ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
నటీనటులు: అలిసన్ జానీ, జర్నీ స్మోలెట్, రిడ్లే ఆషా, లోగన్ మార్షల్
డైరెక్టర్: అన్నా ఫోరెస్టర్
ఆసక్తికర మలుపులు, ఆశ్చర్యం కలిగించే ట్విస్ట్‌లతో రూపొందే థ్రిల్లర్ సినిమాలంటే సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న లూ అలాంటి చిత్రమే. లూ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. ఓ రోజు బ్యాంక్‌లోంచి పెద్దమొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకుని ఇంటికి వస్తుంది. తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను, పేపర్లను మంటల్లో తగలబెట్టి కుర్చీలో కూలబడుతుంది. పెద్ద తుపాకీ అందుకుని చనిపోవడానికి సిద్ధమవుతుంది.
అదే సమయంలో హన్నా అనే మహిళ తన ఇంట్లోకి పరుగున వస్తుంది. తన కూతురు వీ తప్పిపోయిందని చెప్తుంది. ఆ చిన్నారిని క్షేమంగా తీసుకొస్తానని మాటిచ్చిన లూ ఆత్మహత్య ఆలోచన విరమించుకుంటుంది. మరి లూ మాట మీద నిలబడిందా? చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు? ఆమెను వృద్ధనారి కాపాడిందా? లేదా? అసలు ఆమె ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
లూ విచిత్రంగా ప్రవర్తించినప్పుడే తన వెనుక ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉందని అర్థమైపోతుంది. పొరుగింట్లో ఉండే చిన్నారి వీని కనీసం ఒక్కసారైనా పలకరించని లూ.. ఆమె కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. లూగా అలిసన్ జానీ నటన అద్భుతంగా ఉంది. హన్నాగా జర్నీ స్మోలెట్, వీగా రిడ్లే ఆషా నటన ఆకట్టుకుంటుంది. ప్రీ ైక్లెమాక్స్, కథను మలుపు తిప్పే ట్విస్టు బాగుంటుంది. మీరూ థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవాళ్లయితే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉన్న ‘లూ’ చూసేయండి!