Gangs Of Godavari | ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రివ్యూ
సినిమా : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
తారాగణం: విశ్వక్సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, గోపరాజు రమణ..
దర్శకత్వం: కృష్ణచైతన్య
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య..
సమర్పణ: సితార ఎంటర్టైన్మెంట్స్
Gangs Of Godavari | విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. తెలంగాణ ప్రాంతానికి చెందిన విశ్వక్సేన్ తొలిసారి కోనసీమ కుర్రాడిగా నటించడం, పిరియాడికల్ నేపథ్యం కూడిన కావడం ఇవన్నీ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపును చేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా జనాన్ని విపరీతంగా ఆకట్టుకోవడంతో సినీప్రియులందరూ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం ఎదరు చూశారు. తానిప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఓ ఎత్తు అని ఈ సినిమా ఇంటర్వ్యూలో విశ్వక్ చెప్పాడు.. అలాగే ఈ సినిమా విజయంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ అంతులేని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. వీరుచెప్పినదాంట్లో నిజమెంత? నిజంగా సినిమా ఆస్థాయిలో ఉందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ గురించి
ఇందులో హీరోది గోదావరిలోని ఓ లంకగ్రామం. పేరు లంకల రత్నాకర్(విశ్వక్సేన్). వృత్తి దొంగతనం. జీవితంలో ఎలాగైనా ఎదగాలనేది ఇతని లక్ష్యం. దానికోసం ఎందర్నయినా బురిడీ కొట్టించేస్తుంటాడు. ఆ ఏరియాలో.. నానాజీ(నాజర్), దొరస్వామిరాజు(గోపరాజు రమణ)ల ఆధిపత్యపోరు నడుస్తుంటుంది. వీరిలో దొరస్వామిరాజు ఆ ప్రాంత ఎమ్మెల్యే. దాంతో ఎలాగొలా దొరస్వామిరాజు పంచన చేరతాడు రత్నాకర్. నిదానంగా ఆ వర్గంలో కీలకంగా మారతాడు. ఆ తర్వాత ఆ వర్గానికే నాయకుడవుతాడు. దొరస్వామితోనే పోటీకి దిగి ఎమ్మెల్యే కూడా అవుతాడు. ఇక అక్కడ్నుంచి రత్న ఎలా మారాడు? నానాజీ కూతురు బుజ్జి(నేహాశెట్టి)తో ప్రేమలో ఎలా పడ్డాడు? రత్నాకర్‌కీ, రత్నమాలకీ ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమధానమే మిగిలిన కథ.
కథా విశ్లేషణ
ఓ అనామకుడు ఆసామాన్యుడిగా ఎదరగడం అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన పాయింటే. హాలీవుడ్ ‘గాడ్‌ఫాదర్’ నుంచి మన ‘నాయకుడు’ వరకూ, రజనీకాంత్ ‘బాషా’ నుంచి బన్నీ ‘పుష్ప’ వరకూ ఇదే ఫార్ములా. సరిగ్గా తీయగలిగితే చాలు విజయం పక్కా. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ తరహా సినిమానే. ఓ వ్యక్తి లార్జర్ దేన్ లైఫ్ ఈ సినిమా. వేశ్య దగ్గర డబ్బులు కాజేసి పారిపోయిన హీరో, అదే ఏరియాకు ఎమ్మెల్యే ఎలా అయ్యాడు? వందలకోట్లు ఎలా గడించాడు? అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన పాయింట్. అయితే.. చెప్పుకున్నంత గొప్ప తెరపై కనిపించదు. ఎమ్మెల్యే దగ్గర అనుచరుడిగా చేరడం, ఆ గ్యాంగ్‌లో ఎదగడం, చివరకు ఎమ్మెల్యేపైనే పోటీ చేసి నెగ్గడం ఇదంతా పాత చింతకాయ పచ్చడి వాసన. మోహన్‌బాబు ‘ఎం.ధర్మరాజు ఎం.ఏ’ సినిమా కూడా ఇదేకదా. విలన్ అనేవాడు హీరోని మించిన శక్తిమంతుడైనప్పుడే చూసే ఆడియన్‌కి కిక్కు. అదే బెస్ట్ మాస్ ఫార్ములా కూడా. హీరోను గొప్పగా చూపించడానికి విలన్ల పాత్రల్ని బలహీన పరిస్తే, కథలోని ఆసక్తి దెబ్బతింటుంది. దర్శకుడు ఆ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడా అనిపిస్తుంది. ఈ కథ ప్రకారం నానాజీ, దొరస్వామిరాజు చాలా శక్తిమంతమైన విలన్లు. హీరో ఎదుగుతున్న కొద్దీ, వీళ్లిద్దరూ బలహీనులైపోతున్నారు. ఇంక కథలో ఆసక్తి ఏముంటుంది. అంతేకాదు, హీరో ఎదిగే ప్రయాణంలో కూడా ఆసక్తిలేదు. ఏదో పొడిపొడిగా అనిపించింది. అంతేకాదు, హీరో ప్రేమకథలో కూడా క్లారిటీ లేదు. అసలు ఆ అమ్మాయి ఇలాంటి మొరటోడ్ని ఎందుకు ఇష్టపడింది? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇందులో రత్నమాల పాత్ర కథలో కీలకం. ఆ పాత్రను మాత్రం దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. అంజలి కూడా చక్కగా నటించింది. కత్తిని పట్టినోడు కత్తితోనే పోతాడు అనే పెద్దల నానుడికి తెరరూపాన్ని ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు కృష్ణచైతన్య. అయితే.. అది పక్కదారి పట్టింది.
నటీనటుల నటన
విశ్వక్సేన్ వన్‌మ్యాన్ షో ఈ సినిమా. చెప్పినట్టుగా ఎవరూ వేలెత్తి చూపించనంత బాగా నటించాడు. నేహశెట్టిది డిఫరెంట్ రోల్. అంజలి పాత్ర ఈ సినిమాకు హైలైట్. గోపరాజు రమణ పాత్రను ఇంకాస్త శక్తివంతంగా డిజైన్ చేస్తే బావుండేది అనిపించింది. హైపర్ ఆది కూడా బాగా నటించాడు.
టెక్నికల్‌గా
నిర్మాణ పరంగా క్వాలిటీ మేకింగ్ కనిపించింది. దర్శకుడు కృష్ణచైతన్య అన్నుకున్న స్థాయిలో సినిమాను చేయలేకపోయాడనే చెప్పాలి. యువన్‌శంకర్‌రాజా నేపథ్య సంగీతం బావుంది. పాటలు కూడా పర్లేదు. కెమెరా వర్క్ అయితే అద్భుతంగా ఉంది.
మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. ఖర్చుకు వెనుకాడని నిర్మాత దొరికినప్పుడు ప్రీప్రొడక్షన్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పేపర్ వర్క్ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఈ రెండు విషయాల్లో దర్శకుడు తడబడ్డాడు. అయితే.. మాస్ తరహా సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావారి’ నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్:
విశ్వక్సేన్, అంజలి నటన, యువన్‌శంకర్‌రాజా బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే, కథలో ఆసక్తి తగ్గడం..
రేటింగ్ : 2.25/5