Chiranjeevi | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘విశ్వంభర’. పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి మునుపెన్నడూ చూడని వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. మల్లిడి వశిష్ఠ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇదిలావుంటే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. కొన్ని పాటలు, పతాక సన్నివేశాలకు సంబంధించి భారీ ఫైట్ మాత్రమే ఇక మిగిలివున్నాయని ఫిల్మ్‌వర్గాల వినికిడి.
ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ టీజర్‌ని కూడా మేకర్స్ రెడీ చేస్తున్నారట. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఇందులోని వీఎఫ్ఎక్స్ థ్రిల్ కలిగిస్తాయని, ఎం.ఎం.కీరవాణి స్వరాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న సినిమా విడుదల కానుంది.