Prabhas | ఇన్‌స్టాలో అరుదుగా పోస్టులు పెడుతుంటారు ప్రభాస్. తాజాగా ఆయన ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘డార్లింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు.. వెయిట్ చేయండి..’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు ప్రభాస్. ఈ పోస్ట్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక అభిమానుల్లో అలజడి మొదలైంది. ప్రభాస్ పెళ్లి ఖాయమైందా? ఆమె ఫొటోను త్వరలో షేర్ చేయబోతున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.
ఈ స్క్రీన్‌షాట్స్ ఎక్స్‌లో వేలాదిగా షేర్స్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో కమల్‌హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన లుక్‌ని త్వరలో ‘కల్కి’ టీమ్ విడుదల చేయనుంది. ఈ ప్రమోషన్లో భాగంగానే ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టారనేది మరో వెర్షన్. నిజానిక్కూడా కమల్‌హాసన్‌కి ప్రభాస్ పెద్ద ఫ్యాన్. కమల్ తన సినిమాలో భాగం అయినప్పుడు.. ‘లెజెండ్రీ యాక్టర్ కమల్‌హాసన్‌తో కలిసి పనిచేస్తున్నాను. నా జీవితంలో శాశ్వతంగా నిలిచుండే క్షణాలివి. ఇది నాకు దక్కిన గౌరవంగా అదృష్టంగా భావిస్తున్నా’ అని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ కొత్త పోస్ట్ కూడా ఆయన అభిమాన నటుడు కమల్ కోసమే అనేది ఫిల్మ్ వర్గాల టాక్. మరి ఈ రెండిటిలో నిజం ఏదో!?