ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?


Wed,October 10, 2012 07:59 PM

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను కోర్టు బోనెక్కించి, కఠినంగా శిక్షించాల్సిన చట్టం పెద్దల చుట్టమయి కూర్చుంది. ఆకుపచ్చని ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కన్నీటి గాథోటి చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ జిల్లా జ్వరం గుప్పిట్లో చిక్కుకుని అల్లాడుతోంది. అతిసార వ్యాధి కోరలు చాచింది. ఏజెన్సీలోనైతే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. అధికారుల లెక్కల ప్రకారమే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికి 117 అసహజ మరణాలు చోటు చేసుకున్నాయి. గడిచిన మూడు నెలల్లోనే జ్వరాలతో 170కి పైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇందులో ఎక్కువ భాగం ఏజెన్సీలోనే ఉన్నాయి. అడవి బిడ్డలంతా డెంగ్యూ, మలేరియా, డయేరియా.. లాంటి రోగాలతోనే చనిపోతున్నారని పత్రికలు ఘోషిస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం ఈ మరణాల కు కారణం ఆ రోగాలు కాదంటున్నారు. అన్ని వార్తలను ఖండిస్తూ, అభినవ నీరోల్లా చోద్యం చూస్తున్నారు.ఓ అడుగు ముందుకేసి నోటికీ పనిచెప్పారు. జ్వరాలతో ఏ ఒక్కరూ చనిపోలేదని నిన్నమొన్నటి దాకా చెప్పుకొచ్చారు. ఓ వైపు జనం పిట్టల్లా రాలుతుంటే..,అబద్ధాలతో ఎవరి నీ నమ్మించలేమని కాబోలు ఇటీవలే మనసు మార్చుకున్నారు. జిల్లాలో జ్వరాలతో చనిపోయింది ముగ్గురేననీ, ఎనిమిది మంది ని డయేరియా పొట్టనబెట్టుకున్నదనీ సెలవిచ్చారు.117లో 11 పోతే మిగిలిన 106 మంది దీర్ఘకాలిక వ్యాధులతోనే కడతేరారని తేల్చారు!
చనిపోతున్న వారిలో పాలబగ్గల పసివాళ్లు, యువతీయువకు లే ఎక్కువగా ఉన్నారు! ‘మరి వీరికున్న దీర్ఘకాలిక వ్యాధులేంటి?’ ఓ కమిటీ వేసో, ఓ వైద్య బృందాన్ని పంపో ఆ రోగాలు, అందుకు కారణాలను తేల్చాల్సిన సర్కారు చోద్యం చూస్తున్నది. అనునిత్యం మనుగడ కోసం తంటాలు పడుతూ..వూపజలను పట్టించుకునే తీరిక లేని విధంగా ప్రభుత్వమున్నది.

ఇక్కడో హృదయ విదారక సంఘటన గురించి చెప్పుకోవాలి. సెప్టెంబర్3న కాగజ్‌నగర్ మండలం బురదగూడెంలో చోటు చేసుకున్న విషాదం ఇది. ఆ రోజు ఆ గ్రామంలోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు పక్కపక్కన పడి ఉన్నాయి. అవి తండ్రీ కొడుకులవి. తండ్రి మెట్‌పల్లి జగదీశ్(35)కాగా, కొడుకు వంశీ(7). ఇద్దరూ ఎడతెగని వాంతులు, విరేచనాలతో చనిపోయా రు. కచ్చితంగా అది డయేరియానే అని ఎవరినైనా చెబుతారు. సకాలంలో ఫ్లూయి డ్స్ ఎక్కిస్తే ఇద్దరూ బతికేవారే. కానీ ఆపాటి వైద్యం కూడా వారికి ఆ ఊరిలో అందలేదు. కాగజ్‌నగర్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం లో వైద్య సిబ్బంది జాడేలేదు. మరి ఊరూరా వైద్యం మాటేంటి? అసలు వైద్యసిబ్బంది, ఆ మాటకొస్తే ప్రభుత్వోద్యోగులు స్థానికంగా ఎందుకుండరు? ఉండనివారిపై ఎందుకు చర్యలు తీసుకోరు? వేలకు వేలు జీతాలిచ్చి పనిచేయించుకోలేని అసమర్థత ఎవరిది? కారణమేదైతేనేం కేవలం 12 గంటల వ్యవధిలోనే జగదీశ్, వంశీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. తీరా కాగజ్‌నగర్ తరలిస్తుండగా మధ్యలోనే కన్నుమూశారు. ఇద్దరి శవాలనూ ఎడ్లబండిలో తెచ్చి ఇంట్లో పడేశారు. ఒకే రోజు కట్టుకున్నోడినీ, కన్న కొడుకునీ కోల్పోయిన ఆ ఇల్లాలు గుండెలు పగిలేలా రోదించింది. ఇద్దరూ పోయాక తాను బతికెందుకంటూ రోదించింది. ఎవరు చంపారు వీళ్లిద్దరినీ?వీరి చావుకు ప్రభుత్వం కారణం కాదా? ఇందులో సర్కారు నిర్లక్ష్యం లేదా? అందుకే ఆ అమాయకపు తల్లి శాపనార్థాలు పెడుతూ దోసెడు మన్ను తీసి పోసింది. తమను మట్టిలోకి తోసిన వైద్యులు, అధికారులు, అంతిమంగా సర్కా రు మీదే కావచ్చు!

అదే రోజు ఇదే జిల్లాలోని కడెం మండలం నచ్చన్‌ఎల్లాపూర్ తండాకు చెందిన లాల్యనాయక్(55), కాసిపేట మండలం సోమగూడెం తండాకు చెందిన బుక్యబన్సీలాల్(35) డయేరియాకు బలయ్యారు. అందరూ వాంతులు, విరేచనాలతో నే చనిపోయారు. ఆ రోజే కాసిపేట మండలం గుండ్లపాడుకు చెందిన చాహకటి సోంబాయి(46) అనే మహిళను జ్వరం పొట్టనబెట్టుకుంది. అంటే ఒకేరోజు అయిదుగురి బతుకు అర్థాంతరంగా తెల్లారింది. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఏ మండలంలో ఏ గ్రామంలో చూసినా నిత్యం ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. పత్రికలు రాస్తూనే ఉన్నాయి. కానీ మరణిస్తున్నది గిరిజనులే కనుక, వారి ప్రాణాలంటే ఎవరికీ లెక్కలేదు. నేటికీ అధికారులుగానీ పాలకులుగానీ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఏటా వర్షాకాలం వస్తుందనీ, వస్తే అటవీ గ్రామాల్లో ప్రజారోగ్యం అదుపు తప్పుతున్నదని ప్రతిఏటా చూస్తున్నదే. వానా కాలంలో నీరు కలుషితమవుతుందని, తాగితే రోగాలొచ్చి జనం చస్తారనీ తెలిసినా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. జిల్లాలో 45 మంది వైద్యాధికారులు సహా, 580 మంది వైద్యసిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. నాలుగేళ్లుగా ఏజెన్సీలో దోమ తెరలను పంపిణీ చేయలేదు. ఎప్పట్లాగే ఈ ఏడాదీ వర్షాకాలం వచ్చింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చాలా గ్రామాలకు రోడ్లు తెగిపోయాయి. వంతెనల్లేక వేలాది మందికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగి పోయాయి. బావు లు, బోర్లు కలుషితమయ్యాయి. పారిశుధ్యం పడకేసింది. దోమ లు పెట్రేగాయి. ఆ నీటినే తాగి, ఆ దోమల్లోనే పడుకుంటున్న గిరిజనులకు డయేరియా, మలేరి యా, డెంగ్యూ, టైఫాయిడ్.. లాంటి రోగాలు విజృంభించాయి. నిరంతరాయంగా మరణమృదంగం మోగుతూనే ఉన్నది..

స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా నిజానికి ఇక్కడి ఏ గ్రామానికీ నేటికీ రక్షిత నీరు అందడం లేదు. ప్రభుత్వం నిధులివ్వని ఫలితంగా నీటి పథకాలేవీ అమలు కావడం లేదు. పథకాలన్నీ కాగితాల్లో భద్రంగా ఉన్నాయి. ‘సమగ్ర రక్షిత మంచినీటి పథకం(సీపీడబ్ల్యూఎస్) కింద సరఫరా చేసే నీరే సురక్షితమైంది. రక్షిత మంచినీటి పథకం(పీడబ్యూఎస్) కింద సరఫరా చేసే నీరు ఎంత మాత్రం సురక్షితం కాదు..’అని ఐక్యరాజ్యసమితి ఏనాడో ప్రకటించింది. నిజానికి సీపీడబ్ల్యుఎస్ కింద నీటిని వివిధ ప్రక్రి య ల్లో శుద్ధి చేసి, ఐదు నుంచి పది గ్రామాలకు ఒకే చోటు నుంచి సరఫరా చేస్తారు. ఇది సురక్షితమైంది. కానీ పీడబ్ల్యుఎస్ కింద బోర్లు, బావులు, వాగులు, వంకలు, చెరువుల నుంచి నీటిని నేరుగా ట్యాంకుల్లోకి ఎక్కించి, అక్కడి నుంచి సరఫరా చేస్తారు. ఇది ఏమాత్రం సురక్షితం కాదు. కానీ జిల్లాలోని 886 గ్రామపంచాయతీల పరిధిలోని 1861 పల్లెలకు పీడబ్యూఎస్ కింద సరఫరా చేసే మామూలు నీరే దిక్కవుతోంది. ట్యాంకులు కూడా లేని గ్రామాల్లో బోరు నుంచే నేరుగా పంప్ చేస్తున్నారు. ఇక్కడ ‘క్లోరినేషన్’ ఊసే ఉండదు. వర్షాకాలం నీరంతా కలుషితం కావ డం, చాలాచోట్ల నేరుగా తెచ్చుకుని తాగడం వల్ల జనం పిట్టల్లా రాలుతున్నారు. పంచాయతీలకు పాలకవర్గాలున్న కాలంలో అక్కడో ఇక్కడో కనీసం నీటిలో బ్లీచిం గ్ పౌడరైనా కలిపేవారు! ప్రత్యేకాధికారుల హయాంలో అది కూడా లేకుండా పోయింది. అధికారులకు పాలనా బాధ్యతలు అప్పగించాక ప్రజలకు వారి దర్శనభాగ్యమే కరువైంది. వైద్యసిబ్బంది జాడ లేకున్నా అడిగే దిక్కు లేకుండాపోయిం ది. ‘అసలీ రాష్ట్రంలో ప్రభుత్వమున్నదా?’ అనే అనుమానం కలుగుతున్నది. ఆదిలాబాద్‌లాంటి పరిస్థితి రాష్ట్రంలో చాలాచోట్ల ఉన్నా పట్టించుకునే వారు కరువ య్యారు. ఏజెన్సీ గ్రామాలన్నీ మంచాన పడినా పాలకులకు కనిపించడంలేదు. గిరిజనుల రోదన వినిపించడంలేదు. ఆదివాసుల ప్రాణాలు ఇలా అనంత వాయువుల్లో కలిసిపోవలసిందేనా!

-చిల్ల మల్లేశం


35

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ