రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వంశీ రూపొందిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్, నుపూర్ సనన్ నాయికలుగా నటిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ పాత్రను పరిచయం చేసేందుకు వివిధ భాషల నుంచి స్టార్స్ ముందుకొచ్చారు.
తమిళంలో కార్తి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో శివరాజ్ కుమార్, హిందీలో జాన్ అబ్రహాం రవితేజ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక తెలుగులో వెంకటేష్ ‘టైగర్ నాగేశ్వరరావు’ను పరిచయం చేస్తారని తాజాగా చిత్రబృందం వెల్లడించింది. 70వ దశకంలో స్టూవర్ట్‌పురం గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇందులో రాబిన్ హుడ్ లాంటి దొంగ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించనున్నారు.