‘అపూర్వ రాగంగళ్’ నుంచి మొదలైన అపూర్వ స్నేహబంధం కమల్‌హాసన్, రజనీకాంత్లది. వీరిద్దరిలో కమల్ నటుడిగా సీనియరే అయినా.. కెరీర్ పరంగా బ్రేక్ అందుకుంది మాత్రం ఇద్దరూ దాదాపు ఒకేసారి. వీరిద్దరికీ గాడ్‌ఫాదర్ ఒకరే.. ఆయనే మహాదర్శకుడు కె.బాలచందర్. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. కాలక్రమేణా నటులుగా ఇద్దరూ చెరోదారి ఎంచుకున్నారు. కమల్ విభిన్నమైన పాత్రలతో దేశం గర్వించదగ్గ మహానటుడిగా ఎదిగితే.. రజనీ మాస్ పాత్రలతో సౌతిండియన్ సూపర్‌స్టార్‌గా అవతరించారు. ఏదేమైనా ఇద్దరూ ఇద్దరే.
ఇటీవల తమ స్నేహానుబంధం గురించి కమల్‌హాసన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘మేమిద్దరం ఒకే గురువు వద్ద విద్య నేర్చుకున్న శిష్యులం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మా మధ్య అసూయకు స్థానంలేదు. పోటీతత్వం మాత్రమే ఉంది. దశాబ్దాల స్నేహం మాది. ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఒక దశలో కలిసి నటించకూడదని అనుకున్నాం. ఎందుకంటే నటులుగా మా మార్గాలు మారాయి. కానీ ఎప్పడూ కూడా ఒకరినొకరం చులకన చేసుకోలేదు. ఇప్పడు పెద్దవాళ్లం అయ్యాం కనుక ఇలా అంటున్నానని అనుకోవద్దు. 20ఏళ్ల క్రితం కూడా మేం ఇంతే..’ అంటూ నవ్వుతూ చెప్పారు కమల్‌హాసన్.