యవసాయంకాదు. రెండూ ఈ దేశంలో ఒక రైతు వలె భూమి నుంచే పండించినవాడు.

మార్చ్ కవితా సంకలనం వెలువడి, జూలె 4, 1970న హైదరాబాద్‌లో విరసం ఏర్పడిన తర్వాత పుస్తకం ఇవ్వడానికి, రచయితల సంఘం పెట్టామని చెప్పడానికి కిషనూ నేనూ ఆయన దగ్గరికి పోయాం. మార్చ్ కవితా సంకలనం తిరగేస్తూ రక్తంలో డ్రమ్స్, రక్తంలో మార్చింగ్ సాంగ్స్ అంటూ సాగిన కవిత దగ్గర ఆగిపోయి ఇదే కవిత్వం శబ్దాలు, బాధలు రక్తంతో కలిసి ఎట్లా కవాతు చేస్తున్నాయో చూడండి అన్నారు.
కాళోజీ వలెనే రామారావుగారు కూడా నిరంతరం అధ్యయనపరుడు. ఆయన చదువుతున్న పుస్తకాల్లోని నచ్చిన విషయాలేవో చెప్తుండేవాడు. ఆయనపైన, కాళోజీపైన రోమారోలా ప్రభావం గురించి ఇటీవలె కాళోజీ నా గొడవ ముందుమాటలో ప్రస్తావించాను. కాళోజీ ఆత్మకథ నా గొడవ ముందుమాట (స్వేచ్ఛాసాహితి ప్రచురణ ‘ 95)లో కూడా రామారావుగారి ప్రస్తావన తెచ్చాను. రామారావు గారు ఇంట్రావర్ట్ అని, కాళోజీ వ్యక్తిత్వం రామారావుగారిలో కానీ పరిపూర్ణం కాదని నా అవగాహన.అట్లాగే కాళోజీ సోదరులలో ఒక అవిభాస్య భాగం రామారావుగారు.

ఆయన కొన్నాళ్లు నక్కలగుట్టలో రామేశ్వరరావు గారి ఆవరణలోనే ఉన్నారు. అపుడక్కడన్నీ మామిడిచెట్లు ఉండేవి. అప్పుడు, ఇంకెప్పుడయినా హనుమకొండకు వచ్చిన సందర్భంలో కాళోజీ ఇంట్లో మిత్ర మండలి సమావేశంలో ఆయన ఎక్కువగా శ్రోత. కొత్తగా రాస్తే వినిపించేవాడు.ఆయన చుక్కలు కవితోక్తులు మొదటిసారి మిత్రమండలియే వేసింది (1965). ఆశ్చర్యంగా ఆ తర్వాత పునర్మువూదణక్కూడా ఎక్కడో దేవీనగర్ (బళ్లారి)లో ఉన్న మిత్రమండలి చేసింది (1974).
పగ్, సరఫరాప్‌ా అనే రెండు నాటికలు ఆయన నిజాం వ్యతిరేక జాతీయోద్యమ కాలంలోనే రాసాడు. తెలంగాణ పోరాట నాటకాలు నాటికలపై కాకతీయ యూనివర్సిటీలో పరిశోధన చేసిన డాక్టర్ కామేశ్వరి (సువూపసిద్ధ కమ్యూనిస్టు యోధుడు చిర్రావూరి లక్ష్మీనర్సయ్యగారి కోడలు అని ఆయనను గుర్తు చేసుకోవడానికే నేను చెప్తే ఆమెకు ఐడెంటీని గురించిన కోపం రాదనుకుంటాను) ఈ రెండు నాటికల గురించి త్వరలో ప్రచురించనున్న తన గ్రంథంలో రాసింది. ఇటీవలె ఆ పుస్తకంలో మళ్లీ వాటి గురించి చదివాను.

ఇట్లా ఆయన కాళోజీ సందర్భంలోనో, కామేశ్వరి సందర్భంలోనో నా హృదయంలోకి వస్తూ పోతూ ఉన్నాడు గానీ ఎన్నడూ సాహిత్య వ్యక్తిత్వం గురించి రాసే అవకాశం రాలేదు. ఆఖరిసారి కలిసి అక్షరదీప్తి తెచ్చుకున్నప్పుడు రాయాలని ప్లాన్ చేసుకున్నాను గానీ 99 నుంచీ తరుముతున్న పరిస్థితులే.
రామారావుగారి రచనలన్నింట్లో ప్రసిద్ధమైంది జైలుకథా సంకలనం. తెలంగాణ పోరాటంలో పాల్గొని జైలులో కూర్చొని రాసినకథలు కాబట్టి కూడా వాటికా ప్రాచుర్యం వచ్చింది.అప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం సరేసరి, దానిదే పై చెయ్యి. కాని కాంగ్రెస్ జాతీయోద్యమం గురించి కూడా చెప్పాలి. ఘనపురం స్టేషన్ కేంద్రంగా పల్లగుట్ట, మార్కాపురం, వెంకటావూదిపేట, పెదపెండ్యాల వంటి పెద్ద గ్రామాలు తాటికాయల, చినపెండ్యాల వంటి చిన్న గ్రామాలు కొంత ఆ ప్రభావంలో ఉండేవి.

ఘనపురం స్టేషన్ చిన్న పాటి సూర్యాపేట లేదా జోగిపేట. అక్కడి వైశ్యులందరు ఆంధ్ర మహాసభ జాతీయోద్యమంలో భాగమే. సీతారామాంధ్ర గ్రంథాలయం, సీతారామాంధ్ర జాతీయ పాఠశాల వాళ్ల చొరవతోనే నిర్వహించబడేవి. పార్శి ఈశ్వరయ్య అప్పటి కాంగ్రెస్ నాయకుడు. రామారావుగారు చనిపోగానే సంస్మరించుకున్న సన్నిహిత సాహిత్య మిత్రుల్లో పార్శి వెంక గారు ఆ వారసత్వంలో నాకన్న కాస్త పెద్దవాడు.ఈ జాతీయ పాఠశాలలో ఆ తర్వాతకాలంలో ఉస్మానియా కాలెజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి రిటైరయిన రుక్మారావుగారు, గరిమిళ్లపల్లి లక్ష్మీనర్సయ్య, మా అన్నయ్య పెండ్యాల శేషగిరిరావుగారు ఉపాధ్యాయులుగా పనిచేసేవారు.పెదపెండ్యాలలో మేర లక్ష్మయ్య, జగన్నాథంలతో బుర్రకథ బృందం ఉండేది. ఇల్లెందు నుండి అడ్లూరి అయోధ్యరామకవి బుర్రకథలు రాసేవాడు. వీళ్లతో కలిసి చెప్పేవాడు.

ఇప్పుడు మేర లక్ష్మయ్యగారు మాత్రం బైపాస్ సర్జరీ జరిగి మా ఉళ్లోనే స్వాతంవూత్యసమరయోధుడుగా స్థిరపడ్డాడు.పల్లగుట్టలో పొట్లపల్లి రామగోపాలరావుగారు మా ప్రాంతానికే ప్రముఖ కాంగ్రెస్ నాయకులు. సౌమ్యుడు, విద్యావంతుడు. పల్లగుట్టలో ఆంధ్రమహాసభ ప్రాంతీయసభ వంటిది జరిపి సర్దార్ జమలాపురం కేశవరావుగారిని ఆహ్వానించారు. ఇసుకపోస్తే రాలని జనం పాల్గొన్న ఆ సభకు ముఖ్యఅతిధిగా ముతకబట్టలు, ఊర్లు నడిచి ఎర్రదుమ్ము కొట్టుకున్న మోటు పాదాలతో జమలాపురం కేశవరావుగారు కాలినడకన రావడం కళ్లల్లో ఆడుతున్నది. ఈ సభ చూడడానికి మా పెద్దన్నయ్య పెండ్యాల రామానుజరావుగారు నన్ను మా ఊరినుంచి సైకిల్‌పై పిలిపించుకున్నారు. రామగోపాలరావుగారు ఆ తర్వాత కాలంలో ఒకసారి పార్లమెంటుకు కూడ పోటీ చేసారు.

ఈ జాతీయోద్యమంతో విడదీయరానిదే గ్రంథాలయోద్యమం. ఘనపురంలోనే కాదు మా ఊళ్లో (అపుడు చాల చిన్నది) మా పెద్దన్నయ్యలిద్దరు, పిల్లలమర్రి నాగభూషణంగారు మొదలయిన వాళ్లు కలిసి తెలంగాణ గ్రంథమాల స్థాపించారు. ఇపుడు నాకు కొత్తగా తెలిసిన విషయమేమిటంచే ఈ గ్రంథమాలయే 1945లో రామారావుగారి జెలు కథాసంకలనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత దేశోద్ధారక గ్రంథమాల మళ్లీ ప్రచురించిందేమో నాకు గుర్తులేదు. అందుకోసం చెప్తున్నాను ఈ ఉద్యమ కథంతా.
రామారావుగారి వ్యక్తిత్వం ఉద్యమజీవితం, సాహిత్యంతోనే పరిపూర్ణం కాదు. మనకు రోమారోలాలు ఉన్నట్లే ముస్నొబు ఫుకోకాలు (గడ్డిపరకతో విప్లవం) కూడ ఉన్నారు (పాపం రేగడివిత్తులు చంద్రలతకు ఈ విషయాలు తెలియకపోతే పోనీగాని మన తెలంగాణశక్తి ఏమిటో మనకు మాత్రం ఎంత తెలిసింది).

ఆయనతో మా కలయికల్లో వ్యవసాయ సందర్భాలు ఉన్నాయన్నాను గదా. మా దామోదరరావు అన్నయ్యగారితో కలిసి వెళ్లినపుడు కనీసం గంటసేపైనా తోటలు, వ్యవసాయం గురించిన చర్చ. ఇంక తోటలో కలిస్తే ఎంత కేవల సాహిత్య పిపాసి అయినాసరే ప్రకృతిసౌందర్యం గురించే కాదు తోటల పెంపకం గురించి ఆయన నుంచి వినాల్సిందే. తోటలో ఒక మామిడిచెట్టు, నిమ్మచెట్టు, పనసచెట్టు, బతాయిచెట్ల దగ్గర నిలబెట్టి మనుషుల్ని పరిచయం చేసినట్లు వాటి పుట్టుక, పెరుగుదల, ఆరోగ్యం, జబ్బుల గురించి ఆయన ఎంత మైక్రోస్కోపిక్‌గా వివరించేవాడో. ద్రాక్షతోటలు పెట్టాడు. పండ్లచెట్ల విషయంలో ఆయన చేయని ప్రయోగాలు లేవు. ఆఖరిరోజుల్లో మినహాయిస్తే రామారావుగారు ఎక్కువగా గడిపినకాలం ఆ తోటలోనే. వానమామలె వరదాచార్యులుగారు మొదలు తెలంగాణ తరం సాహిత్యవేత్తలందరికీ ఆయన తోట ఒక చలివేందిర.

1990లో బాగ్‌లింగంపల్లిలో నేనున్నపుడు ఒకరోజు కర్రపట్టుకొని ఆయన మెట్లెక్కుతూ మా ఇంటికి వచ్చాడు. ఆశ్చర్యమూ ఆనందమూ కలిగింది. మరి ఆ రోజుల్లో ఆయన కాలువిరిగి కోలుకున్నాడో తెలియదు. అయ్యో నేనే వచ్చేవాణ్ని కదా అన్నాను . నువ్వు విడుదలయ్యావని తెలిసింది. నా కొడుకు గోపాలరావు ఇక్కడే ఉంటాడు. అక్కడికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను అన్నాడు. అవి మా ఊళ్లల్లో పీపుల్స్‌వార్ ఉద్యమం వెల్లు తెలంగాణ భూముల్లో ఎర్రజెండాలు రెపపలాడుతున్న రోజులు. ఆ అన్నదమ్ముల భూముల్లోనూ జెండాలు పాతారు. తాటికాయల గ్రామం నుంచే కాదు మా ఊరినుంచీ మనకాలపు వీరులు తయారవుతున్నారు. పగిడేరులో పోలీసులు సామూహికంగా కాల్చేసిన పదముగ్గురిలో మా ఊరి కుమ్మరి మల్లన్న కూడ ఉన్నాడు.

నేను 67లో చెప్పానుగదా 90లో మనకళ్లముందు చూస్తున్నం అన్నాడు. మనమీ కాలాన్ని, మార్పును అర్థం చేసుకోవాలి అని కూడ అన్నాడు.
తెలంగాణ వైతాళికుల్లో ఒకరొక్కరే తాము చేయగలిగినంత చేసి, రాయగలిగినంత రాసి, ధ్యానానికీ, మౌనానికీ ఇవ్వదగినంత సమయమిచ్చి... రామారావుగారి వంటి వాళ్లు నిండుజీవితం జీవించి వెళ్లిపోతున్నారు.

అయితే వీళ్లలో ఎవ్వరూ పేరుకోసం వెంపర్లాడినవాళ్లు కాదు. ఉదాహరణకు మీరు దువ్వూరి రామిడ్డిగారి పేరు విన్నట్లు గంగుల శాయిడ్డిగారి పేరు విన్నారా? నల్లా నర్సింహులు, గొల్ల ఎలమంద, చాకలి అయిలమ్మ ముక్కుమీద గుద్ది తమపేర్లు నేలమీద చిందిన రక్తంతో చరివూతలో రాయించుకున్నారు గానీ తెలుగుపూంక వగయిరా తుమ్మల సీతారామమూర్తి చౌదరి సాహిత్యంలో వీళ్ళ పేర్లువింటామా?
మన శిష్ట సాహిత్య చరివూతలో పొట్లపల్లి సీతారామారావు (విమర్శన కుఠీరక) గారికి ఉన్నంత స్థానమైనా పొట్లపల్లి రామారావుగారికి ఉన్నదా నాకు అనుమానమే.

ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రసాధన సందర్భంగా పెల్లుబుకుతున్న సాహిత్య సాంస్కృతిక ఉద్యమం అపారంగా ఉన్నందున రామారావుగారి అమువూదిత రచనల్ని ప్రచురించాలి. రోమారోలా వంటి రచయితల్ని ఆయన అనువదించి ఉంటాడని నా అనుమానం. మాఊరు బృహవూదచన ఉండనే ఉన్నది. ఆయన కొడుకు గోపాలరావు హైదరాబాదులోనే ఉంటాడు. సౌమ్యుడు. రామచంవూదరావుగారి కొడుకుల్లో శ్రీనివాస్ హైదరాబాదులోనే ఉంటాడు. జగన్నాధరావు హనుమకొండలో ఉండొచ్చు. సమర్థులు సహకారభావం ఉన్నవాళ్లు. రామచంవూదరావుగారి అల్లుడు ప్రొఫెసర్ నవనీతరావు సరేసరి. ఈ కుటుంబసభ్యుల సహకారంతో పొట్లపల్లి రామారావుగారి జీవితసాహిత్యం ఆవిష్కరణ అసాధ్యం కాకపోవచ్చు. రామారావుగారిని తెలుసుకోవడం మనకు పూర్తిగా తెలియని తెలంగాణ అంతరంగాన్ని తెలుసుకోవడం.
-

వరవరరావు
(సెప్టెంబర్ 29, 2001)

37

VARAVARA RAO

Published: Wed,April 10, 2013 10:31 PM

నుస్రుత్ మొహియుద్దీన్ కోసం.. అల్విదా సాథీ

మూసీనదిలో నీళ్లున్న రోజుల్లో ఆ నది మీద ఇన్ని వంతెనలు లేవు. ప్రేమ ఉన్నచోట జీమూత అంధకారంలోను, వరద బీభత్సంలోను ఎదురీది దాటిన నది. స్న

Published: Sun,April 7, 2013 12:04 PM

తెలంగాణ నాగేటి చాళ్లల్లో ..

బురద పొలం కాని,చెలక కాని ఒకసారి అడ్డంగా,మరొకసారి నిలువుగా దున్నడాన్ని ’ఇరువాలు’ అంటాము. అంటే రెండుసార్లు అని అర్థం. బురద పొలంలో ఇర

Published: Sun,April 7, 2013 11:13 AM

గుండె తెలంగాణ ‘గొంతుకలోన కొట్టాడుతున్నది’

గుండెబోయిన శ్రీనివాస్ స్వశిక్షితుడో, సుశిక్షితుడో గానీ అతనిలో మంచి కాలమి స్టు లక్షణాలున్నాయి. కాలమిస్టు అంటే పత్రికల్లో ‘కప్పెంతో

Published: Sun,April 7, 2013 10:21 AM

ఆళ్వారు -తెలంగాణ జీవనం

ఆళ్వారు ఏదో ఒక మనిషి పేరు కాదు, అదో విధానము. విధానమంటే ఏదో ఒక కార్యవిధానము కాదు. అదొక జీవన విధానము’ అన్నాడు వట్టికోట ఆళ్వారు స్వామ

Published: Sun,April 7, 2013 08:19 AM

జయశంకర్‌తో వొడవని ముచ్చటే

జూన్ 27 బుధవారం ‘చెలిమె’లో జయశంకర్ గారి ‘వొడవని ముచ్చట’ పై సమీక్ష రాస్తూ డాక్టర్ కాసుల లింగాడ్డి నా ప్రస్తావన తెచ్చి నా మీద బాధ్యత

Published: Sun,April 7, 2013 08:13 AM

కత్తి వ్యాసానికి వీవీ వివరణ

శివసాగర్ గురించి, గద్దర్ గురించి రాసిన సందర్భాలలో కత్తి పద్మారావు నాగురించి, విరసం గురించి తనకు తోచిన రీతిలో నిందాపూర్వక ఆరోపణలు చ

Featured Articles