విధ్వంసకారుల వితండవాదాలు


Tue,October 9, 2012 05:47 PM

హైదరాబాద్ నగరాన్ని 5లేదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఆంధ్ర నాయకులు వేలు పెట్టే సందు ఇస్తే కాలు పెడతారు అనే విషయాన్ని చరిత్ర నిరూపించింది. తెలిసి ఇది వరకు చేసిన పొరపాట్లు మళ్లీ చెయ్యం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు ఇదే ఆఖరి నిర్ణాయక పోరాటం. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమాన్ని చూసి బెంబేపూత్తిన ఆంధ్ర పెట్టుబడిదారులు మరోసారి కొన్ని అసంబద్ధ వాదనలకు తెర తీస్తున్నారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ తెలంగాణ ఏర్పాటు చేస్తే వారికి దేశంలో ఎక్కడాలేని రక్షణలు, ప్యాకేజీలు కావాలని వాదిస్తున్నా రు. ఈ వాదనల్లో ఉన్న నేతి బీరకాయ నిజాలేమిటో పరిశీలిద్దాం.


రాష్ట్ర విభజన జరిగితే దేశ సమక్షిగతకు భంగం వాటిల్లుతుంద ని, దేశం ముక్కలు ముక్కలు అయిపోతుందని చెప్పుకొస్తున్నరు. దేశ సమక్షిగతను కాపాడటానికి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఈ భద్ర లోకుల ఆకాంక్ష. మరి దేశానికి స్వాతంత్య్రం వచ్చినంక 14 కొత్త రాష్ట్రాలేర్పడ్డాయి. దీనివల్ల దేశ సమక్షిగతకు భంగమేమీ వాటిల్లలేదు. వీరు కూడా మద్రాస్ నుంచి విడిపోయి వచ్చారు. మరి అప్పుడు వీరికి గుర్తుకు రాలేదా ఈ దేశ సమక్షిగత. మనకైతే ఒక రూలు, మందికైతే మరోరూలు.ఇదెక్కడి న్యాయం? కొందరు ఆంధ్రా మేధావులైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను పూర్తిగా రద్దు చేసి విభజనలకు, చరమ గీతం పాడాలంటున్నారు. అవును మరి వారికి కావాల్సిన విభజన జరిగింది. అప్పనంగా దోచుకోవడానికి హైదరాబాద్ రాష్ట్రం దొరికింది. ఇంకా ఆర్టికల్ 3తో వారికేమి పని. ఇదీ మన ఆంధ్ర సోదరుల అభ్యుదయ ఆలోచన.

రాష్ట్ర విభజన జరిగితే శాస్త్రీయ పద్ధతిలో జరగాలి అని, ఈ పెద్ద మనుషుల కోరిక. మరి ఆ పద్ధతి ఎట్లా ఉంటుందో ఈ మేధావులు సెలవియ్యలేదు. ఇది వరకు ఆంధ్రతో పాటు పదికి పైగా జరిగిన విభజనలలో ఏమి శాస్త్రీయత లోపించిందో వీరు వివరించలేదు. వాటి వల్ల జరిగిన నష్టమేమిటో కూడా తెలుపలేదు. 1956లో ఆంధ్ర రాష్ట్రముతో విలీనానికి ముందు ఉన్న తెలంగాణను తిరిగి తెలంగాణ ప్రజలకు ఇవ్వడమే శాస్త్రీయం. అంతకు మించి తిరిగి ఆంధ్రులకు తెలంగాణ ప్రాంతంలో ఏదైనా ‘కిరికిరి’ చెయ్యడానికి అవకాశం కల్పించే ఏ ఏర్పాటైనా అది ముమ్మాటికీ అశాస్త్రీయమే అవుతుంది.

ఆంధ్రులకు ప్రత్యేక రాయితీలు, ప్యాకేజీలు, రక్షణలు కల్పించాలంటున్నారు. వీరు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఏమేమి రాయితీలు, ప్యాకేజీలు తెచ్చుకున్నారో, ఇచ్చారో చెబితే బాగుండేది. దేశంలో స్వరాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్ర విభజన వల్ల గాని, మరే విధంగానైనా కానీ ఉన్న వాళ్లకు రాజ్యాంగం ఏమైనా ప్రత్యేక రక్షణలు కల్పించిందా? దాని అవసరము ఉందా అనే ఆలోచిస్తే బాగుంటుంది. తెలంగాణలో ఎన్నో ఏండ్ల నుంచి నివసిస్తున్న మార్వాడీలకు, గుజరాతీలకు, కన్నడీగులకు ప్రత్యేక రక్షణలు ఏమీ లేవు.వాళ్లకేమి ఇబ్బంది కలగలేదు.ఇంతకు ముందు జరిగిన రాష్ట్రాల విభజనతో ఎలాంటి పద్ధతులు అవలంబించారో అలాంటివే ఇక్కడ కూడా అమలు చెయ్యాలి. అంతకు మించి జరపాల్సిన ఔచిత్యము ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ పచ్చి స్వార్థపూరిత కోరికలు సీమాంధ్రుల రాజకీయ దురహంకారానికి నిదర్శనాలు.

తెలంగాణతో కలిసినప్పుడు ఇక్కడి ప్రజలకు ఆంధ్రులిచ్చిన హామీలు, రక్షణ గతి ఏమైందో ఒకసారి ఆంధ్ర సోదరులు సింహావలోనకం చేసుకుంటే బాగుంటుంది. ఏ ఒక్క ఒప్పందానై్ననా, హామీనైనా, రక్షణనైనా సక్రమంగా అమలు చేశారా? సుప్రీంకోర్టు దృవీకరించిన ‘ముల్కీ రూల్స్’ను పార్లమెంటు సాక్షిగా ఖననం చేశారు. నేడు సూడాన్ దేశంలో వివక్షకు వ్యతిరేకంగా పోరాడి దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశం అయ్యింది. ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ ప్రజలకు జరిగిన వివక్ష దక్షిణసూడాన్‌కు ఏమీ తీసిపోదు.
వీరి ప్రత్యేక ప్యాకేజీల పరమార్థము అదొక శేష ప్రశ్న. వారి వెనుకబడిన ప్రాంతాలకు, రాజధాని నగరానికి ప్రత్యేక ప్యాకేజీలు కావాలట. వీరు మద్రాసు నుంచి విడిపోయి వచ్చినప్పుడు అక్కడి వెనుకబడిన ప్రాంతాలకు ఏ ప్యాకేజీలిచ్చి వచ్చారు.

వారి రాజధానికి ఏ ప్యాకేజీలు తెచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఏ వెనుకబడిన ప్రాంతాన్ని వారి రెవెన్యూతో బాగుపరిచారు. పందులు తిరిగే గుడారాల్లోంచి వచ్చి, తెలంగాణ అలాశాన్ బంగ్లల్ల, చీమలు పెట్టిన పుట్టలల్ల పాముల వలె జేరి కులకడమే కాక ఇప్పుడు సిగ్గువిడిచి ప్యాకేజీలు అడుగుతున్నారు. 54 ఏండ్లుగా తెలంగాణ ప్రాంతాన్ని కొల్లగొట్టినందుకు ఇక్కడి ప్రజలు లక్షల కోట్లు లెక్కగట్టి చెల్లించాలని డిమాండ్ చెయ్యాలి. ఆ పరిహారం చెల్లిస్తే సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ విషయంలో ఆంధ్ర నాయకమ్మన్యులు వారి అంతరాత్మను పశ్నించుకుంటే మంచిది.
హైదరాబాద్ నగరానికి 400 ఏండ్ల చరిత్ర ఉంది. 54 ఏండ్ల కింద వచ్చిన ‘ఆంధ్ర కార్పెట్ బ్యాగర్స్’ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్నారు. దానిలో భాగం కావాలంటున్నారు. ఆంధ్రులు హైదరాబాద్ కంటే మద్రాస్ నగరంలో ఎక్కువ కాలం ఉన్నారు.

అక్కడ రాష్ట్ర విభజన సమయంలో మద్రాసులో 36 శాతం ఆంధ్ర వాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. అది ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల సంఖ్యకు రెట్టింపు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకున్నప్పటికీ, మద్రాసు నగరం మాకు కావాలని పొట్టి శ్రీరాములును వారి దురాశకు బలి చేశారు. చివరికి వారి సరిహద్దులో ఉండి కొంచెం హద్దు మారిస్తే వారికి కలిసి వచ్చే నగరమే వాళ్లకు దక్కలేదు. వారి సరిహద్దుకు 200 కిలోమీటర్ల పైబడి దూరంలో ఉన్న హైదరాబాద్‌లో మాకు భాగం కావాలి అని అడగటంలో వారి ‘వలసవాద కొంచెపు బుద్ధి’ అద్దం పట్టినట్టు కనిపిస్తున్నది. ఏమి మాట్లాడినా అభివృద్ధి అంటారు. ఇక చాలు మీ అభివృద్ధి. మా సంగతేదో మేమే చూసుకుంటాం. అభివృద్ధి పేరిట హైదరాబాద్ నగర చరివూతకు ఆంధ్రులు ఛిద్రం చేశారు. హైదరాబాద్ నగర చారివూతక వైభవాల్ని కూలగొట్టి, థియేటర్లు, సమాధులు కట్టుకున్నారు. ఇప్పుడు ‘మెట్రో రైలు’ పేరు మీద హైదరాబాద్ నగర చరిత్ర అస్తిత్వాన్నే మంట కలపాలని చూస్తున్నారు.

వీరికి తోడు వీరి రాజకీయ నంబర్లకు, డబ్బు సంచులకు అమ్ముడుపోయిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంది. నెహ్రూ ఆంధ్రులు, తెలంగాణ వారిని ముంచడం ఖాయం అని తెలిసీ, ఆపగలిగే శక్తి ఉన్నా ఆంధ్రుల రాజకీయ ప్రలోభానికి లొంగి తెలంగాణకు అన్యాయం చేశారు. ఉధృతంగా ఉప్పొంగిన 1969 తెలంగాణ ఉద్యమాన్ని, ఆంధ్రుల పక్షం వహించి ఇందిరాగాంధీ అతి దుర్మార్గంగా అణచివేసింది. సోనియా గాంధీ కూడా వారి ముందు తరం వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నది. ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఏడేళ్లుగా తెలంగాణ వాదంతో దాగుడుమూతలాడుతూ తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నది. తను మాత్రం నోరు విప్పడం లేదు. తన కోటరీ ద్వారా కాలికి వేస్తే మెడకు మెడకు వేస్తే కాలికి వేసే ప్రతిపాదనలు ఆంధ్ర నాయకులతో కలిసి చేయిస్తున్నది.

ప్రజలు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా సోనియాగాంధీ ఆమె అనుయాయులు మళ్లీ మతలబు సృష్టించి హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రులకు బేరం పెడతారు. 55 ఏండ్లుగా జరుగుతున్న ఈ ఘోరాలు ఆగాలంటే ఈ సారి నిర్ణయాలు పూర్తిగా తెలంగాణ ప్రజల సమక్షంలో జరగాలి. ఏ కొద్ది మంది రాజకీయ పార్టీల తెర నిర్ణయాలు ససేమిరా కుదరవు. హైదరాబాద్ నగరాన్ని 5లేదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఆంధ్ర నాయకులు వేలు పెట్టే సందు ఇస్తే కాలు పెడతారు అనే విషయాన్ని చరిత్ర నిరూపించింది. తెలిసి ఇది వరకు చేసిన పొరపాట్లు మళ్లీ చెయ్యం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు ఇదే ఆఖ రి నిర్ణాయక పోరాటం. ఆంధ్రులు మద్రాసు నుంచి విడిపోయినప్పుడు అవలంబించిన ఫార్ములా తప్ప, అంతకు తక్కువ ఏది అంగీకరించినా మళ్లీ మనం మరోసారి ఓడిపోవడమే అవుతుంది. ఈ సారి ఓటమికి ఆస్కారం లేదు. ఎంత కష్టం కలిగినా గెలుపొక్కటే మన గోలు.

-జె.ఆర్. జనుంపల్లి

40

JANUMPALLI JR

Published: Tue,October 9, 2012 05:46 PM

తెలంగాణ తెగువ

సిరిసిల్లలో రహీమున్నీసా ప్రదర్శించిన పౌరుషం, పోరాట పటిమ భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో అస్సాం బాలిక కనకలత బారువా ప్రదర్శించిన అనితర

Published: Tue,October 9, 2012 05:47 PM

దగాపడిన పాలమూరు

పాలమూరును ఆ జిల్లా ప్రజలు, బైబిల్‌లో వర్ణించిన పాలు, తేనే కలిసి ప్రవహించే ప్రాంతం పాలస్తీనా అను రీతిగా పాలు జాలువారే ప్రదేశంగా ప్ర

Published: Tue,October 9, 2012 05:49 PM

అవినీతి వ్యతిరేక ఉద్యమం- తెలంగాణ

అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చాలా గొప్పది. జన్‌లోక్ పాల్ బిల్లు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి.దీనిని సమర్థించా

Published: Tue,October 9, 2012 05:51 PM

ఇక తెగించి కొట్లాడుడే..

కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ కలిసి తెలంగాణ ఉద్యమానికి చుట్టూ రాతి గోడ కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ తెలుగుదేశం తదితరులు పూర్

Featured Articles