‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’


Fri,December 7, 2012 03:44 PM

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’
img111-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న అధ్యాపకుడు. మన పల్లె బిడ్డే...కానీ ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో సాహిత్యం, సంస్కృతులను బోధిస్తున్న ఆసియన్ స్టడీస్ టీచర్. ‘అడవి, అగ్గి’ వంటి కథలు, ‘రక్తస్పర్శ’, ‘ఇవాళ’, ‘వలస’, ‘వూరి చివర’ వంటి కవితా సంపుటులు, ‘ఆదునికత-అత్యాధునికత’, ‘కథ-స్థానికత’ వంటి సిద్ధాంత వ్యాసాలు, ‘దక్షిణాసియాలో హిందూ ముస్లిం సాహిత్య కథనాలు’ వంటి పరిశోధనా పత్రాలు- ఇవన్నీ అఫ్సర్ అంటే ఏమిటో తెలియజెప్పే కొన్ని అక్షరశస్త్రాలు. చిత్రమేమిటంటే, ఆయన మనవాడే, మొదటి ప్రపంచంలోకి వెళ్లినా స్థానికుడే. నవ్వేకళ్ల ఆ మహమ్మద్ మన ఖమ్మం బిడ్డ, ‘కౌముది’ కొడుకు. చిన్ననాడు చందోబద్ధంగా పద్యాలు రాస్తుంటే, ‘‘నువ్వు తెలుగులో రాయడం ఏంట్రా తురకోడా?’’ అన్న స్నేహితుడి వెటకారం తొలి చురక.

తర్వాత విద్యార్థిగా ఉన్నప్పటి క్రియాశీల రాజకీయాల పదును, అటు తర్వాత మిర్రర్, ఇల్లవూస్టేటెడ్ వీక్లీల్లో ఇంగ్లీషులో కవిత్వం రాసేంత ప్రీతి, అటు తర్వాత పాత్రికేయం, విమర్శ, సాహిత్య అనుబంధాల అనుబంధం, ఇప్పుడు అధ్యాపకత్వం. అది ఏ అనుభవమైనా గానీ దాన్ని కవిత్వంగా మలచుకునే లక్షణం- అదే అఫ్సర్-ఏ పని చేసినా జీవన మూలాల్లో వెలుతురు ప్రసరింపజేయడం...చీకటి కరేల్మని కదిలినట్టు వెలుతురు గుప్పిట విప్పడం...ఎక్కడైనా...అక్కడెక్కడున్నా...టెక్సాస్‌లో ఉన్నా... అస్తిత్వ అన్వేషణ...ఊరి చివరి నుంచైనా సరే గొంతు విప్పే తత్వం...ఎక్కడున్నా అడ్డా మీద నిలబడ్డమే అనగలగడం...వూరునూ, తల్లినీ మర్చిపోని ఆర్తి- అదే అఫ్సరసం. ఆయన వృత్తీ, ప్రవృత్తీ, దృక్పథాల అస్తిత్వ ఛాయల్ని పంచుకోవడానికి ఇ-మెయిల్ ఉత్తరాలతో జరిపిన ఆత్మీయ సంభాషణ ‘చెలిమి’కి ప్రత్యేకం.

అక్కడున్నపుడు ‘మీ ఊరేమిటి’ అంటే ఏం చెప్తారు?
పెంచీ చదువు చెప్పించిన వూరు చింతకాని, ఖమ్మం జిల్లా. కని పెంచిన వూరు ఎప్పటికీ మారదు. మనమే బదిలీ అవుతూ వుంటాం, కొత్త బతుకుల్లోకి. వలస అనేది మనిషి జీవితానికి ఇరుసు. వలస అనేది ఎంత బలమయిన వాస్తవికతో ‘వలస’ (2000) కవిత్వంలో తెలుస్తుంది. వలస పోవడం అన్నది అనివార్య వాస్తవికత. వలస పోకపోతే కూడు లేదు. రెక్కల మీద బతికే వాళ్లకి మరీ- పట్టెడన్నం కోసం హైదరాబాద్ వలస వచ్చి, అడ్డాలో నిలబడ్డ కూలీలమే అందరం. నేను ఇంకాస్త ముందుకు వెళ్లి పెద్ద అడ్డాలో కడుపు పట్టుకుని నిలబడ్డా. అంతే! మారింది అడ్డా మాత్రమే. వూరూ మారదు. తల్లీ మారదు. అడ్డా మారినప్పుడల్లా బతుకు మారిందేమో చూసుకోవాలి.

కవిగా, విమర్శకుడిగా అఫ్సర్ అమెరికాలో.. ఏం పని
చేస్తున్నాడు?

afsar-5-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకవికి స్థల కాల పరిమితులు లేవు. ఏ స్థలాన్నయినా, కాలాన్ని అయినా తనదిగా మలుచుకోగలిగితేనే కవిత్వం. కానీ విమర్శకుడి పరిస్థితి వేరు. నిరంతర అధ్యయనం ప్లస్ ఆలోచన- అది జీవితమైనా, పుస్తకమైనా- విమర్శకు పదును పెడుతుంది. మనం వేరే సంస్కృతుల్ని చూసే అవకాశం వున్నప్పుడు ఈ ఆలోచన భిన్నంగా ఎదుగుతుంది. టెక్సాస్ యూనివర్సిటీ భిన్న సంస్కృతుల వేదిక. అలాంటి టెక్సాస్ యూనివర్సిటీలో పని చెయ్యడం గొప్ప అవకాశం. ఇది అనేక సంస్కృతుల కేంద్రం. ఎన్ని వాదాలున్నప్పటికీ, అభ్యుదయ భావాలని అంటి పెట్టుకుని వుండే వ్యక్తిత్వం ఈ యూనివర్సిటీది. అదొక కారణం నా లోపలి కవి ఇప్పటికీ బతికే వుండడానికి.

అకడమిక్ గోరీలో పడిపోయాక కొన్నిసార్లు కేవలం అస్థిపంజరంగా మాత్రమే మిగిలిపోతాం. ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను. ఏ అనుభవాన్ని అయినా కవిత్వంగా మలచుకునే లక్షణం నా లోపల వుందనుకుంటా. ఇక్కడ విమర్శకుడిగా నేను చేస్తున్న పని నాకు తృప్తిగా ఉంది. నేను చెప్పే కోర్సులు కూడా నా హృదయానికి దగ్గరగా వుండేవే కనుక వృత్తి రీత్యా ఇతర సంఘర్షణ లేమీ లేవు. కానీ, ఇది అనుక్షణిక సవాలు లాంటి వ్యవస్థ. వొక పట్టాన ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇంకా ఇంకా నిన్ను నువ్వు వెతుక్కోమని, తవ్వుకోమని కొత్త కొత్త పనిముట్లను మన ముందు పెడ్తుంది. అమెరికన్ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఇక్కడి పరిశోధనా తీవ్రత. విమర్శనాత్మక ఆలోచన. స్కాలర్షిప్ పట్ల గౌరవం. టీచింగ్ అంటే విపరీతమైన తపన. ఇవి అన్నీ కవిగా, విమర్శకుడిగా, బుద్ధిజీవిగా నన్ను పదును పెట్టాయని గట్టిగా చెప్పగలను.

ఒక కవిగా మీ తాజా కవిత్వం, మీ కవితా పిపాస ఎట్లా వ్యక్తం అవుతున్నది? ఎటువంటి అంశాల చుట్టూ మీ హృదయం గింగిరాలు కొడుతున్నది?
అస్తిత్వ అన్వేషణ ఇప్పటికీ నా కవిత్వ వస్తువు. అందులో భాగమే స్థానికత అనే భావన గురించి ఇటీవలి కాలంలో నేను చేస్తున్న ప్రతిపాదనలు. శరీరానికి, మనసుకీ, ఆలోచనలకీ ఇప్పటికే అలవాటు అయిన వొక స్థితికి దూరంగా వున్నప్పుడు ఆ స్థితిని కొంత విమర్శనాత్మకంగా, లోతుగా చూస్తాం. వూరు అదే. కానీ, మీరు హైదరాబాద్ వచ్చిన తరువాత ఆ వూరు అలాగే వుంటుందని నేను అనుకోను. కాకపోతే, నేను హైదరాబాద్ కన్నా కాస్త పెద్ద వూరికి వచ్చా. అప్పుడు ఆ వూరి గురించి మన ఆలోచనలు మారతాయి. ఉద్వేగాలు మారతాయి. ఈ కొత్త స్థితిని చెప్పడానికే నేను ‘ఊరి చివర’(2010) కవిత్వంలో ప్రయత్నించాను. అంతర్జాతీయ అస్తిత్వం అనేది ఎంత సాహసమో ఇప్పుడు రోజురోజుకి అర్థమవుతోంది. వొక్కోసారి అది దుస్సాహసం అని కూడా అనిపిస్తుంది. కానీ, తెగింపు లేకుండా జీవితం లేదు. తెగింపు నా బతుకు తత్వం కూడా. బరితెగింపు అంటే మళ్లీ నాకు నచ్చదు. పొట్ట పట్టుకుని వొక్కసారి వూరు విడిచి వచ్చిన వాడికి ఈ తెగింపు ఒక లెక్కకాదు. ఆకలి, దారిద్య్రం అనేది దానికదే వొక దేశం. ఆ దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు రాస్తున్న కవిత్వం అంతా ఈ ఆకలి దేశంలో సంచరిస్తున్న వొక స్థానికుడి ఘోష మాత్రమే.

ప్రధానంగా మీ అధ్యయన అంశాలేమిటి? గతానికీ, ఇప్పటికీ వచ్చిన మార్పు ఏమైనా వున్నదా? ఈ మాట ఎందుకంటే, సుదూరాల నించి మళ్లీ మనకి మాతృకగా వున్న అంశాలను బేరీజు వేసుకుంటూ ఎదగడం; ప్రపంచ పౌరుడిగా ఉంటూ స్వీయ అస్తిత్వాన్ని నొక్కి చెప్పగలిగే అవకాశం రావడం అరుదైనది కదా! అటువంటి అదృష్టవంతుల్లో మీరొకరని అడగడం.....?
ithara-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaనేను ప్రధానంగా మైనారిటీ అస్తిత్వ సాహిత్యం-సంస్కృతి మీద దృష్టి పెడ్తున్నాను. మైనారిటీ అంటే ముస్లిం అని కాదు. ప్రపంచ సాహిత్య దృష్టి నించి చూసినప్పుడు మార్జిన్స్(అంచుల) నుంచి వస్తున్న సాహిత్యం అంతా మైనారిటీ సాహిత్యమే. దళితులు, ముస్లింలు అణచివేతకి గురవుతున్న అందరి సాహిత్యం. కానీ, స్థూలంగా మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలు నాకు కేంద్ర బిందువు. గతంలోనూ, ఇప్పుడూ వచ్చిన మార్పు ప్రధానంగా కొత్త విమర్శ సాధనాలు సమకూర్చుకోవడం. తెలుగు స్థానికతని, ప్రపంచ స్థానికతతో పోల్చుకొని చూసుకోగలగడం- సరిహద్దులు చెరిగిపోతున్న కాలంలో స్థానికత- అంతర్జాతీయతల మధ్య సంభాషణ అత్యవసరం అనుకుంటున్నాను. అయితే మీరన్నట్టు ఇదంతా తిరిగి స్వీయ అస్తిత్వ వ్యక్తీకరణ కోసమే.

ఎనభై, తొంభై దశకాల్లో సీరియస్ సాహిత్య విమర్శకుడిగా వుంటూ మీరు అధ్యయనం చేసి, అనుభవించిన పలవరించిన అంశాలు- విమర్శకూ, వాదనకూ పెట్టిన అంశాలు-ఆ క్రమంలో వ్యక్తమైన ఆలోచనలూ-అక్కడి నించి వెనుదిరిగి చూస్తే ఆ మార్పు ఎట్లా అనిపిస్తుంది?
1992లో ‘ఆధునికత- అత్యాధునికత’ విమర్శ వ్యాసాల్లో మొదటిసారిగా అస్తిత్వవాదాల్ని సిద్దాంతీకరించినప్పుడు అది చర్చనీయాంశమయ్యింది. అప్పటికే స్థిరపడి వున్న ప్రధాన స్రవంతి ధోరణుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. ఇప్పుడు ఆ అస్తిత్వ వాదాలే ప్రధాన స్రవంతి అయ్యాయి. అప్పుడు ప్రతిఘటించిన చాలామందే ఇప్పుడు వాటిని తలకెత్తుకునే స్థితి ఏర్పడింది. అప్పుడూ ఇప్పుడూ నాకు అర్థమయ్యింది వొక్కటే. రాజకీయ ఎత్తుగడలు వేరు, రాజకీయ దృక్పథం వేరు. సాహిత్యంలో రాజకీయ కోణం ఇంకా బలంగా వ్యక్తం కావాలన్నది నా స్థిరమైన అభివూపాయం. నేను మొదటి నించీ చేస్తున్న వాదం అదే. ఇప్పటికీ అదే అంటాను. సాహిత్యం నా దృష్టిలో అత్యంత బలమైన రాజకీయ ప్రకటన. ఎనభై, తొంభైల తెలుగు సాహిత్యం మనకి నేర్పిన పాఠం ఇదే.

ఇక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలు-ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వ పోరు పతాక స్థాయికి వెళ్లిన తరుణంలో మొదటి ప్రపంచంలో వుంటూ మూడో ప్రపంచంలో ఈ మలి తెలంగాణ వర్తమాన ఉద్యమ స్రవంతిని ఎట్లా పరిశీలిస్తున్నరు?
ముందు ఆ మొదటి ప్రపంచం, మూడో ప్రపంచం అనే భావనకి ఇప్పుడు అర్థం లేదనుకుంటా. ఇంకెక్కడి మొదటి ప్రపంచం? వర్తమాన రాజకీయార్థిక కోణం నుంచి చూస్తే, అది అస్తవ్యస్తమయ్యింది. ఇక తెలంగాణ అస్తిత్వ పోరు కేవలం తెలంగాణ సరిహద్దులకే పరిమితం కాదు. ప్రపంచంలో తెలంగాణ వాళ్లు ఏ మూల వున్నా అక్కడ తెలంగాణ ఉద్యమం వుండి తీరుతుంది. అమెరికాలో దాదాపు అన్ని పెద్ద నగరాల్లో తెలంగాణ ఉద్యమ సంఘీభావం జోరుగా వుంది. అక్కడ జరుగుతున్న నిరసనలన్నీ ఇక్కడా జరుగుతున్నవి. ఇక్కడా రచయితలు సంఘటితమవుతున్నారు. కాబట్టి, ఒక రచయితగా నేను కేవలం పరిశీలకుడిని కాను. ఈ ఉద్యమంలో భాగస్వామిని. ఆనాటి తెలంగాణ పోరాటం కంటే ఈనాటి తెలంగాణ పోరాటానికి అంతర్జాతీయత ఎక్కువ ఉంది. ప్రపంచ సంఘీభావం కూడా ఎక్కువ వున్నది.

మీరు అమెరికాలో చేపట్టిన పనులు, వాటి విజయాలు చెప్పండి?
uri-chivara-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇక్కడ నా పని మూడు రకాలుగా సాగుతుంది. వృత్తి, ప్రవృత్తి, దృక్పథం మూడింటిని కలిపే అధ్యాపకత్వం. ఆస్టిన్ టెక్సాస్ యూనివర్సిటీలో నేను చెప్పే వివిధ సాహిత్య సాంస్కృతిక కోర్సులు ఇదెలా సాధ్యమో చెప్తాయి. దళిత సాహిత్యం- సంస్కృతి మీద నేను మొదటిసారి కోర్సు రూపొందించి, పాఠాలు చెప్పాను. అట్లాగే, దక్షిణాసియా సాహిత్యం-సినిమాలు, ముస్లిం సాహిత్యం, ఆధునిక భారతీయ సాహిత్యం అస్తిత్వాలు, ఇవి నేను రూపొందించిన కోర్సులు. ఇవి బాగా విజయం సాధించిన కోర్సులు కూడా. మొదపూట్టి అయిదేళ్లు అయినా ఈ కోర్సులకు విద్యార్థులు ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్‌లో వుండడం విశేషం. ఈ కోర్సుల స్ఫూర్తితో కొంతమంది విద్యార్థులు తెలుగు సాహిత్య పరిశోధన వైపు మళ్లుతున్నారు. ఇక భాషా పరంగా, ఇక్కడి తెలుగు భాష కోర్సు అమెరికాలోనే పెద్దది. ఏటా నలభైమంది ఈ కోర్సుల నించి గ్రాడ్యుయేట్ అవుతున్నారు.

పరిశోధన, విమర్శ పరంగా సాహిత్య అనువాదాలు, వాటిమీద విమర్శ ప్రధానమయిన పని. ఈ రంగంలో తెలుగు సాహిత్యానికి వీలయినంత ప్రాధాన్యం ఇస్తాను. తెలుగు నించి తగినన్ని అనువాదాలు లేనప్పుడు నేనే సొంతంగా అనువాదాలు చేసుకొని, ఈ విమర్శ వైపు దృష్టి పెడతున్నాను. అయితే, సాహిత్య పరిధులని దాటి సాంస్కృతిక అధ్యయనం వైపు మళ్లడం చాలా అవసరం అని నాకు అనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయం మీద నేను రాసిన రచనలు వివిధ అంతర్జాతీయ పత్రికలలో, సంపుటాలలో అచ్చయ్యాయి. ప్రస్తుతం దళిత, ముస్లిం కవిత్వాల అనువాదాల పనిలో వున్నాను. అమెరికాలోని వివిధ భాషా సాహిత్య సంఘాలలో వున్నాను. కవిత్వ పఠనాలలో పాల్గొంటున్నాను. కవిగా- ఇక్కడికి వచ్చాక ఒక కవిత్వ సంపుటి వేశాను. వొక కవిత్వ సంకలనం ‘అనేక’ సంపాదకత్వం వహించాను. తెలుగు ముస్లిం సాహిత్యం అంతా కొన్ని సంకలనాలుగా తీసుకురావాలన్న ఆలోచన వుంది.

ఆస్టిన్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఆసియన్ స్టడీస్‌కి వున్న ప్రాధాన్యం? అక్కడి మీ పాత్ర గురించి చెప్పండి?
అమెరికాలోని అతి పెద్ద ఆసియన్ స్టడీస్ విభాగం టెక్సాస్ యూనివర్సిటీది. ఇది ఇప్పటికే హిందీ-ఉర్దూకి పెద్ద కేంద్రం. ఇప్పుడు ఇదే తెలుగుకు పెద్ద కేంద్రంగా మారుతోంది. ఈ శాఖలో ఆసియా సాహిత్యం, మతం, సంస్కృతికి సంబంధించిన కోర్సులు, పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో కూడా ఇండియా, చైనా, జపాన్‌లది పెద్ద పీట. నేను చెప్పే కోర్సులు మొత్తంగా ఆసియా సాహిత్య సాంస్కృతిక అంశాలకే సంబంధించినవి. నాకు ఇష్టమైన అంశాలు స్థూలంగా- మైనారిటీ మతాల ఉనికి, సాహిత్యం, సంస్కృతి. ఈ పరిధిలో నవల, కథ, కవిత్వం- ఇవి నేను ప్రధానంగా పాఠాలు చెప్పే రంగాలు. ఏమరీ, యేల్, విస్కాన్సిన్, డ్యూక్ తదితర పెద్ద విశ్వవిద్యాలయా లో ఈ అంశాల మీద ప్రసంగాలు కూడా చేశాను. ముస్లిం మౌఖిక కథనాల మీద నా మౌలిక పరిశోధనకి అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫెల్లోగా ప్రకటించింది. ఈ కథనాలు ఇపుడు పుస్తక రూపంలో రాబోతున్నాయి. అరబ్-కేంవూదిత కోణాలని స్థానిక ఇస్లాం, ముస్లిం సాంస్కృతిక ఉనికి ఏ విధంగా సవాల్ చేస్తుందో చెప్పడం నా అధ్యయనంలో ప్రధాన అంశం. వివిధ కోణాల నుంచి అంటే - మత కథనాలు, సాహిత్య కథనాల ఆధారంగా నేను ఈ అంశం చుట్టూ నా వాదన పెడుతున్నాను. నేను చెప్పే కోర్సులు కూడా అంతిమంగా ఆ చర్చ వైపు వెళ్తాయి.

అన్నట్టూ అక్కడి మీ పరిచయాలూ, నెట్‌వర్క్స్?
ఆంవూధాలో వుండగా, గుగీ, వోలె సోయింకా, గేరీ సై్నదర్ లాంటి రచయితల్ని కలవగలమా అన్న కల ఉండేది. ఆ కల కొంతలో కొంత అయినా ఇక్కడ నిజమవుతుంది. వివిధ యూనివర్సిటీలకీ, సదస్సులకీ వెళ్లినప్పుడు అట్లాంటి వారితో గడిపే అవకాశాలు బాగా దొరుకుతున్నాయి. సరే, నా నెట్‌వర్క్ అంటారా? నేను అనేక రకాల చర్చా గ్రూపులలో భాగస్వామిని. కానీ టీచింగ్, రచనా వ్యాసంగం వల్ల వీటికి పెద్ద సమయం పెట్టలేకపోతున్నా. చివరికి మిగిలేది కాగితం మీది అక్షరమే అన్న భావం కూడా లోపల బలంగా వుందనుకోండి.

సంస్కృతి, భాషల ఆధ్యయనంలో సినిమా కూడా బలమైన సాధనం అని మీరు భావిస్తున్నట్టుగా మీ యాక్టివీటిస్‌ను బట్టి తెలుస్తోంది?
అవును, సంస్కృతిలో బలమైన భాగం సినిమా, థియేటర్, ప్రజా సంస్కృతి. నేను చెప్పే కోర్సులలో ఇవి మూడూ ముఖ్యమయిన భాగం. సినిమాలుగా మారిన నవలల మీద రెగ్యులర్‌గా వొక కోర్సు చెప్తున్నా. ఆ మూడు వాహికలు మూడు భిన్న భాషలు, వాటి మధ్య సంబంధాన్ని చూసినపుడు ఆధునికత ఎట్లా మారిందో తెలుస్తుంది.

గ్లోబలైజేషన్ మిమ్మల్ని జీవన మూలాలకు అంటి పెట్టుకునేలా చేసింది. అదే రీతిలో అంతర్జాతీయ సమాజంలో ఆత్మీయమైన అంశాలను భోదించే అధ్యాపకుడినీ చేసిందీ అంటే మీరు ఒప్పుకుంటారా?
జీవన మూలాల అన్వేషణే గ్లోబలైజేషన్ నెగెటివ్ ప్రభావాల నుంచి మనల్ని కాపాడుతుంది. గ్లోబలైజేషన్‌కి సమాధానం భిన్న స్థానికతల అన్వేషణలో వుందని నాకు గట్టి నమ్మకం. ‘కథ-స్థానికత’(2010) వ్యాసాలలో నేను చెప్పాలనుకుంది అదే. రచయితగా నా వ్యక్తిత్వానికి కొనసాగింపే నా అధ్యాపకత్వం, నా పరిశోధనా. అది మీరు, చాలామంది మిత్రులు- అక్కడా-ఇక్కడా స్పష్టంగా గుర్తించడం నాకు సంతోషం.
ఒకనాడు ఇంగ్లీష్ కవిత్వం రాసిన మీరు మళ్లీ ఇప్పుడు ఇంగ్లీషులో రచనా వ్యాసంగం వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ మార్పు మీకెలా అనిపిస్తోంది?

అవును, నా రచనా వ్యాసంగం ఇంగ్లీష్ కవిత్వంతో మొదలయ్యింది. తెలుగులోకి నేను ఆలస్యంగా అడుగు పెట్టాను. వొక రకంగా తెలుగులో రాయడం అనుకోకుండా జరిగింది. నిస్సిమ్ ఏజెకీల్, కమలాదాస్, రామనుజన్ లాంటివారి ఇంగ్లీష్ రచనల్నీ తెలుగులోకి అనువదించాలన్న ఆలోచనల్తో తెలుగులోకి మళ్లాను. అప్పటికే నా ఇంగ్లీష్ కవిత్వం అచ్చయింది. డిగ్రీలో నా మేజర్ ఇంగ్లీష్ సాహిత్యం. కాలేజీలో మంచి అధ్యాపకుల వల్ల, మంచి స్నేహితుల వల్ల ఇంగ్లీష్ అంటే బలమైన ఇష్టం ఏర్పడింది. శివాడ్డి గారు ఇప్పటికీ అంటారు. అట్లా ఇంగ్లీష్‌లో కొనసాగి వుంటే అద్భుతంగా ఉండేది అని! ఇంగ్లీష్‌లో అయినా, తెలుగులో అయినా నాకు మొదట్లో ఛందోబద్ద పద్యాలు రాసే అలవాటు ఉండేది. ఒకసారి తెలుగులో పద్యం రాస్తే ‘‘నువ్వు తెలుగులో రాయడం ఏంట్రా తురకోడా?’’ అని వొక చిన్ననాటి స్నేహితుడి వెటకారం తెలుగులోకి గట్టిగా తోసింది. ఆ మిత్రుడి వెటకారం నా తెలుగు కవిత్వానికి బలాన్నిచ్చింది, వొక పొగరు నిచ్చింది. ఆ మిత్రుడి వెటకారమే లేకపోతే ఇవాళ నా కవిత్వమూ లేదు. విమర్శా లేదు. ఇక ఇప్పుడు తిరిగి ఇంగ్లీషులోకి రావడం అవసరం అయ్యింది. అంతే! ఇక్కడి నా కోర్సులలో ఎంతో కొంత తెలుగు సాహిత్యం ఉపయోగించాలన్న తపనతో కొన్ని అనువాదాలు చెయ్యడం మొదలుపెట్టాను.

పాఠకుడితో సంభాషించడం అలవడిన మీకు విద్యార్థులకు కమ్యూనికేట్ చెయ్యడం ఎట్లా ఉంది?
అది కొంచెం కష్టమైన మార్పు. కానీ, మనం అంతా మౌఖిక సంప్రదాయం నించి వచ్చిన వాళ్లం, పల్లెల నించి వచ్చిన వాళ్లం. పాటలూ, కథల నుంచి వచ్చి వాళ్లం. మనకి పాఠకుల కంటే ముందు తెలిసేది శ్రోతలే. పాఠకుడు మనకు రెండో దశ. కాబట్టి ముందు దేన్నయినా ‘మాట’లో ఎట్లా పెట్టాలన్నది మనకు కొంత అనుభవం ఉంటుంది. తరువాతి కాలంలో నేను విద్యార్థి రాజకీయాలలో క్రియశీలంగా పనిచేశాను.

పొట్టకూటి కోసం ట్యూషన్లు చెప్పుకున్నాను. ఇవన్నీ గొప్ప అనుభవాలు. ఆ అనుభవాలలో ‘పా లేడు కదా! ఒక పల్లె నుంచి వచ్చిన విద్యార్థిగా విద్యార్థుల సంఘర్షణ ఏమిటో నాకు అర్థమవుతుంది. వాళ్ల బాషా సాంస్కృతిక సమస్యలు సహానుభూతితో వినగలను, అర్థం చేసుకోగలను. లెక్చరు దంచడం కంటే ఇది కష్టమైన ప్రక్రియ అని నా నమ్మకం. ఇక్కడి విద్యార్థులు నాకు రాసే కామెంట్లలో ఎక్కువగా వాళ్లు నా వ్యక్తిత్వం గురించి రాస్తారు. కమ్యూనికేషన్ అనేది మన వ్యక్తిత్వానికి కొనసాగింపు మాత్రమే అనుకుంటాను.
.ఇది మొదటి ప్రపంచానికి.... మూడో ప్రపంచపు కొన్ని పార్శాలను అందజేయ గలగడమా... కొంచెం వివరించండి!

‘నేనే వొక మూడో ప్రపంచాన్ని...’ అనే కవిత నా ‘వలస’ పుస్తకంలో వుంటుంది. మొదటి ప్రపంచమే కాదు. ఏ ప్రపంచమైనా బాగా అర్థం కావాలంటే, మూడో ప్రపంచ కోణమే ఉపయోగపడుతుంది. ఇండియా నుంచో, లాటిన్ అమెరికానించో, ఆఫ్రికా నించో, మధ్య ఆసియా నించో వచ్చిన వాళ్లు అమెరికాని, యూరప్‌ని బాగా అర్థం చేసుకోగలరు. అందుకే, ఇక్కడ బాగా పేరున్న అధ్యాపకులు ముఖ్యంగా ఆ దేశాల నించి వచ్చిన వాళ్లు లేదా ఆ అంశాలని బోధించేవాళ్లు పరిశోధించే వాళ్లు అందుకే స్థానికత కంటే గొప్ప కొలమానం ఇంకోటి లేదని వాదిస్తాను. స్థానికతని చూసే నిశిత దృష్టి వున్నపుడు గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ.
-అమెరికాలో ఉన్న అఫ్సర్‌తో.. కందుకూరి రమేష్ బాబు

35

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె

Featured Articles