విద్యలో విలువల పతనం..


Sun,January 5, 2014 02:39 AM

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్య, ఒక వైద్యున్ని తయారు చేయొచ్చు.. కానీ రోగులపై చూపాల్సిన కనీస మానవత్వాన్ని అతనిలో పెంపొందించలేకపోతున్నది. ఒక మంచి రాజకీయనాయకుడినో, ప్రజాసేవకుడినో రూపొందించే సత్తా అసలే లేదు!‘ఎందుకిలా?’అని ప్రశ్నించడం మొదలుపెడితే ముందుగా దొరికే సమాధానం .. ‘మేధోవైఫల్యం’! మన మేధావులు చుట్టూ ఉన్న ప్రపం చం.. కుల, మత, వర్గ వైషమ్యాలతో తగలబడుతుంటే.., అవినీతి, ఆశ్రీత పక్షపాతం లాంటి అనేకానేక జాడ్యాలు దేశ పౌరులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే, మానవుల్లో విలువలు నానాటికీ దిగజారుతూ సమా జం ముందెన్నడూ లేనంతగా పతనమవుతుంటే అభినవ నీరోల్లా చోద్యం చూస్తున్నరు! మనిషిని మనీషిగా రూపొందించలేని ఈ విద్యావిధానాన్ని మార్చేందుకు కనీసమావూతంగానైనా ప్రయత్నించకుండా చేష్టలుడిగిచూస్తు న్నరు. పాఠ్య పుస్తకాలను రూపొందించే విద్యావేత్తలకు నేటి సమాజానికి కావాల్సిందేదో తెలియకపోవడం విచారించదగ్గదే కాదు, క్షమార్హం కానిది.

‘ఏది మనిషిలోని ఆత్మగుణాల్ని జాగృతం చేస్తుందో అది మాత్రమే విద్య’ అంటాడు మహాత్ముడు. కానీ ఈ మాటలు మేధావులుగా భావించుకునే విద్యావేత్తల చెవికెక్కడం లేదు. దేశం త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే కావాల్సింది నిపుణులు గానీ శీలవంతులు కాదనేది వీరి నిశ్చితాభివూపాయంలా కనిపిస్తున్నది. అందుకే మన విద్యావిధానం శీల నిర్మాణానికి అనుగుణంగా గాక, నిపుణులను సృష్టించడంపైనే దృష్టి సారించింది. బాగా సంపాదించడానికి ఏది పనికి వస్తుం దో ఆ విద్యను మాత్రమే పిల్లలకు అందించేందుకు తల్లిదంవూడులు కూడా ఆరాటపడుతుండడం సర్కారుకు కలిసివస్తున్నది. పారిక్షిశామిక విప్లవం, ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద దేశాల విద్యావిధానాన్ని అరువు తెచ్చుకున్న ఫలితమే ఇదంతా. ‘విలువలు మానవ జీవితంలో ఒక భాగం.. మనిషిని ఉన్నతున్ని చేసేవి విలువలే. విలువలు లేని విద్య స్పందన లేని హృదయం లాంటిది’ అంటూ విద్యలో ‘విలువల’ గురించి గాంధీజీ చెప్పుకొచ్చిండు.

1986లో రూపొందిన ‘జాతీయ విద్యావిధానం’, విద్యాసముపార్జనలో విలువలకు స్థానం కల్పించాలని నొక్కి చెప్పింది. గాంధీజీ సూచించిన బేసిక్ విద్యావిధానం ఆధారంగా గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడంలాంటి ఎన్నో లక్ష్యాలను నిర్దేశించింది. కొఠారీ కమిష న్(1964-66) కూడా ‘విలువల’ విద్య పెంపొందించాలని సూచించింది. కానీ మన పుస్తక రచయితలకు ఈ నివేదికలు చెప్పిందేదీ బుర్రకెక్కలేదు. వాటి ఆధారంగా పాఠ్య ప్రణాళికల్లో చిన్న మార్పు కూడా చేసింది లేదు. విద్యార్థుల్లో నీతి, నిజాయితీ, సత్యం, అహింస, నిరాడంబరత, ఇతరుల విశ్వాసాలపై గౌర వం, మతం కన్నా మానవత్వం గొప్పదనే సందేశం, శాంతియుత సహజీవనం, పర్యావరణ పరిరక్షణతోపాటు మూగజీవాలపై ప్రేమ, శ్రమ పట్ల గౌరవం బోధించే విలువలను పాఠ్యపుస్తకాల్లో చేర్చలేదు. పాలకులు కూడా విద్యారంగ సంస్కరణలపై ఏనాడూ దృష్టి సారించ లేదు. విద్యార్థులకు దక్కుతున్నది ‘విలువలు లేని విద్య’. సమాజాన్ని పతనం దిశగా నడిపించే విషపూరిత విద్య.

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతున్నది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ చీడలో మెజారిటీ వాటా ఉన్నత విద్యావంతులదే కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇందుకు మినహాయింపు కాకపోవడం విషాదం! రాష్ట్రంలో మొత్తం 490 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పనిచేస్తుండగా, నాలుగేళ్ల కిందే వారిలో 101 మంది అవినీతి ఆరోపణ ల్లో చిక్కుకున్నట్లు ఓ నివేదిక నిగ్గుతేల్చింది. ఉన్నత చదువులు చదివిన వీళ్లు సమాజానికి మార్గనిర్దేశనం చేయాల్సింది పోయి అక్రమ సంపాదన కోసం అర్రు లు చాస్తూ, కనీస ‘విలువల’కు తిలోదకాలివ్వడం మన విద్యావిధాన వైఫల్యం కాక మరేంటి? సమాజంలో శ్రమకూ కనీస గౌరవం దక్కకుండా పోతున్నది. రేయింబవళ్లు కాయకష్టం చేసి దేశానికి కూడుపెట్టే రైతన్నకు చదువుకున్నోళ్లు పెడుతున్న ముద్దుపేరు ‘పప్లూటూరి బైతు’! సమాజంలో అంతరాలను రూపుమాపడంలో కీలకపాత్ర పోషించే ‘శ్రమవిలువ’ను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలన్న కనీస స్పృహ విద్యావేత్తల్లో గానీ పాలకుల్లో గానీ ఎందుకు రావడం లేదు? పైగా శ్రమజీవులను కించపరచే వ్యాఖ్యలను ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులపై రుద్ద డం మన పాఠ్యపుస్తక రచయితలకే చెల్లింది! ఉదాహరణకు ప్రాథమికోన్నత స్థాయికి ముఖద్వారంలాంటి 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని అర్థశాస్త్ర విభాగంలో ముద్రితమైన ఈ వాక్యాలు చూడండి..

1. ‘విద్యలేనివాడు వింత పశువు కదా..!’(పేజీ నెం. 69): అంటే చదువుకోని వాళ్లు మనుషులు కాదా..! ఇప్పుడు భారతదేశంలోని రైతులు, శ్రమజీవుల్లో ఎక్కుమంది నిరక్ష్యరాస్యులే! ఈ విషయం పుస్తక రచయితలకు తెలియ దా?
2.‘ఆధునిక పారిక్షిశామిక సంస్థలను నెలకొల్పడం, నిర్వహించడం సామాన్యులు చేసే పనికాదు..’(పేజీ నం.170): ఇక్కడ సామాన్యులు అంటే ఎవరు? ఏ వర్గం వారు?
3. ‘మన దేశం నుంచి డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అమెరికా లాంటి దేశాలకు వలసపోతున్నారు.. ఎందుకంటే ఆయా దేశాల్లో వారి సేవలకు ఎక్కువ విలువ ఉంది.’ (పేజీ నం.168): ఈ స్థాయిలోనే ఈ ‘విలు వ’ గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నదా? మన దేశంలోనే ఉండి సేవ చేయ డం గొప్ప అని చెబితే వీరి సొమ్మేం పోయేది?
4.‘ఉపాధ్యాయులకు మోటారు కారు విలాస వస్తువు. కానీ డాక్టర్లకు అది అవసరం.’(పేజీ నం.169): అంటే ఉపాధ్యాయులకు కారు వాడే అర్హత లేదన్నమాట!
5.‘ పేద ప్రజలు ప్రధానంగా శ్రమతో జీవిస్తారు. వారి ఆదాయాలు చాలా తక్కువ. వారికి ఆస్తులు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. లేదా ఉండవు. వారికి అప్పు పుట్టదు.’ (పేజీ నం.179): శ్రమను నమ్ముకొని బతికేవారిది అసలు బతుకే కాదని ఎంత చక్కగా చెప్పారో!
6.పేజీ నం.129లో గ్రామీణ జన సముదాయాల గురించి చెబుతూ ‘వీళ్ల ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరికి మామూలు జీవితావసరాలు నెరవేర్చుకోవడం కూడా కష్టం..’ అంటూ కొనసాగించారు. ‘వారు’ అంటూ పరాయీకరణ చేసి, వ్యవసాయం చేయడం వల్ల జరిగే అనర్థాలను మన పుస్తక రచయితలు ఆరో తరగ తి విద్యార్థులకు ఎంత చక్కగా కళ్లకట్టారో! శ్రమ విలువ పట్ల గౌరవాన్ని పెంపొందించకపోతే పోనీ, కనీసం శ్రమ జీవులను కించపరచకుంటే మంచిదని ఈ పాఠ్యపుస్తక రచయితలకు ఎలా చెబితే అర్థమవుతుంది?

తెలంగాణ రాష్ట్ర కల సాకారమవుతున్న తరుణంలో, ప్రజల భాషలో లేని పాఠ్యపుస్తకాల గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆంగ్ల పుస్తకాల్లోంచి మక్కీకిమక్కీ అనువాదం, తెలుగుపా పుస్తకాల రచయితలకు అలవాటుగా మారింది. స్వాతంవూత్యానికి పూర్వం రెండున్నర జిల్లాల భాషే అలనాడు వెలువడ్డ ఆంగ్ల-తెలుగు డిక్షనరీల్లో కొలువుదీరింది. ఆ డిక్షనరీలనే ప్రామాణికంగా చేసుకొని కోస్తాంధ్ర పాఠ్యపుస్తక రచయితలు చేస్తున్న అధ్వానపు అనువాదం, సగటు తెలంగాణ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మెడిసిన్, ఇంజినీరింగ్ లాంటి వృత్తివిద్యాకోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నాంగానీ, తెలుగు మాధ్యమంలోని ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, బీఎల్‌ఐఎస్‌సీ.. లాంటి సంప్రదాయ కోర్సులకు సంబంధించిన కీలకపుస్తకాలను ఒక్కసారి తిరగేస్తే సగటు విద్యార్థి పడుతున్న కష్టమేమిటో అర్థమవుతుంది.

భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకు మన రాష్ట్రంలో ఎలాంటి విద్య అందుతోందో చూస్తే దుఃఖం రాకమానదు. ఉదాహరణకు డీఈడీ, బీఈడీకి సంబంధించిన విద్యామనోవిజ్ఞానశాస్త్రం పుస్తకంలో కొన్ని ఆంగ్ల పదాలకు మన పాఠ్య పుస్తక రచయితలిచ్చిన తెలుగుపదాలను పరిశీలించండి.. స్వయం వివర్తనం (self un folding), సంరచనాత్మకవాదం(structuralism),అనువూపయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం (applied psychology), సంచరిత పరిశీలన (participant observation), సంరచిత పరిపృచ్ఛ(strucutured interview), అసంరచిత పరిపృచ్ఛ (unstructured interview), ప్రచాలకం (operational), ప్రకార్యం (structure), అయత్న సిద్ధస్వాస్థ్యం (spontaneous recovery), లాక్షణిక (typical)తెలుగు అకాడమీ ముద్రించిన ఈ పుస్తకంలో ఇలాంటి వెగటు పదాలకు లెక్కలేదు. పిల్లల్లో భాషా వికాసం గురించి చెబుతూ (పేజీ నెం.52లో), శిశువు ఉత్తర బాల్యదశ లో ‘ధన్యవాదాలు’, ‘దయచేసి’ (thanq, please) అనే పదాలు నేర్చుకుంటడట! ఇది మక్కీకి మక్కీ తెలివి తప్ప మరోటి కాదు. అక్కడి పుస్తకరచయితలు ఆంగ్లంలో అక్కడి పిల్లలు మొదట నేర్చుకునే పదాలు రాస్తే, వాటిని కూడా మనవాళ్లు అలాగే రాసేసిన్రు. మరి ఇక్కడి పిల్లలు ఎలాం టి మాటలు మాట్లాడుతరో తెలుసుకొని రాద్దామన్న కనీస ఇంగితం మన పుస్తక రచయితలకు లేకుండా పోయింది.

మన విద్య మనిషిని మహనీయుడి గా మలచడాన్ని పక్కనబెట్టి, నిపుణుల తయారీ విషయానికే వస్తే అసలీ రాష్ట్రానికి ఎలాంటి నిపుణులు? ఎంతమంది అవసరం? అనే విషయంలో ఇటు పాలకులకుగానీ, అటు ప్రభుత్వం లో భాగస్వాములైన ఉన్నతాధికారులకుగానీ ఒక స్పష్టతంటూ లేకపోవడం విస్తుగొలుపుతున్నది. ఉదాహరణకు సుమారు 75శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డ రాష్ట్రంలో 700 దాకా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల ద్వారా ఏటా 3.38 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకొని బయటకు వస్తుంటే, పదికి మించని వ్యవసాయ కళాశాలల ద్వారా వస్తున్న బీఎస్సీ(అక్షిగికల్చర్) విద్యార్థులు ఏటా 800కు మించడం లేదు. ఇక కేవలం 40 వైద్య కళాశాలల ద్వారా ఎంబీబీఎస్ పూర్తిచేసి బయటకొస్తున్న వైద్యులు ఏటా కేవలం 5500మంది మాత్రమే! అంటే ఓ వైపు ఇబ్బడిముబ్బడిగా సమాజంలోకి డంప్ అవుతున్న ఇంజినీరింగ్ అభ్యర్థులు, సరైన ఉపాధి, సరిపడా ఉద్యోగాల్లేక విలాసాల కోసం దొంగల్లా, అసాంఘిక శక్తుల్లా మారుతుంటే, మరోవైపు వైద్యులు, వ్యవసాయనిపుణుల కొరత తీవ్రమై, ప్రజానీకం అన్నివిధాలా నష్టపోతున్నది. రాబోయే తెలంగాణ రాష్ట్రంలోనైనా ‘మనదైన భాష, నైతికవిలువలతో కూడిన ప్రజోపయోగ విద్య’కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఇక్కడి విద్యావేత్తలు, మేధావులపైన ఉన్నది.
-చిల్ల మల్లేశం

812

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ